సమాచార కమీషనర్లను తొలగించాలని గవర్నర్ కు ఫిర్యాదు
సమాచార కమీషనర్లను తొలగించండి!
అర్హతలు లేవంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన యువకుడు
తమను నియమించిన కమిటీ ఏదోకూడా తెలియని సమాచార కమీషన్.
సమాచార కమీషన్ పై స”హ”చట్టంతోనే యుద్ధం
తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషనర్లకు చట్టప్రకారం ఉండాల్సిన అర్హతలు లేవని తమకు అనుకూలంగా ఉండేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కమీషనర్లను నియమించిందని వారిని తొలగించి సమాచార కమీషన్ ను ప్రక్షాళన చేయాలని ఒక యువకుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర సమాచార కమీషనర్లపై ఫిర్యాదు చేయడంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల సమాచార కమీషన్లు ఏవిధంగా ఉన్నాయో కూడా తన ఫిర్యాదులో వివరించాడు. వివరాల్లోకి వెళితే…..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన గంగాధర కిశోర్ కుమార్ అనే యువకుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. దేశంలోని ఏ రాష్ట్ర కమీషన్ ను పరిశీలించినా ప్రధాన సమాచార కమీషనర్లు మరియు ఇతర సమాచార కమీషనర్లుగా ఆల్ ఇండియా సర్వీసుల విశ్రాంత అధికారులను నియమించడం జరిగింది. మిగతా కమీషనర్లను కూడా పాతిక సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ లలో అనుభవజ్ఞులై వారిని నియమించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్ సహా కమీషనర్లు ఎవరికి ప్రభుత్వ సర్వీసులలో ఎటువంటి అనుభవం లేదు. పూర్తిగా పత్రికారంగంలో పనిచేసిన వారిని కమీషనర్లుగా నియమించారు. అంతేకాదు సమాచార కమీషనర్లలో ఒకరైన గుగులోత్ శంకర్ నాయక్ కి ఎలాంటి పూర్వానుభవం లేదు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ కు సమాచార హక్కు చట్టం ద్వారా ధరఖాస్తు చేసి ఈవివరాలు సంపాదించడం గమనార్హం.
కమిషనర్ల నియామకం కమీషన్ కే తెలియదు:-
సమాచార హక్కు చట్టం సెక్షన్ 15 సబ్ సెక్షను 3 ప్రకారం కమీషనర్లుగా నియమించడానికి ఏర్పాటు చేసిన కమీషన్ వివరాల గురించి చేసిన ధరఖాస్తును రాష్ట్ర సమాచార కమీషన్ తెలంగాణ సెక్రటేరియట్ కు బదిలీ చేయడం విశేషం. అయితే సమాచార కమీషనర్లను నియమించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్ పర్సన్ గా ప్రధాన ప్రతిపక్ష నేత ఒక క్యాబినెట్ మినిస్టర్ మెంబర్లుగా ఉన్న ఈ కమిటీ సమాచార కమీషనర్ల నియామకం కోసం గవర్నర్ కు సిఫారసు చేస్తారు. కమిటీ సూచించిన వారిని గవర్నర్ కమీషనర్లుగా నియమిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేత హోదాలో అక్బరుద్దీన్ ఓవైసీ, రోడ్లు భవనాల శాఖామాత్యులు ప్రశాంత్ రెడ్డి లు ప్రస్తుత సమాచార కమీషనర్లను సిఫారసు చేయడం జరిగింది. కానీ తమను ఎవరు నియమించారో కూడా చెప్పలేని స్థితిలో ప్రస్తుత కమీషన్ ఉండడం శోచనీయం. కమీషనర్ల నియామకం తెలియదు, వార్షిక నివేదికలు ఉండవు, చట్టం అమలుకు తీసుకున్న చర్యలూ లేవు, ప్రభుత్వ కార్యాలయాలలో పౌరసమాచార అధికారులకు శిక్షణ కార్యక్రమాలు లేనప్పుడు చట్టం మనుగడ అసాద్యంగా మారుతుంది. ఇప్పటికి సంవత్సరంన్నర కాలానికి పైగా కమీషన్ లో పిలుపుకోసం ఎదురుచూస్తున్న ఫిర్యాదులు ఎన్నో ఉన్నాయి. సుదీర్ఘకాలయాపన తర్వాత కేసులు పిలుపుకు వస్తే అప్పటికే అసలు బాధ్యులైన అధికారులు బదిలీపై వెళ్లడం వలన ప్రస్తుతం ఉన్న పౌరసమాచార అధికారులు నానా బాధలు పడుతున్నారు. తాము లేనప్పుడు పెట్టిన ధరఖాస్తులకు కమీషనర్ల చేత చివాట్లు తింటున్నారు. ఈవిషయంలో తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. ఎవరు బాధ్యులో వారిని పిలిపించే విధానాన్ని అనుసరించింది లేదు. పరిపాలనలో అనుభవజ్ఞులైన వారు మాత్రమే కమీషనర్లుగా ఉన్నప్పుడు ఇలాంటి తప్పిదాలు నిరోధించడానికి అవకాశం ఉంటుంది.
స”హ” చట్టం ప్రోగ్రామ్ వివరాలూ తెలియదు:-
సమాచార హక్కు చట్టం సెక్షన్ 26,27 ల ప్రకారం సమాచార హక్కు చట్టం పరిరక్షణకు, అమలుకు అవసరమైన నియమాలు, ప్రోగ్రామ్ లు చేయగల ప్రభుత్వ యంత్రాంగం వివరాలు కావాలని సమాచార కమీషన్ కు ధరఖాస్తు పెడితే దాన్ని కూడా ఇతర శాఖలకు బదిలీ చేశారు. అసలు సమాచార హక్కు చట్టం పై ప్రస్తుతం ఉన్న కమీషన్ కు అవగాహన ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవివరాలు కావాలని సమాచార కమీషన్ కు ధరఖాస్తు పెడితే దాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ జి.పి.ఎం & ఏఆర్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ వారికి బదిలీ చేశారు. వారు ఆసమాచారం తమకు చెందినది కాదంటూ ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేశారు. వారు కూడా ఆసమాచారం మాకు తెలియడంటూ చివరకు మళ్ళీ రాష్ట్ర సమాచార కమీషన్ వారికే తిప్పి పంపారు. కానీ రెండు నెలలు గడిచినా ఇంతవరకు సమాచార కమీషన్ నుండి ఎలాంటి వివరాలు పంపలేదు. సమాచార హక్కు చట్టం అమలుపై కమీషన్, మరియు రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎలా ఉందో దీన్నిబట్టి మనం అర్ధంచేసుకోవాలి. తమను నియమించిన కమిటీ వివరాలు కూడా కమీషన్ చెప్పలేకపోయింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగులైనా తమకు ఆ ఉద్యోగం ఎలా వచ్చిందో నిస్సందేహంగా చెప్పగలరు.కానీ సాక్షాత్తు రాష్ట్ర సమాచార కమీషన్ మాత్రం ఈ విషయం చెప్పలేకపోయింది. అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ లలో ఎటువంటి అనుభవం లేని మీడియా ప్రతినిధులు, సోషల్ వర్కర్లను కమీషనర్లుగా నియమించడం వలన చట్టం యొక్క ఉద్దేశ్యం నీరుగారిపోయింది. ఎటువంటి పాలనానుభవం లేని వీరు చట్టం అమలుకు అవసరమైన సిఫారసులు కాదుకదా కనీసం వార్షిక నివేదికలు రూపొందించడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా,కర్ణాటక సహా ఎన్నో రాష్ట్రాలలో కమీషనర్లుగా నియమించడానికి ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ విశ్రాంత అధికారులు దొరగ్గా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక్క అనుభవజ్ఞుడైన అధికారి కూడా కనిపించకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం.
కొసమెరుపు:-
ప్రస్తుత సమాచార కమిషనర్లలో ఒకరైన గుగులోత్ శంకర్ నాయక్ గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రముఖ దినపత్రికలలో వ్యాసాలు కూడా రాయడం జరిగింది. పి.హెచ్.డి కూడా పూర్తి చేసిన ఆయన రాసిన పుస్తకాలు, స్థాపించిన సంస్థలు ఆయన సామాజికవర్గానికి సంబంధించినవి కావడం గమనార్హం. కనీసం ఒక్క సంవత్సరం కూడా ఎటువంటి పరిపాలన అనుభవం లేని ఆయనను ఏకంగా రాష్ట్ర సమాచార కమీషనర్ పదవి వరించడం విశేషం. రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉండే విధంగా సర్వేసు నిబంధనలు అలాగే సమాచార కమీషనర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉండే సర్వేసు నిబంధనలు వర్తిస్తాయి. ఇంతటి ఉన్నతస్థాయి అధికారాలు ఉండే కమీషనర్ల నియామకానికి కనీస అర్హతాప్రమాణాలు ఉన్నాయా లేదా అని పట్టించుకోకుండా సోషల్ వర్కర్లు, మీడియా ప్రతినిధులతో భర్తీ చేయడం ఏమిటో అర్ధంకాని విషయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధాన ప్రతిపక్ష నేతకు కానీ క్యాబినెట్ మంత్రికి కానీ ఈ రాష్ట్రంలో ఒక్క సీనియర్ అధికారి కూడా కనపడకపోవడం ఈ విషయంలో ఇంతవరకూ ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలనకు అద్దంపడుతుంది.