విజ్ఞాన శాస్త్రమే గెలుస్తుందని రుజువు చేసిన శాస్త్రవేత్త గెలిలీయో
నేడు గెలిలీయో 458 వ జయంతి
మత మౌఢ్యానికి చావుదెబ్బ కొట్టి తను నమ్మిన సిద్ధాంతానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా విజ్ఞాన శాస్త్రమే గెలుస్తుందని ఋజువు చేసిన మహనీయ శాస్త్రవేత్త గెలీలియో గెలిలీయో..
సూర్యాపేట ఫిబ్రవరి 15 (నిజం న్యూస్ )
గెలీలియో అంటే టెలిస్కోపును కనుగొన్న శాస్త్రవే త్త అని మనకు గుర్తుకొస్తుంది. అది నిజం. కానీ ఆయన ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురైనా, గృహనిర్బంధం చేసినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన ప్రయత్నాలను కొనసాగించిన వ్యక్తి గెలీలియో.
ఇటలీ దేశంలోని పీసా నగరంలో గెలీలియో 1564 ఫిబ్రవరి 15న జన్మించాడు. చిన్న తనంలో చిన్న చిన్న కొయ్య బొమ్మలు, అట్ట బొమ్మలు వివిధ ఆకారాల్లో తయారు చేయడం చూసి ఇతని తండ్రి ‘విన్సినోజో’ గెలీలియోను పీసా విశ్వ విద్యాలయంలో ‘వైద్య శాస్త్రం’ లో చేర్పించారు.
అది ఐరోపా అంధ యుగం నుండి వెలుగు లోనికి వస్తున్న కాలం. గూటన్ బర్గ్ కృషి వల్ల అచ్చు యంత్రాలు, తద్వారా వచ్చిన పుస్తకాలను కొనియాడుతున్న కాలంలో గెలీలియో తను కూడా ఏదైనా కొత్త ఆవిష్కరణ చేసి అందరిచేత ప్రశంసలు పొందాలని భావించాడు. పీసా విశ్వ విద్యాలయం లోనే తొలి ఆవిష్కరణ చేశాడు. పీసా కేథడ్రల్ (చర్చి) లోని ఊగుతున్న దీపాలను పరిశీలించాడు. ఆ దీపాలు చేసే చలనాలు క్రమ బద్ధంగా వున్నాయని, అలా ఊగుతున్నప్పుడు ఊగే దూరం తగ్గినా, పెరిగినా దానికి పట్టే సమయంలో మార్పు లేదని తన నాడి కొట్టు కోవడం ద్వారా అర్థం చేసుకొన్నాడు. దీని ఆధారంగా పెండ్యులమ్ సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు. నాడి కొట్టుకోవడం, గుండె కొట్టు కోవడం వంటి విషయాలను గమనించి ‘పల్స్ మీటర్’ రూపొందించాడు. ఇది వైద్యులకు చాలా ఉపయోగ పడుతున్నది. ఒక దారం కొసన బంతిని కట్టి అది ఊగుతున్నప్పుడు చేసే చలనాల వలన ‘లఘు లోలకం సిద్దాంతాల’ ను నిరూపించాడు.
26 సం. వయస్సుకే గెలీలియో భౌతిక శాస్త్రం, గణితంపై ఉన్న ఆసక్తితో వైద్యశాస్త్రాన్ని కాదని పీసా విశ్వ విద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా చేరి అరిస్టాటిల్ ప్రతిపాదనలు పరిశీలించాడు. బరువైన వస్తువులు తేలిక వస్తువుల కంటే ముందే భూమిని చేరుతాయని చెప్పిన అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పని ఋజువు చేశాడు. పీసా నుండి గెలీలియో చేసిన పరిశీలన, 1590 లో రాసిన ‘Peirta’ పుస్తకం అరిస్టాటిల్ తప్పును వెలుగులోకి తెచ్చాయి. అప్పట్లో అరిస్టాటిల్ ఎంత మేధావో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ప్రతిపాదనలను ధైర్యంగా తిరస్కరించడం ఫలితంగా పీసా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం ఊడింది.
1592 లో పడువా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ఆచార్యుడుగా చేరాడు. ఇక్కడ 18 సం. లు పనిచేసి మంచి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు. 1604 లో అంతరిక్షంలో ఒక ప్రకాశ వంతమైన నక్షత్రాన్ని గమనించి సూర్య కుటుంబానికి అవతల ఒక స్థిరమైన నక్షత్రంగా నిరూపించాడు. 1606 లో ‘జ్యా మెట్రికల్ మిలిటరీ కాంపస్’ అనే యంత్రాన్ని తయారు చేసి దీని సహాయంతో గుణకార, భాగహారాలను త్వరగా చేయడానికి ఉపయోగించాడు.
1608 లో ఉచ్కు చెందిన లిప్పర్ షే ఒక గొట్టం చివర రెండు కంటి అద్దాలు బిగించి, దూరపు వస్తువును చూస్తే అది దగ్గరగా తల క్రిందులుగా కనిపిస్తుందని గుర్తించాడు. ఈ విషయం 1609 లో గెలీలియోకు తెలిసి దీని ద్వారా పరిశీలనలు చేసి ‘టెలిస్కోపు’ రూపొందించాడు. ఇది సామాన్యుడికి వింతగా తోచి ఒక నెల రోజులు దీనిపై చర్చలు విస్తృతంగా జరిగాయి. దీని సహాయంతో స్థిరంగా వుండే నక్షత్రాలు, కంత సాయంతో కనబడని పాలపుంతల గురించి వివరించాడు. జూపిటర్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల, శుక్ర గ్రహం, సూర్యుని లోని మచ్చలు, సూర్య భ్రమణం, చంద్ర భ్రమణం మొదలగు విషయాలు తెలిపాడు. అప్పటికే కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంత వరకు మత గ్రంథాలు చెబుతున్న భూ కేంద్రక సిద్ధాంతాన్ని తన ప్రయోగాల ద్వారా తప్పని రుజువు చేస్తూ కోపర్నికస్ సిద్ధాంతానికి మద్దతు తెలిపాడు.
గెలీలియో అంతరిక్ష పరిశోధనలు, వాటి ద్వారా ఆయన చెప్పే విషయాలు మతానికి విరుద్ధమైనవిగా మత పెద్దలు భావించారు.
పైగా ప్రఖ్యాతి గడించిన అరిస్టాటిల్ సిద్దాంతాలు తప్పని అన్నందుకు 1610 లో తాను వ్రాసిన గ్రంథం ద స్ట్ర రీ మెసెంజర్ ద్వారా అంతరిక్ష వాస్తవాలను చిత్రించినందుకు పోపు ఆయనకు జైలు శిక్ష వేశాడు. ఆ తర్వాత గెలీలియోని యావజ్జీవం గృహ నిర్బంధంలో ఉంచాడు.
తన చివరి రోజుల్లో ఆయన కంటి చూపును కోల్పోయాడు. అధిక ఇబ్బందుల మధ్య 1642 జనవరి 8 న గెలీలియో కన్ను మూశాడు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మత మూర్ఖత్వం బలిగొంది.
ఈ విధంగా వాస్తవాలు చెప్పినందున ఒక వైపున బ్రూనోను సజీవ దహనం చేసిన ఆ నాటి వ్యవస్థ గెలీలియోను కూడా హింసించింది.
ఆయన కనుగొన్న టెలిస్కోపు వలన ఖగోళశాస్త్రం అనంతమైన ఎదుగుదలను సాధించింది. విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి చెందినది.
మన పిల్లలని అభ్యుదయ భావాలతో
విజ్ఞాన వేత్తలుగా, శాస్త్ర వేత్తలుగా తీర్చిదిద్దడమే గెలీలియో గెలిలీకి మనమిచ్చే నిజమైన నివాళి.