మోడీకి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ సాధ్యమేనా ?

బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో మరోమారు మోడీ అధికారంలోకి రావడానికి బలమైన ప్రతిపక్షం లేకపోవడమే అన్నది గుర్తించాలి. 370 ఆర్టికల్ రద్దు, ముస్లిం మహిళల రక్షణకు ట్రిబుల్ తలాక్ చట్టం తేవడం, అమోధ్య సమస్యకు పరిష్కారం చూపడం, రక్షణరంగంలో బలంగా నిలవడం వంటివన్నీ ప్రజల దృష్టిలో మోడీని హీరోగా నిలిపాయి.
అయినా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండనే ఉంది. కారణం…అర్థికంగా ప్రజలు దిగజారుతున్నారు. డాలర్ విలువ పెరుగుతోంది. రూపాయికి విలువ లేకుండా పోయింది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతు న్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.
ఈ నేపథ్యం లో బలమైన విపక్షం కావాలని మోడీని ఆయన మాటలతోనే బురిడీ కొట్టించే వక్త కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అంతటి సత్తా రాహుల్ లేదా..ప్రియాంక వాధ్రాకు లేదు. అలాగే వారసత్వ రాజకీ యాలను ప్రజలు కోరుకోవడం లేదు. రాష్టాల్ల్రో ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. అలాగే ప్రాంతీయ పార్టీల్లో బలమైన నేత కూడా లేడు. మమతా బెనర్జీ బెంగాల్‌కు తప్ప బయటకు పనికిరారని తేలిపోయింది.
ఈ క్రమంలో కేంద్రంలో విపక్ష బాధ్యత నిర్వహించే ధీటైన నేతకూడా లేకుండా పోయారు. పార్లమెంటులో గట్టిగా మాట్లాడే సమర్థ నాయకుడు లేడు. కాంగ్రెస్‌లో ఉన్న నేతల్లో వాగ్ధాటి ఉన్ననేతలు కూడా లేరు. విపక్షాల్లో అనైతక్యత, ఉన్నవారికి ఛరిష్మా లేకపోవడం కారణంగా మోడీ దూకుడుకు కళ్లెం వేయలేక పోతున్నారు. అంతేగాకుండా నేతలంతా అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారు.
కాంగ్రెస్ నేత రాహుల్ అయితే అస్త్రసన్యాసం చేశారు. ప్రియాంకకు కూడా అంత సీన్ లేదని గతకొంతకాలంగా ఆమె రాజకీయాలు చూస్తుంటే అర్థం అవుతోంది. అంతెందుకు బిజెపిలోనే మోడీకి బలమైన నేత లేకుండా పోయింది. అలా మరోనేత తనకు పోటీగా రాకుండా కూడా మోడీ చూసుకుంటున్నారు.
ప్రధాని మోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాంటి ప్రతిపక్షం ఏదైనా రాగలదా అని కూడా ఎదురుచూస్తున్నారు. కీలెరిగి వాతపెట్టాలన్నది సామెత. రోగానికి తగ్గ మందు ఉంటేనే అది నయం అవుతుంది. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో బిజెపి దూకుడును అడ్డుకునే మొనగాడే లేకుండా పోయాడు. అలాగే మోడీ నిర్ణయాలను నిగ్గదీయగలిగిన దీటైన నేత కూడా లేకుండా పోయాడు.
అనేకానేక అంశాలపై సాధికారికంగా మాట్లాడే నేత లేడన్న భావనలో ప్రజలు ఉన్నారు. ప్రాంతీయ పార్టీల నేతల్లో కెసిఆర్ ఒక్కరే సరైన లేదా బలమైననేతగా ఉన్నారు. ఆయనకు జాతీయ రాజకీయాలతో పాటు,రాజ్యాంగం, అంతర్జాతీయ వ్యవహారాలు కొట్టిన పిండి. ఇటీవల మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా విభజనపైచేసిన వ్యాఖ్యలు బాగా కలసి వచ్చాయి. మరోమారు సెంటిమెంట్ అందుకున్నది.
బిజెపికి కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఏవిూ లేదు. జగన్, స్టాలిన్,మమతా బెనర్జీ, పట్నాయక్ వంటి వారెవరూ మోడీని ఢీకొనే సత్తా లేదని తేలింది. ఈ క్రమంలో మోడీని ఢీకొనేందుకు రెడీ అవుతున్న కెసిఆర్ గట్టిగా పోరాడుతారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కేంద్రంతో పోరాడేందుకు ఆయన అడుగు వేసినా ఇతర ప్రాంతీయపార్టీల నేతలు మద్దతు ఇస్తారా అన్నది కూడా అనుమానమే. గత సార్వత్రిక ఎన్నికలకు ముందే కెసిఆర్ ఓ ప్రయోగం చేసినా అడుగు ముందుకు పడలేదు. మోడీ మరో మారు భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో పాటు..తెలంగాణలో కూడా బిజెపి నాలుగు సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ మరో మూడు సీట్లు గెల్చుకుంది. దీంతో కెసిఆర్ కూడా వెనక్కి తగ్గారు. ఇకపోతే కేవలం సెంటిమెంటంతోనే పోదామంటే కెసిఆర్‌కు కూడా కాలం కలసి రాకపోవచ్చు.
మోదీ, అమిత్ షాల గురించి ప్రజలకు తెలుసు. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనీ తెలుసు. అయితే వారి వల్ల దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు రాలేదన్న భావన సర్వత్రా ఉంది. ఈ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు స్వాగతించడం లేదు. దేశంలో ఇప్పుడున్న రాజకీయ నేతల్లో కెసిఆర్‌కున్న రాజకీయ నిబద్దత, అవగాహన మరెవరికీ లేదు.
అలాగే ఆయన భారత రాజకీయాలు, ప్రపంచరాజకీయాలను బాగా ఔపోసన పట్టారు. అందుకే కెసిఆర్ కూడా జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేందకు రంగం సిద్దం చేసుకుంటు న్నట్లుగా కనిపిస్తోంది. అనివార్యంగానూ తోస్తోంది. కెసిఆర్ ఇటీవల వేస్తున్న అడుగులు రాబోయే రోజుల్లో జరిగే మార్పును సూచిస్తున్నది. ఐదు రాష్టాల్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన జాతీయరాజకీయాల్లోకి రానున్నారన్న సూచనలు వస్తున్నాయి.
రాజ్యసభలో ఉంటూ జాతీయరాజకీయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వ్యూహం పన్నడం ఖాయంగా కనిపిస్తోంది. సాగు చట్టాలను, బడ్జెట్ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన సిఎం కెసిఆర్ ఇప్పటికే మోడీ తీరుపై మండిపడుతూనే ఉన్నారు. దేశ సమస్యల ను కేంద్రం సరిగా అడ్రస్ చేయడం లేదని ముందునుంచీ వాదిస్తున్నారు. వివిధ అంశాల కేసీఆర్ లాగా జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీ వంటి నేతలు మాట్లాడి ఉంటే ఇవాళ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచి ఉండేది.
ప్రధాని నరేంద్రమోదీ కూడా కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేందుకు లభించే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పౌరసత్వ చట్టం,సాగుచట్టాలు, కేంద్రరంగ సంస్థల అమ్మకం తదితర విషయాల గురించే చర్చలు సాగడం..వ్యతిరేకత రావడం జరిగినా మోడీ ప్రభుత్వం చలించడం లేదు. అందుకే ఈ సమస్యలను భుజాన వేసుకుని.. నిలదీసే నేత కావాలి. అలా చేయడంలో ఇప్పుడున్న నేతలు సరిపోరు.
రాజ్యసభలో ప్రవేశించడం ద్వారా కెసిఆర్ జాతీయ రాజకీయాల బూజును దులపాలని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఇప్పటికే తెలంగాణలో ప్రవేశ పెట్టిన అనేక పథకాలు దేశ్యాప్తంగా అమలుచేస్తే దేశ దరిద్రం పోతుందన్న భావన కెసిఆర్‌లో బలంగా నాటుకుంది. తెలంగాణలో ముస్లింలు ఆయనను వ్యతిరేకించడం లేదు. జాతీయ రాజకీయాల్లోకి వస్తే ముస్లింలు కూడా కెసిఆర్ వెన్నంటి నడుస్తారు.
అందుకు ఓవైసీ కూడా తోడ్పడతారు. ఆయన హిందువు అయినంత మాత్రాన ముస్లింల వ్యతిరేకి కాదని వారికి తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పటివరకు విపక్షాలు లేవనెత్తిన అనేకానేక ప్రశ్నలను కెసిఆర్ తనదైన శైలిలో గట్టిగా వినిపించే సత్తా ఉంది. అవసరమైన పదజాలం, భావజాలం కెసిఆర్ సొంతం. అందుకే విపక్షానికి కెసిఆర్ బలం కాగలరు. బలమైన నేతగా రాణించగలరు. అయితే అన్ని ప్రాంతీయ పార్టీలు విభేదాలు పక్కనపెట్టి ముందుకు రాగలిగితేనే ఇది సాధ్యం. అన్ని పార్టీలకు లేఖ రాసిన స్టాలిన్ లాంటి వారు ఇప్పుడు చొరవ తీసుకుని ముందుకు రావాలి. ఉమ్మడి ఫ్రంట్‌తో ముందుకు సాగితే మోడీకి ప్రత్యామ్నాయం తీసుకుని రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు.