Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మోడీ, కేసీఆర్ ల నయాడ్రామా రాజకీయాలు…?

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ లా నడుస్తున్న రాష్ట్ర రాజకీయాలు
బీజేపీని జాకీలు పెట్టి లేపుతున్న కేసీఆర్
ఒకరిని ఒకరు తిట్టే ప్రోగ్రాంలకు తెరతీసిన పార్టీలు
మూడు రోజులు మీటింగ్ పెట్టి మరీ మోడీని తిడుతున్న సీఎం
రియాక్టు అయితున్న బీజేపీ రాష్ట్ర నేతలు
రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయం చేయాలని మోడీ ప్లాన్
ఎలాగైనా ప్రతిపక్షాల ఓట్లు చీల్చాలని కేసీఆర్ యత్నం
కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలనే డ్రామాలు
తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పై ఆరోపణలు చేసిన మోడీ
మోడీ కేంద్రంగా చర్చలు జరగాలనే వ్యాఖ్యలు
రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు సహకరిస్తున్న టీఆర్ఎస్
మోడీ, కేసీఆర్ ల దిగజారుడు రాజకీయాలు
విస్తుపోతున్న రాజకీయ విశ్లేషకులు

(జర్నలిస్టు క్రాంతి ప్రత్యేక కథనం)

దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నదని పదేపదే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా రాష్ట్రంలో అవినీతి పాలన, నియంత పాలన జరుగుతున్నదని బీజేపీ రాష్ట్ర నాయకులు కౌంటర్ విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏడేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ కు దేశంలోని మోడీ పాలనపై కోపం ఎందుకు వచ్చిందో ప్రజలకు అర్థం కావట్లేదు. మొన్నటి దాక వడ్ల కొనుగోలుపై రాజకీయాలు చేసిన రెండు పార్టీలు ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూ నయా మోసానికి తెరలేపాయి. కేసీఆర్, మోడీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్… నిజమేనా?

ఇప్పుడిప్పుడే దేశంలో పార్లమెంట్ ఎన్నికలు లేవు. కానీ కేసీఆర్ పనిగట్టుకుని ప్రెస్ మీట్ లు, బహిరంగ సభలు పెడుతూ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తా అవసరమైతే పార్టీ పెడతా అనే గొప్పలు చెప్పుతుండు. మొన్నటి దాక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఏ బిల్లుకైనా మద్దతునిచ్చిన కేసీఆర్ ఇటీవల కాలంలో ప్రధానిపై విమర్శలు చేయటానికి గల కారణాలేంటనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చజరుగుతున్నది. కేసీఆర్ రాజకీయ లబ్ది లేకుండా ఏమాట మాట్లాడనేది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలోని బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి, బలంలేని మతతత్వ పార్టీ అయిన బీజేపీ పై విమర్శలు చేయటం దేనికి సంకేతం అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది. రాష్ట్రం లో బీజేపీని ప్రత్యామ్నాయం చేయాలనే మోడీ ప్లాన్ లో బాగంగా కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు.

బీజేపీని జాకీలు పెట్టి లేపుతున్న కేసీఆర్

రాష్ట్రంలో 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒకే స్థానంలో బీజేపీ గెలిచింది. తరువాత మారిన పరిణామలతో సంస్థాగతంగా బలంగా లేకున్నా పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 4 ఎంపీ స్థానాలను బీజేపీ గెలిచింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు స్కోప్ ఉందని గ్రహించిన బీజేపీ నాయకత్వం కొత్త వ్యూహాలకు తెరలేపింది. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అయినా బీజేపీ కి రాష్ట్రంలో ఊపు రాకపోవటంతో కేసీఆర్ టార్గెట్ గా ఎంపీ అర్వింద్ తో కలిసి బండి సంజయ్ తిట్టిపోశారు. దీని వల్ల బీజేపీకే కొన్ని సార్లు ఇబ్బందులు వచ్చాయి. కేసీఆర్ ను ఎదర్కొవటంలో విఫలం అయి బీజేపీ బలం పెంచలేక పోయారు. కిషన్ రెడ్డి సైతం ఏమి చేయలేక పోవటంతో ప్రధాని మోడీ రంగంలోకి దిగి కేసీఆర్ తో డ్రామా రాజకీయాలకు తెరలేపిండని విశ్లేషకులు అంటున్నారు. ఆ డ్రామాలో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ను తొక్కేసి బీజేపీకి బలం పెంచే బాధ్యతను తన బుజస్కందాలపై కేసీఆర్ మోస్తున్నాడు.

వడ్ల కొనుగోలు వివాదం నుంచి డ్రామా షురూ…

వడ్ల కొనుగోలుకు సబంధించి మీరు దొంగలంటే మీరే దొంగలంటూ టీఆర్ఎస్, బీజేపీ నాయకులు గట్టిగానే తిట్టుకుండ్రు. ఈ వివాదంలోకి మోడీని లాగిన కేసీఆర్ ఆయనను ఇష్టం వచ్చినట్టు దుర్బాషలాడిండు. అనుకున్న ప్రకారమే రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇగ అప్పటి నుంచి స్టార్ట్ ప్రతి రోజు టీఆర్ఎస్ నాయకులు మోడీని తిట్టడం, బీజేపీ నాయకులు కేసీఆర్ ను తిట్టడం. బీజేపీ నాయకులు ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలో రాబోయేది తమ ప్రభుత్వమే, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఉదరగొట్టే మాటలు చెప్పారు. దీనికి అనుగుణంగా బీజేపీ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్ అయి బీజేపీ బలాన్ని పెంచే బాధ్యతను బుజాలపై వేసుకున్నది.

కాంగ్రెస్ ను తొక్కేస్తున్న కేసీఆర్, మోడీ

2014, 2018ల్లో సరైన నాయకత్వం లేక ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బలమైన పునాదులు ఉన్నాయి. సంస్థాగతంగా రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ కే ఎక్కువ బలం ఉంటుంది. కానీ ఏమి లాభం అంత బలం ఉన్నా పార్టీని సరైన మార్గంలో నడిపించే నాదుడే లేడు. పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డిల కాలంలో కాంగ్రెస్ పార్టీ అథం పాతాలంలోకి పడిపోయింది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ లో బలం నింపే ప్రయత్నం చేశాడు. అనేక కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపు తెచ్చాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరిగితే తనకే నష్టమని బావించాడు కేసీఆర్. అదే సమయంలో ఇక్కడ నుంచి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే తనకు కేంద్రంలో ఇబ్బందులు తప్పవని గ్రహించిన మోడీ .. కేసీఆర్ తో కలిసి కాంగ్రెస్ ను తొక్కేసే ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. ప్లాన్ ప్రకారమే ఒకరినొకరు విమర్శించుకుంటూ కాంగ్రెస్ ను రాష్ట్రంలో కానరాకుండా చేయాలని చూస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ తీరుపై మోడీ ఆరోపణలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సయమంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ప్రధాని మోడీ ఇటీవల విమర్శలు చేశారు. రాష్ట్రంలో తన గురించి రాజకీయ చర్చ జరిగి తద్వార తమ పార్టీ బలం పెంచుకోవాలనే ఆలోచనతో మోడీ ఈ వ్యాఖ్యలు చేసిండని మేదావులు అంటున్నారు. విషయం అర్థం కానీ కాంగ్రెస్ నేతలు మోడీపై విమర్శలు చేస్తూ, ఆయనపై చర్చను స్టార్ట్ చేశారు. కావాలసింది ఇదే కాబట్టి స్పందించిన రాష్ట్ర బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పకొచ్చారు.

దిగజారడు రాజకీయాలు చేస్తున్న మోడీ, సీఎం

ఇటీవల కాలంలో రాజకీయాలు మరీ దిగజారిపోయాయి. పైకి కోపంగా, తిట్టుకున్నట్టగా నటించటం లోపల కలిసి ఉండటం కామన్ అయిపోయింది. ఇలాంటి రాజకీయాలే రాష్ట్రంలో జరుగుతున్నాయి. కేంద్రంలో తనకు ఇబ్బంది లేకుండా మోడీ రాజకీయ కుయుక్తులకు పన్నాంగం పన్నుతుండగా, వాటికి సపోర్టు చేస్తున్నారు కేసీఆర్. దేశంలో నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ను ఇగ తిరిగి కోలుకోనియ్యకుండా ఉండాలంటే ఏ రాష్ర్టంలో అధికారంలోకి రాకుండా చేయాలని మోడీ ఆలోచన. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దీంతో కాంగ్రెస్ ను ఏ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చూడాలని చూస్తున్న మోడీ రాష్ట్రంలో కాంగ్రెస్ ను తొక్కేయాలనే ఆలోచన చేసిండు. అదే సమయంలో తన కౌంటర్లకు అదే స్థాయిలో కౌంటర్లు ఇయ్యగల రేవంత్ ను నిలువరించకపోతే తన కుర్చి కిందకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన కేసీఆర్.. మోడీతో కలిసి డ్రామా రాజకీయాలు చేస్తూ బీజేపీ బలం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీల్చి తానే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ఆలోచనలు చేస్తుండగా, కాంగ్రెస్ ను అన్ని రాష్ట్రాల్లో దెబ్బ కొట్టే కొంతకాలం పాటు కేంద్రంలో బీజేపీకి ఎదురు లేకుండా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు. ప్రజలను మోసం చేయటానికి మోడీ, కేసీఆర్ లు చేస్తున్న రాజకీయ డ్రామాలను చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.