Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జగన్‌ను కదలించని అమరావతి ఆందోళనలు

బిజెపిపై ఎపి ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు
కంచికి చేరని అమరావతి రైతుల కథ
అమరావతి ఉద్యమం 790వ రోజుఉ చేరింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న పట్టుదలతో రైతులు షిర్డీ యాత్రచేపట్టారు. గతంలో తిరుమల యాత్ర చేపట్టారు. ఇటీవల పాఠ్యాపుస్తకాల్లో అమరావతి అంతర్ధానం అయ్యింది. మరోవైపు అమరావతే రాజధాని అని కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది.

అయినా అమరావతికి బడ్జెట్‌లో కేంద్రం పైసా కూడా కేటాయించలేదు. ఇంకోవైపు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా కూడా ప్రకటించారు. సినిమా వాళ్లతో చర్చ సందర్భంగా వైజాగ్‌కు రండని సిఎం జగన్‌ వెల్లడి౦చారు. మొత్త౦గా వైజాగ్‌ చుట్టూ జగన్‌ రాజధాని తిరుగుతోంది.

రాజధాని మార్పు అనివార్యం గా మారింది. ప్రభుత్వం ఈ మేరకు తనపని తాను చేసుకుంటూ పోతున్నది. మూడురాజధానులపై ముక్కుసూటిగా వ్యవహరిస్తోంది. అమరావతి అంటే చంద్రబాబు భూ కుంభకోణం అన్న రీతిలో వ్యవహారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అమరావతి కలిసివచ్చే అంశమే అయినా ..అది రాష్ట్ర వ్యవహారమని తేల్చేసింది. దీంతో పోరాడే అవకాశాన్ని కోల్పోయింది.

అమరావతి తరలింపును అడ్డుకోగలిగితే బీజేపీకి ప్రజల ఆదరణ దక్కేది. రాజధాని రైతులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలవారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని బీజేపీ పెద్దలు కట్టడి చేయాలని ఆశిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు ఈ దిశగా నిర్దుష్ట కార్యాచరణ ప్రకటించకపోవడం పట్ల ప్రజల్లో కూడా ఆ పార్టీపై నమ్మకాలు సన్నగిల్లాయి.

మొత్తంవిూద అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ నాయకులు చేజార్చుకుంటు న్నారన్న భావన మాత్రం రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించింది. రాజధాని తరలింపు విషయంలో జగన్మోహన్‌ రెడ్డి సక్సెస్‌ అయినట్లుగానే కనిపిస్తున్నారు. దీంతో జనసేన బీజేపీ చేతులు కలిపినా ఒరిగేది ఏవిూ ఉండబోదు. రాష్ట్రంలో బీజేపీ బలపడకపోగా ఆ పార్టీతో చేయి కలిపినందుకు జనసేన కూడా ఉన్న బలాన్ని కోల్పోవచ్చు. ఇప్పటికే ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జారుకున్నారు.

జగన్‌ విషయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా మనసులో ఏముందో మాత్రం తెలియడం లేదు. రాజధాని తరలింపునకు ఈ ఇరువురు పెద్దల ఆమోదం ఉందన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో జనసేన ,బీజేపీ చేతులు కలిపినంత మాత్రాన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఢీ కొనలేరన్న అభిప్రాయం కూడా ఉంది.

అమరావతి తరలింపు అంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రజల్లో మళ్లీ బలపడాలని తెలుగుదేశం పావులు కదుపుతోంది. అయితే అమరావతి ప్రాంతం తప్ప మరెక్కడా రాజధాని మార్పుపై పెద్దగా ఆందోళనలు కనింపించడం లేదు. ప్రజలు కూడా తమకు రాజధాని కావాలన్న పట్టుదలలో లేరు.

జగన్‌కు ఇది కలసి వచ్చే అంశంగా చూడాలి. అమరావతిలో రాజధాని కోసం 33 వేల ఎకరాలతోపాటు గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం 600 ఎకరాల భూములిచ్చిన రైతులకు ఉన్న పళంగా నష్టపరిహారం చెల్లించే పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం లేదు. దీంతో రాజధాని వ్యవహారంలో పీటముడి పడుతుంది. ఇటు అమరావతిలోనూ, అటు విశాఖలోనూ అభివృద్ధి జరిగే అవకాశం కూడా లేదు. జీవచ్ఛవంలా అమరావతి మిగిలిపోతుందని టిడిపి విమర్శలు చేస్తోంది. మొత్తంగా అమరావతి అన్నది ఇక భ్రమ మాత్రమే కాగలదు.

జగగన్‌ ఏ మేరకు విజయం సాధిస్తారన్నది చూడాలి. రాజధాని రైతుల ఆందోళనలు క్రమంగా చల్లారే స్థాయికి అంటే నిర్ణీత గ్రామాలకు పరిమితం అయ్యింది. మందడం, తుళ్లూరు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి,తాడికొండ అడ్డరోడ్డు,14వ మైలులో మాత్రమే రైతులు ధర్నాలు సాగిస్తున్నారు.

అమరావతి విషయమై వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య పోరాటం జరుగుతున్నా వైసిపిదే పైచేయిగా మారింది. రాజధానిని తరలించకుండా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు అడ్డుకుంటారని రాష్ట్ర ప్రజలు గంపెడాశతో ఉన్నారు. కానీ అలాంటిదేవిూ జరగడంలేదు. మొత్తంగా అమరావతి ఉంటుందా లేదా అన్నది తెలియడం లేదు. మూడురాజధానుల ముచ్చటలో జగన్‌ తన పనితాను కానిచ్చేస్తున్నారు.