Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వసూళ్ల రాజా ఈ అధికారి

– మామూళ్ల పేరుతో వ్యాపారస్తులను బెదిరించి వసూలు చేస్తున్న వైనం.

10 సంవత్సరాలుగా ఇక్కడే పాగా.

ప్రతి బిల్లు పుస్తకానికి ముక్కుపిండి వసూలు.

లబోదిబోమంటున్న పురుగు మందుల వ్యాపారస్తులు.

సూర్యాపేట ,ఫిబ్రవరి 23 ,నిజం న్యూస్.

ఆ అధికారి రూటే వేరు.. ఏం చేసినా జేబు నింపుకోవడం కోసమే.. కార్యాలయానికి రారు… ఫీల్డ్ వర్క్ అంటూ.. ఫర్టిలైజర్ల షాపుల తనిఖీలు అంటూ కార్యాలయం కంటే ఎక్కువ ఇతర కార్యక్రమాలపైనే.. ఆయన విధులు.. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే ఖండించాల్సింది పోయి.. అధికారే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం.. ఏ ఫర్టిలైజర్ యజమానిని సమాచారం అడిగినా చెప్తారు.. ఈ అధికారి తీరుతో పలువురు ఫెర్టిలైజర్ యజమానులు వ్యాపారాలు తీసేసి ఏదైనా ఉపాధి వెతుక్కోవడం మంచిదనే స్థితికి తీసుకువచ్చారు అంటూ వారి ఆవేదన.. ఇంత చేస్తున్నా పై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా..? లేక వసూలు చేస్తున్న మామూళ్లలో తాయిలాలు వారికి అందుతున్నాయా..? అని గుసగుసలు వినిపిస్తున్నాయి..

ప్రతి బిల్ పుస్తకంలో వ్యవసాయ అధికారి ముద్ర, సంతకం ఉండాలి.. సంతకం, ముద్ర వేయాలి అంటే 200 నుంచి 500 వరకు అప్పజెప్పాల్సిందే.. ఇలా ఒక్కొక్కటిగా తవ్విన కొద్ది బయటపడుతున్నాయి ఆ అధికారి లీలలు.

కృష్ణా, గోదావరి మూసీ నీళ్లతో వ్యవసాయం పుంజుకుంది. సుమారు 37,569 ఎకరాలు సాగు భూమి కలదు. దీనిలో ప్రస్తుతం 26 వేల ఎకరాలువరి పంట సాగు చేయగా 5 వేల ఎకరాలు పత్తి, 300ఎకరాలలో వేరుశనగ, 3 వేల ఎకరాలలో వివిధ పళ్ల కూరగాయల తోటలు, 100 ఎకరాలలో పప్పు దినుసులు పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు లెక్కలు తెలుపుతున్నాయి. ఈ పంటలకుగానూ ప్రతి రోజు రైతులు వాతావరణ పరిస్థితులు అనుకూలించక తమ పంటలకు చీడ పీడలు, తెగుళ్ల నివారణ కోసం గతంలో పట్టణాలకు వెళ్లేవారు. ప్రస్తుతం తమ గ్రామాలలోనే నిరుద్యోగులు, పురుగు మందులపై అవగాహన ఉన్న వారు అందుబాటులోని కొన్ని గ్రామాలలో 16 లైసెన్సు కల్గిన ఫర్టిలైజర్ దుకాణాలు పెట్టుకున్నారు.. ఇవే కాకుండా సుమారు 20 ఫెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ దుకాణాలు నడుస్తున్నాయి. ఆ అధికారి కన్ను వ్యాపారస్తులపై పడింది.. నిత్యం రైతులకు ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్, పురుగు మందులపై అవగాహన కల్పించి, సక్రమం గా దుకాణాలను నడిపించాలని చెప్పాల్సింది పోయి.. ఆ అధికారే వసూళ్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు దుకాణ దారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా దుకాణం శుభ్రంగా లేదంటూ ఏదో ఒక సాకుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పది సంవత్సరాలుగా ఇక్కడే పాగా వేసి అవినీతికి పాల్పడుతూ ఇష్టారాజ్యగా వ్యవహరిస్తూ, దుకాణ దారులను బెదిరిస్తూ ప్రతి షాపుకు 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని ఓ దుకాణ దారుడు తమ ఆవేదనను విన్నవించుకున్నాడు.

 

లక్షలాది రూపాయలు రైతులపై పెట్టుబడి పెట్టి , అరువు వ్యాపారం చేస్తున్న మమ్ములను ,మాటి మాటికీ పై అధికారులకు, విలేకరులకు ఇవ్వాలంటూ అక్రమ వసూలు చేస్తున్న ఈ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శాంపిళ్ల పేరుతో పెద్ద మొత్తంలో పురుగు మందుల డబ్బాలు తీసుకెళ్తున్నారని, దీంతో వ్యూపారంలో నష్టా లు చవి చూడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అవినీతిపై ఉన్న శ్రద్ధ కార్యాలయం మీద చూపడం లేదనే దానికి పేరు కనపడని కార్యాలయం బోర్డే నిదర్శనం.. కార్యాలయం పైన పేరు లేదు.. గానీ వసూళ్ళలో మనోడు రాజా అనే ముద్ర వేయకనే తప్పదు.. ఈ అవినీతి అధికారిపై పై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, లక్షల రూపాయల జీతం తీసుకుంటూ, నిర్లక్ష్యం ,అవినీతి పాల్పడుతున్న అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వ్యాపారస్తులు, మేధావులు, మండల ప్రజలు కోరుతున్నారు.