Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భరత జాతి వీరయోధుడు ఛత్రపతి శివాజీ

భారతదేశ చరిత్రలో ఎంతోమంది మహావీరులు జన్మించారు,వారి దైర్య సాహసాలు వీరగాథలుగా చరిత్రలో నిలిచి పోయాయి,చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు.ఈ పేరు వింటే భారాతావని పులకించిపోతుంది.హిందూ మతం ఆనంద డోలికల్లో తెలియాడుతుంది. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఈ మరాఠా యోధుడికే దక్కుతుంది.అతనే చత్రపతి శివాజీ.

ఛత్రపతి శివాజీ కేవలం 16 సంవత్సరాల వయసులోనే కత్తి పట్టి యుద్ధం చేసిన వీరుడు,ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ధీరుడు,తమ రాజ్యంలో ప్రజలకు కష్టాలు రాకుండా మహిళ క్షేమం కోరిన మహానుభావుడు,సతిసహగమనాన్ని(భర్త చనిపోయాక స్త్రీలను ఆ చితిపై సజీవదహనం చేసే ఆచారాలను) కూకటివేళ్లతో పెకిలించి ఆడవాళ్ళ చేత అన్నా అనిపించుకున్నాడు.

మొగల్ సామ్రాజ్యంలోని అన్యాయాలను,అకృత్యాలను ఎదురించి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి ప్రజాశ్రేయసుకై పాటుపడిన గొప్ప మహానుభావుడు, ఫాదర్ ఆఫ్ ఇండియా నేవి, మన భారతదేశంలో నేవిని ప్రవేశపెట్టిన మొట్ట మొదటి రాజు ,ఆ పేరు ధైర్య,పరక్రమాలకు నిలువెత్తు నిదర్శనం అతనే శివాజీ రాజే భోంస్లే చత్రపతి శివాజీ.

ఛత్రపతి శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19,వైశాఖమాసం శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు.జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ చనిపోతూ ఉండగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకి పెట్టింది.శంభాజీ శివాజీ అన్నదమ్ములు, శివాజీ వ్యక్తిత్వం ప్రముఖంగా నలుగురు గురువుల సాంగత్యం లో జరిగింది.

వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు ధైర్యవంతుడు మేధావి అయ్యాడు శివాజీ,శివాజీ మొదటి గురువు తల్లి జిజాబాయి బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమవంతుడుగా తీర్చిదిద్దాయి.రెండవ గురువు దాదాజీ కొండ ఈయన దగ్గర రాజకీయం యుద్ధతంత్రం నేర్చుకున్నాడు,మూడవ గురువు తుకారాం ఈయన దగ్గర సామాజిక సామరస్యత నేర్చుకున్నాడు ,శివాజీ నాల్గవ గురువు సమర్థ రామదాసు వీరి దగ్గర ఆధ్యాత్మిక హైందవ పరిరక్షణ జీవిత పరమార్థం అనే విషయాన్ని నేర్చుకున్నాడు.

ఈ విధంగా చతుర్ముఖ లక్షణాలను తన హస్తాలుగా మార్చుకొని తన గురువులు చెప్పిన జ్ఞానాన్ని తన అవయవం గా మార్చుకున్నాడు,శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్టమైనది గా తీర్చిదిద్దబడినది,శివాజీ12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఓసారి తండ్రి అయినా శాయాజీ శివాజీని తను పనిచేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బార్ కి తీసుకు వెళ్ళాడు,ధర్బర్ లో కొలువై ఉన్న సుల్తాన్ కి శివాజీ తండ్రి సలాం చేశాడు,శివాజిని కూడా సలాం చేయమని అన్నాడు తండ్రి శాయాజీ. అయితే పరాయి రాజు ముందు వంగి నేను సలాం చెయ్యను అని అన్నాడు శివాజీ,శివాజీ ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు తండ్రీ శాయాజీ .

శివాజిని చిన్నతనం నుండి దేశభక్తి జాతీయ అభిమానం కలిగిన వాడిగా తీర్చిదిద్దింది ఆయన తల్లి జిజియా బాయి. 1645 వ సంవత్సరంలో శివాజీ కి 16 సంవత్సరాల వయసు ఆ వయసులోనే కత్తి పట్టి 1000 మంది సైనికులతో పోరాడి బీజాపూర్ సుల్తానుల ఆధీనంలో ఉన్న తొర్నా కోట పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు,1647 సంవత్సరంలో కుందన్ రాజుగడ్ కోట మరియు పూణే దక్షిణ ప్రాంతం పై పట్టు సాధించాడు,తర్వాత 1654 లో పశ్చిమ కొంకన్ తీరాన్ని గెలిచాడు.

ఓటమి తప్పదు అన్న ఆలోచన వస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి అనువైన సమయం వచ్చినప్పుడు దాడి చేయాలి దక్కించుకోవాలి దీనిని ప్రపంచానికి మొట్టమొదట పరిచయం చేసింది శివాజీ,దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు .1659 లో బీజాపూర్ మహారాజు కోపానికి హద్దులు లేకుండా పోయాయి దానికి కారణం శివాజీ, అప్పుడు ఆ యువరాజు యుద్ధం ప్రకటించాడు వేల సైన్యం తో వచ్చిన ఆ రాజు పై యుద్ధం చేయలేను అని శివాజీ ముందుగానే గ్రహించి పోరాటాన్ని ముమ్మరం చేశాడు.

బీజాపూర్ సామ్రాజ్యం ముందు తన సైనిక సామర్థ్యం తక్కువగా ఉన్నదని తెలిసి తన తొందరపాటు వలన ఎంతోమంది సైనికులు మరణాన్ని చూడాల్సి వస్తుందని గ్రహించి శాంతి ఒప్పందానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ రాజు ఒప్పందానికి ఎవరు లేకుండా ఒంటరిగా రావాలని అని ప్రకటించాడు, అయితే ప్రజల సైనిక సౌకర్యాలను ఆలోచించి ఆ ఒప్పందానికి ఒప్పుకుని శివాజీ ఒంటరిగా వెళ్ళాడు ,ఇదే శివాజీ ధైర్యసాహసాలకు మరియు ఆయనని యోధునిగా మార్చడానికి ముఖ్య ఘట్టం బీజాపూర్ రాజ్యం లో అత్యంత రాక్షసుడు అఫ్జల్‌ఖాన్ శాంతి కౌగిలింత అనే పదంతో పిలిచి శివాజీ ని కత్తితో వెన్నుపోటు పొడిచాడు,కానీ శివాజీకి ఉక్కుకవచం ఉండటం వలన ఏమి కాలేదు ఇలా జరుగుతుందని ముందే గ్రహించిన శివాజీ తన వెంట తెచ్చుకున్న పిడి పులి ఉక్కుగోళ్లను ధరించి ఏడు అడుగుల అఫ్జల్‌ఖాన్ పై దాడి చేసి పొట్టను ఉగ్రనరసింహ వాలే చీల్చి నవంబర్ 10న చంపేశాడు.

శివాజీ అన్ని మతాలను గౌరవించేవాడు తన రాజ్యంలో ముస్లిం సోదరులకు కూడా పెద్ద అసనాలపై కూర్చోబెట్టాడు,గుళ్ళూ గోపురాలతో పాటు ఎన్నో మసీదులు కూడా కట్టించాడు,శివాజీ సైన్యంలో మూడు వంతులు ముస్లింలు ఉండటమే కాకుండా ప్రముఖ విభాగాలైన ఆయుధాల మందు విభాగానికి హైదర్ ఆలీ, నావికాదళానికి ఇబ్రహీం ఖాన్,మందుగుండు విభాగానికి సిద్ది ఇబ్రహీం అధ్యక్షులుగా బాధ్యతలు నియమించాడు.

శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులుగా దౌలత్‌ ఖాన్‌ మరియు సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు ఉండేవారు, శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ మదానీ మెహ్తర్‌, ఇతను శివాజీ అగ్రా నుంచి తప్పించుకోటానికి ప్రముఖ పాత్ర వహించాడు, శివాజీ మహిళా క్షేమాన్ని కాంక్షించే వాడు ఒకసారి శివాజీ సైనికులు ఒక అందమైన ముస్లిం యువతిని తీసుకువచ్చి శివాజీ ముందు ఉంచారు. ఐతే వారిని శివాజీ అభినందిస్తూ బహుమానం ఇస్తాడని వారు అనుకున్నారు, కానీ శివాజీ తన సైనికులను హెచ్చరించి శివాజీ ఆమె కాళ్ళపై పడి తల్లి నా సైనికులు చేసిన పనికి నన్ను క్షమించు, నా తల్లి కూడా ఇంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకా ఎంత అందంగా పుట్టి ఉండే వాడినో అని ఆ ముస్లిం యువతిని సకల రాజా లాంఛనాలతో ఆమె ఇంటికి క్షేమంగా పంపించాడు శివాజీ.

శివాజీ వ్యక్తిత్వానికి మహిళలపై అతనికి ఉన్న గౌరవానికి ఈ కథ ఒక నిదర్శనం,ముస్లింలు అన్యమతస్థులు ప్రముఖంగా మహిళలకి ఎనలేని గౌరవాన్ని ఇచ్చేవాడు శివాజీ, ఈరోజు మైనారిటీ వదమని మహిళ అధికారాలను సెక్యులరిజం అని అంటున్న ఎన్నింటినో ఆనాడే శివాజీ వాస్తవాలుగా సాధించి చూపాడు.1677లో భాగ్యనగరం( హైదరాబాద్)వచ్చిన శివాజీ అక్కడినుండి శ్రీశైలం వెళ్లి అష్టాదశ పీఠాలలో ఒకటైన భ్రమరాంబ దేవిని దర్శించాడు.

శివాజీ శేషజీవితాన్ని ధర్మ రక్షణకై వినియోగించాడు,జమీందారి,మతం దారి వ్యవస్థలను రద్దు చేశాడు,తన రాజ్యంలో వ్యవసాయం మెరుగు పడేలా చేశాడు,1657 వరకు మొగల్ సామ్రాజ్యం తో శివాజీ మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు,ఔరంగజేబు చేసే యుద్ధాలలో శివాజీ చాలా సహాయం చేసేవాడు,శివాజీ చేసిన సహాయం ప్రతిఫలంగా బీజాపూర్ కోటను అడిగాడు కానీ ఔరంగజేబు దానికి ఒప్పుకోలేదు.

1657 మార్చిలో మొగల్ సామ్రాజ్యంపై శివాజీ అనుచరులు దాడి చేశారు దాంతో మొగలుకు శివాజీ కి శత్రుత్వం ఏర్పడింది, సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు యుద్ధం చేయాలి అనేది ధర్మం,కానీ శివాజీ ఔరంగజేబు మేనమామ అయినా షాయిస్తాఖాన్‌ పై 1663 ఏప్రిల్ 13న అర్ధరాత్రి దాడి చేసి మొగలు సైన్యాన్ని దెబ్బ కొట్టడంతో కుమారులను, చేతివేళ్ళను పోగొట్టుకున్న షాయిస్తాఖాన్‌ పూణే వదిలి ఆగ్రా కు పారిపోయాడు,1666 మే 29న శివాజిని చర్చలకు అని పిలిచి ఆగ్రా లో బంధించారు,అక్కడి నుండి శివాజిని ఆఘ్ననిస్థాన్ పంపించాలని ప్రయత్నించారు, కానీ అది తెలుసుకున్న శివాజీ అనుచరులు అతనిని తప్పించారు.

1974 జూన్ 6వ తేదీన ఆనంద నామ సంవత్సరం జేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారం నాడు క్షత్రియ కులవతంస సింహనదీశ్వర మహారాజా చత్రపతి గా శివాజీ మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. శివాజీ ని అంతం చేయాలనుకున్నా అతని శత్రువులకు శివాజీ రెండవ భార్య అయిన సోహ్రాబాయ్ ఆయుధంగా మారింది, శివాజీ కి ఇద్దరు కుమారులు మొదటి భార్య కొడుకు శంభాజీ ,రెండవ భార్య కొడుకు రాజారామ్ శివాజీ రాజ్యంలో శంభాజీ మాటలు ఎక్కువగా నెగ్గడంతో అది చూసి ఓర్వలేని సోహ్రాబాయి శివాజీ శత్రువులతో చేతులు కలిపింది .

శివాజీ ఎక్కువగా శంభాజీని ప్రోత్సహించేవాడు. శివాజీ చనిపోయేముందు అతనికి చాలా వాంతులు విరేచనాలు అయ్యాయి చూస్తుండగానే శివాజీ మంచం మీద పడ్డాడు ,అది అలుసుగా తీసుకొని రెండవ భార్య సోహ్రాబాయి శివాజీ కి విషమిచ్చి చంపింది అని చరిత్ర కారులు అంటుంటారు, శివాజీ చనిపోగానే తన కుమారుడు రాజారామ్ ని మహారాజుని చేసింది సోహ్రాబాయి అప్పుడు రాజారామ్ కి 10 సంవత్సరాల వయసు, తండ్రి మరణం తరువాత బయటికి వెళ్ళిన శంభాజీ కొద్ది రోజులకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేజిక్కించుకుని సోహ్రాబాయి రాజారామ్ ని జైలుకు పంపాడు,శంభాజీ చనిపోయిన తరువాత రాజారాం రాజయ్యాడు. ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప వ్యక్తుల చరిత్ర ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం.

వ్యాసకర్త
సోరుపాక అనిల్ కుమార్
కాకతీయ యూనివర్సిటీ
7997894505