బండి సంజయ్, రేవంత్ రెడ్డి..ఇప్పటికైనా కళ్ళు తెరవండి.

*కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ వృద్ధి రేటు చూడండి*
*బండి సంజయ్, రేవంత్ రెడ్డి..!*
*ఇప్పటికైనా కళ్ళు తెరవండి..*
*రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి*
*విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి..*
*అన్ని రంగాల అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం*
*సీఎం కేసీఆర్ విజన్, ప్లానింగ్, పరిపాలనా దక్షత బంగారు తెలంగాణకు బాటలు*
*- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్*
కరీంనగర్, మార్చి3 (నిజం ఈ):
కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నదని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా వెలుగొందుతున్నదని, వృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ గణాంకాలను, వృద్ధి రేటును చూసి అయినా కళ్ళు తెరవాలని, అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని వినోద్ కుమార్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం మానుకోవాలని, విమర్శలు చేస్తే అవి నిర్మాణాత్మకంగా ఉండాలని వినోద్ కుమార్ వారికి సూచించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజన్, ప్లానింగ్, పరిపాలనా దక్షత, డైనమిక్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు బాటలు వేస్తోందని వినోద్ కుమార్ తెలిపారు. కొత్త, చిన్న రాష్ట్రం అయినా తెలంగాణ దేశంలోనే చారిత్రాత్మక ప్రగతిని సాధిస్తోందని, ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదిక స్పష్టం చేసిందని వినోద్ కుమార్ వివరించారు.
జీ.ఎస్.డీ.పీ. విషయంలో కానీ, తలసరి ఆదాయంలో కానీ తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. జీ.ఎస్.డీ.పీ. లో రాష్ట్రం 11.2% శాతంతో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశ తలసరి ఆదాయం 1,49,848 ఉండగా, తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం 2,78,833 ఉందని, ఇది దేశ యావరేజ్ కన్నా అధికం అని ఆయన తెలిపారు. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగుల రేటు 0.7% శాతం మాత్రమే ఉందని అన్నారు.
” గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలను ” కల్పించాలన్న లక్ష్యం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తూ, వాటిని ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, అదే స్థాయిలో ఫలితాలను కూడా సాధిస్తున్నారని ఆయన తెలిపారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ గొప్పగా అమలు చేయడమే కాకుండా ట్యాక్స్ రెవెన్యూలోనూ దేశ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన ఉందని ఆయన తెలిపారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశానికి తలమానికంగా నిలుస్తుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.