మిత్రుడి మరణంతో కూతురు పెండ్లి ఘనంగా చేసిన స్నేహితులు

మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు
ఆత్మకూర్ ఎస్ ఫిబ్రవరి 24 (నిజం న్యూస్): కలసి చదువుకోవడమే కాదు, కష్టసుఖాల్లోను పాలుపంచుకోవడం చాటిచెప్పారు ఈ పూర్వ విద్యార్థులు. అకాల మరణంతో తాము చేయవలసిన కూతురు వివాహాన్ని తన తోటి విద్యార్థులు ఇటీవలే అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వేడుక మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో ఈ నెల 12న కందగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97 బ్యాచ్ పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి జరిపించారు.
తలో చేయి వేసి… రూ. లక్ష 60 వేలు పోగుచేసి..
గ్రామానికి చెందిన బైరు సైదులు ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన సైదులుకు ఒక కుమార్తె లావణ్య ఉండటంతో సైదులుతో పాటు పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆలోచన చేశారు. సైదులు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కొద్దిరోజులు మాత్రమే గుర్తు ఉంటుందని, చేసే సహాయం భవిష్యత్తులో కుమార్తె లావణ్యకు ఉపయోగపడేలా ఉండాలన్న ఆలోచనతో, రానున్న రోజుల్లో తండ్రి లేడన్న లోటును పుచ్చలేకున్నా చదువుకో, వివాహానికో తమ సహాయం తోడ్పాటు నందించాలని వసూలు చేసిన రూ. 60 వేలను అప్పట్లో బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈ నగదు ఏళ్ల కాలంలో రూ. లక్ష 60 వేలు అయ్యింది. కాగా 12న లావణ్య వివాహం జరిపేందుకు గానూ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో పూర్వ విద్యార్థులు బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదును లావణ్య వివాహానికి కావలసిన ఖర్చులకు ఉపయోగించారు. దీంతో పూర్వ విద్యార్థులు చేసిన మేలును తెలుసుకున్న కుటుంబ బంధువులు, మండల ప్రజలు,స్నేహితులు అభినందించారు.