కాయ్‌ రాజా కాయ్‌ కు అనుమతి కావాలా..అయితే 8 లక్షలివ్వండి..?

– కాయ్‌ రాజా కాయ్‌కి లైన్‌ క్లియర్‌
– 8 లక్షలకు పోలీసులతో కుదిరిన బేరం ?
– గత ఏడాది కోటికి పైగానే ఆదాయం..
– మధ్య వర్తులుగా అధికార పార్టీ నాయకులు..!

మేళ్లచెరువు ఫిబ్రవరి 27 ( నిజం న్యూస్‌ ) శివరాత్రి జాతరలో భాగంగా మేళ్లచెరువులోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ జాతరకు శివరాత్రికి ప్రభలను కట్టి రికార్డింగ్‌ డాన్సులను వేస్తుంటారు. డాన్సులు, కళ్యాణంను చూడడానికి భక్తులు వస్తుంటారు. జాతరకు వచ్చే భక్తులను ఆకర్షించడానికి కాయ్‌ రాజా కాయ్‌ ఆటను ప్రతీయేటా నిర్వహిస్తుంటారు. ఈ నిర్వాహకులు భక్తుల జేబులను గుల్ల చేసి లక్షలను వెనకేసుకుంటున్నారు. గతేడాది కోటి రూపాయల వరకు వ్యాపారం జరిగినట్లుగా తెలుస్తోంది.
అనుమతి కావాలా..అయితే 8 లక్షలివ్వండి..?
కాయ్‌రాజా కాయ్‌ ఆట నిషేధిత ఆట. మరి ఆడిరచాలంటే అనుమతి ఉండదు. దీనికి వీరు డివిజన్‌, మండల పోలీస్‌ అధికారులతో మాట్లాడుకుని ఆడిస్తుంటారని వినికిడి..? ఈ సారి ఈ ఆటను ఆడిరచాలంటే పోలీసు అధికారులు రూ. 8 లక్షలను అడగగా, ఆటను ఆడిరచేవారు మేళ్లచెరువు, వేపల మాదారం, రఘునాధపాలెం గ్రామాలకు చెందిన వారితో కలిసి బేరం కుదుర్చుకుని పచ్చ గుండు, నల్ల
గుండు ఆటలు ఆడిరచేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కాసేపు ఆటను పక్కకు పెట్టి మరలా ఆడిరచేలా ఒప్పందం చేసుకున్నారు.
కుదిరిన బేరం..?
ఈ ఆట ఆడేందుకు పోలీస్‌ వారితో వారం రోజుల నుండి కొందరు అధికార పార్టీ నాయకుల మధ్య వర్తిత్వంతో బేరసారాలు నడిపించినట్లుగా తెలుస్తోంది. సోమవారం 8 లక్షలకు బేరసారాలు కుదిరినట్టు సమాచారం. జనసముదాయం ఎక్కువగా ఉన్న చోట నాలుగు నుండి ఎనిమిది టేబుళ్లను అక్కడ అక్కడ ఏర్పాటు చేసుకుని సిండికేట్‌ గా ఏర్పడి నడిపిస్తారు. వీరందరికీ ఒక టీం లీడర్‌ ని ఎంచుకొని ఆయన చెప్పే విధంగా గేములు ఆడిస్తూ కోట్ల రూపాయలు దండు కుంటారు. గత సంవత్సరం కరోనా ఉన్నప్పుడే కోటి రూపాయల పైగా ఆట నడవగా ఈ సారి అంతకు పైగానే నడస్తుందన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తుంది. జాతరకు వచ్చే వారి జేబులు ఖాళీ చేయడానికి వీరు రెడీగా టేబుళ్లను సర్దుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆటను ఆడిరచడానికి బేరాలు చేసిన వారిని, దానికి సహాకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.