Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిఎస్ఎన్ఎల్ ఆస్తులు 95 వేల కోట్లు

బిఎస్ఎన్ఎల్ ఆస్తులు 95 వేల కోట్లు

*భారీగా తగ్గిన ల్యాండ్ లైన్ కనెక్షన్లు*

*సెల్ కనెక్షన్లు పెరిగినా ప్రయివేటుకు పోటీ లేదు

*భారీస్థాయిలో ఉద్యోగులను సాగనంపుతున్నరు

*సమాచార హక్కు చట్టంతో వెల్లడి.

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ గురించి ఆందోళనలు మొదలయ్యాయి. అయితే బిఎస్ఎన్ఎల్ సంస్థ నష్టాల్లో ఉందా లేక లాభాల్లో ఉందా అన్న విషయం సామాన్య ప్రజలకు బోధపడదు.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడమంటే రిజర్వేషన్లు తొలగించడమే. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ను కూడా ప్రయివేటుకు అప్పగించడం వెనుక ఉన్న సమస్యలు ఏమిటన్న ప్రశ్న అటుంచితే అసలు బిఎస్ఎన్ఎల్ కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ఏమిటన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్రం నుండి ఒక యువకుడు సమాచార హక్కు చట్టం కింద బిఎస్ఎన్ఎల్ న్యూ ఢిల్లీ వారికి ధరఖాస్తు చేసాడు. దీంతో బిఎస్ఎన్ఎల్ కు దేశవ్యాప్తంగా నలభై సర్కిళ్లలో 95 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు బహిర్గతం అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అంతర్జాతీయ మానవహక్కులు మరియు నేర నిరోధక సంస్థ శాశ్వత సభ్యుడైన గంగాధర కిశోర్ కుమార్ కు బిఎస్ఎన్ఎల్ వారిచ్చిన వివరాలు సంస్థ యొక్క స్థితిగతులు ఏవిధంగా ఉన్నాయో వివరిస్తున్నాయి. 2014 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు బిఎస్ఎన్ఎల్ ఆస్తులు, ల్యాండ్ లైన్, సెల్యులర్ కనెక్షన్లు మరియు సంస్థ ఉద్యోగుల జీతాల వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ సంస్థ పట్ల ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో అర్ధమవుతుంది. 2014 సంవత్సరంలో 120753107677 వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లించిన సంస్థ 2021 సంవత్సరం నాటికి విఆర్ఎస్ ప్రతిపాదనతో 55984248607 వేల కోట్ల రూపాయలకు తగ్గించుకుంది. 2014 సంవత్సరంతో పోల్చుకుంటే ఇది సుమారు 53 శాతం తగ్గినట్లు. వైర్ లైన్ కనెక్షన్లు 2014 సంవత్సరంలో ఒక కోటీ ఎనభై నాలుగు లక్షలు ఉండగా 2021 సంవత్సరం నాటికి అరవై ఆరు లక్షలకు పడిపోయాయి. సుమారు ఇది మైనస్ 64 శాతానికి తగ్గినట్లు. ఇక సెల్యులర్ కనెక్షన్లు 2014 సంవత్సరంలో తొమ్మిది కోట్ల పైచిలుకు ఉండగా 2021 సంవత్సరం నాటికి 28 శాతం పెరిగి పదకొండు కోట్ల కనెక్షన్లకు చేరుకుంది. అయితే ఈ పెరుగుదల ప్రయివేటు టెలికాం సంస్థలతో పోల్చుకుంటే దిగువ స్థాయిలోనే ఉంది.కేంద్ర ప్రభుత్వం సంస్థ మనుగడకు అవసరమైన ఉద్దీపన చర్యలు చేపట్టకుండా ఉద్యోగులను తగ్గించి సంస్థను నిర్వీర్యం చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం.

*ప్రయివేటు ముద్దు- సొంత కంపెనీ వద్దు:-*

అప్పుల్లో ఉన్న  ప్రైవేటు కంపెనీలకు ఎన్నో రాయితీలు ప్రకటించే కేంద్రం సొంత కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రం ఎప్పుడూ మొండిచేయి చూపిస్తుంది. 3జీ సేవలు కల్పించేందుకె మూడు సంవత్సరాలు పడిగాపులు పడేలా చేసింది. దీనివల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ అభివృద్ధి అందని ద్రాక్ష పండులా మిగిలింది. ప్రైవేటు టెలికాం కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు పెట్టని కేంద్ర ప్రభుత్వం, బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం భారత్‌లో తయారైన 4జీ టెక్నాలజీని మాత్రమే వాడాలని నిబంధనలు పెట్టింది. నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌లో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు దేశ వ్యాప్తంగా ఆరు లక్షల గ్రామాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ నిర్మించడానికి భారత్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్కు లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి రూ. ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన పనిని అప్పగించింది వెంటనే పబ్లిక్‌ ప్రైవేటు పార్టిసిపేషన్‌ అనే పేరుతో ప్రైవేటుకు అప్పగించి. బీబీఎన్‌ఎల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో కలిపేసి కాంట్రాక్టును రద్దు చేసింది. దీంతో బిఎస్ఎన్ఎల్ కు చావుదెబ్బ తగిలినట్లైంది. బీబీఎన్‌ఎల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నెట్ వర్క్ కనెక్టివిటీ నిర్వహణ భారం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌పై పడుతుంది. 1995 సంవత్సరంలో ప్రైవేటు టెలికం కంపెనీలకు ఫిక్స్‌డ్‌ లైసెన్సు విధానంలో లైసెన్స్‌తో పాటు కొంత స్పెక్ట్రమ్‌ ఉచితంగా ఇచ్చేవారు. ఫిక్స్‌డ్‌ లైసెన్స్‌ విధానం అంటే, ఏడాదికి కొంత మొత్తం లైసెన్స్‌గా చెల్లించడం. ఏడాదికి కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని టెలిఫోన్‌ కనెక్షన్లు ఇవ్వాలన్న నిబంధనలు కూడా ఉండేవి. ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు కూడా ప్రైవేటు టెలికం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి. నిబంధనల ఉల్లంఘన, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లు ఇవ్వని కారణంగా ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.50వేల కోట్ల పెనాల్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తమకు నష్టాలు వస్తున్నాయని, పెనాల్టీలు రద్దు చేయాలని టెలికం కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో 1999 సంవత్సరం లో నూతన టెలికం విధానం వచ్చింది. దీని ప్రకారం టెలికం కంపెనీలు ఫిక్స్‌డ్‌ లైసెన్స్‌ విధానం ప్రకారం కాకుండా, రెవెన్యూపై 8 శాతం లైసెన్స్‌ ఫీజుగానూ, ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన 50 వేల కోట్ల పెనాల్టీలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే నాన్‌ టెలికం ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలని ప్రభుత్వం కోరింది.  సుప్రీంకోర్టు ఈ విషయంలో తీర్పు ఇస్తూ– ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పన్ను చెల్లించాలని తీర్పు నిచ్చింది. దీని ప్రకారం రూ.లక్షా నలభై ఆరు వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన పన్నులు చెల్లించే అవసరం లేకుండా రెండేళ్ల మారిటోరియం విధించింది. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూపై పన్నులు చెల్లించేందుకు 10 ఏళ్ల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును అడగడం విశేషం.

*ప్రయివేటుకు రాయితీలు- ప్రభుత్వ సంస్థల అమ్మకాలు:-*

భారత దేశ టెలికం రంగ సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎన్నో ప్రశ్నలకు రేకెత్తిస్తోంది. కేవలం మూడు ప్రైవేటు టెలికం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ప్రకటించిన కేంద్రం, అదే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. మరి ప్రైవేటు రంగం మీద ఎందుకింత ప్రేమ? ఈ మొత్తం ఉదారత సామాన్యులకు అందే సేవల్లో ఎంత మేరకు ప్రతిఫలిస్తుంది అన్నదే ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీలు ప్రయివేటు కంపెనీ వారికి తప్ప ప్రభుత్వరంగ సంస్థలకు ఉపయోగపడింది లేదు . కేవలం మూడు టెలికం కంపెనీలకే దాదాపు రూ.రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చి, దేశ టెలికం రంగం బాగుపడిందని సొంత డబ్బా కొట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికే చెల్లింది. ప్రైవేటు టెలికం కంపెనీలు కోరుకున్న విధంగా నాన్‌ టెలికం ఆదాయంపై పన్ను చెల్లించకుండా వెసులుబాటు కల్పించడం, టెలికం కంపెనీలు చెల్లించాల్సిన చట్టబద్ద పన్నులు 2025 వరకు టెలికం కంపెనీలు కేవలం వడ్డీ చెల్లిస్తే చాలని చెప్పడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల 100 శాతం అమలుకు తలుపులు తెరవడం, వడ్డీ రేటు నాలుగు శాతం ఉండగా, దాన్ని రెండు శాతానికి తగ్గించడం, స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు రద్దు చేయడం, ఒకవేళ లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీ చెల్లించకపోతే విధించే అదనపు రుసుమును కూడా రద్దు చేయడం, స్పెక్ట్రమ్‌ లైసెన్స్‌ను 30 ఏళ్ల కాలానికి పొడిగించడం, నాలుగేళ్ళ మారటోరియం తర్వాత కూడా టెలికం కంపెనీలు పన్నులు చెల్లించలేకపోతే ఆ మొత్తం ఈక్విటీగా మార్చుకోనే వెసులుబాటు కల్పించడం వంటి నిర్ణయాలు ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యానికి కారణమవుతున్నాయి.ప్రధానంగా ఇలాంటి నిర్ణయాల వల్ల దివాలా స్థితిలో ఉన్న కంపెనీలు తాము చెల్లించాల్సిన బకాయిలకు నాలుగేళ్ళ కాలానికి వెసులుబాటు లభించింది.

*విగ్రహాలు జాతికి అంకితం- ప్రభుత్వ సంస్థలు ప్రయివేటుకు అంకితం:-*

ప్రయివేటు సంస్థలకు రాయితీలతో పట్టం కడుతూ ప్రభుత్వరంగ సంస్థలకు సమాధి కడుతున్నట్లుగా ఉన్నాయి కేంద్రప్రభుత్వ నిర్ణయాలు. ప్రజలు తమ సొంత ఆస్థులుగా గర్వంగా చెప్పుకునే ప్రభుత్వ సంస్థలన్నిటిని ప్రయివేటుపరం చేస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు నిర్మించి జాతి ప్రజలకు అంకితమని ప్రకటించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఇదే శ్రద్ధ ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధి కోసం చేసే సంస్కరణల పై చూపించి ఉంటే జాతి ప్రజల ఆస్తులను వేలం వేయాల్సిన అవసరం ఉండదు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిన ప్రభుత్వాలు దేశ అభివృద్ధిని పక్కనపెట్టి ప్రజల నమ్మకాలు, మనోభావాలను సంస్కృతి, సంప్రదాయాలను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నాయి.ఈ విషయంలో జాతీయ,ప్రాంతీయ పార్టీలనే భేదం లేదు. అందరిదీ ఒకటే దారి. ఈ దేశ భవిష్యత్తును విగ్రహాల్లో చూపించడం అంటే అరచేతిలో వైకుంఠం చూపించడమే.