Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆర్టీసీ భూకబ్జా ..! స్పందించిన టిఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

– నిజం న్యూస్‌ వార్తను ఆర్టీసీ ఎండీకి ట్వీట్‌ చేసిన పెద్దపల్లి జిల్లా యువకుడు
 -ఇకనైనా సామాన్యుడికి న్యాయం జరిగేనా?

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి09 (నిజం న్యూస్‌):
మణుగూరు ఆర్టీసీ భూకబ్జా పై నిజం న్యూస్‌ లో వచ్చిన కథనానికి టిఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. రెండురోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సురక్ష మినీ బస్‌ స్టాండ్‌ పేరుతో పట్ఠాభూమి కబ్జా చేస్తున్నారని నిజం న్యూస్‌ లో వార్త ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే.

ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన విలేజ్‌ డెవలప్మెంట్‌ ప్రోటక్షన్‌ సంస్థ నిర్వాహకుడు ఈ వార్తను టిఎస్‌ఆర్టీసీ సిఎండి సజ్జనార్‌ కు ట్వీట్‌ చేయడంతోపాటు పువ్వాడ అజయ్‌ కుమార్‌ కు కుడా టాగ్‌ చేసాడు. ఇది ఆర్టీసీ హెడ్‌ క్వార్టర్స్‌ కు రీట్వీట్‌ అయింది.

ఇదేంటో చూడండంటూ కొత్తగూడెం డిపో మేనేజర్‌ కు ట్వీట్‌ అవడంతో వారు ఈసమస్య కొత్తగూడెం డిపోది కాదని మణుగూరు డిపోకి సంబంధించినది అని ట్వీటర్లో సమాధానం ఇచ్చారు. దీనిపై మణుగూరు డిపో వారు వివరణ ఇచ్చారు. సురక్ష మినీ బస్‌ స్టాండ్‌ సర్వే నంబరు 203 లోని 16గుంటల స్థలంలో నిర్మించారని తెలిపారు.

1989లో బస్‌ డిపో నిర్మాణం జరిగిందని సురక్ష మినీ బస్‌ స్టాండ్‌ కొరకు పట్టాదారు సవలం ఆదేయ్య 16 గుంటల విస్తీర్ణాన్ని దానమిచ్చారని ఈ వివరణలో పేర్కొన్నారు. అయితే సురక్ష మినీ బస్‌ స్టాండ్‌ 2000 సంవత్సరంలో నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ రెవెన్యూ రూల్స్‌(తెలంగాణ ఏరియా)- 1951 చట్టం క్రింద దానమిచ్చిన 16 గుంటల భూమికి ఫారం సి సర్టిఫికెట్‌ మాత్రం తహశీల్దార్‌ కార్యాలయం వారు దశాబ్ద కాలం తరువాత అంటే 2012లో ఇచ్చినట్టు మణుగూరు డిపో వారు చెప్పడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.

అలాగే 2017 లో కూడా ఈస్థలానికి పంచనామా జరిగిందని చెప్పడం వల్ల పట్టాదారులు ఈస్థలం విషయమై ఉన్న సమస్యకు తగిన పరిష్కారం కోసం తహశీల్దార్‌ మరియు ఆర్టీసీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు సురక్ష బస్‌ స్టాండ్‌ కోసం 16 గుంటల స్థలం ఇచ్చింది పట్టాదారు అని చెబుతూనే వాసవి క్లబ్‌ వారి స్థలం అని పేర్కొనడం విచిత్రం.

అసలు ఈస్థలానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పేరుతో స్థలదాత అంటూ శిలాఫలకం పెట్టడం ఇంకో విచిత్రం. స్థలాన్ని దానమిచ్చిన అసలు పట్టాదారున్ని పక్కన పెట్టి వాసవి క్లబ్‌, తార ప్రసాద్‌ పేర్లు చెబుతూ పట్టాదారుని మొత్తం భూమిని కబ్జా చేస్తున్నారు. దీనికి రెవెన్యూ, ఆర్టీసీ అధికారులు వంత పాడుతుండడం విశేషం. ఈ రెండు దశాబ్దాల కాలంలో పట్టదారుని పేరు ఎక్కడా బయటకు రానివ్వకుండా వాసవి క్లబ్‌ స్థలంగా ప్రజలను నమ్మించారు.

నిజం న్యూస్‌ ఆధారాలతో సహా వివరాలు బయటపెట్టేసరికి అధికారుల నోటినుండి పట్టదారుని పేరు బయటకు వచ్చింది. అడిగేవారు లేకుంటే అధికారులు ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ భూకబ్జా వ్యవహారం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
ఎఫ్‌-లైన్‌ పిటిషన్‌ కు మోక్షమెప్పుడో?
సర్వే నంబరు 203 లోని సురక్ష బస్‌ స్టాండ్‌ ఉన్న 16 గుంటలు మరియు ఆ సర్వే నంబరులో మొత్త విస్తీర్ణం రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలకు హద్దులు చూపించాలని పట్టాదారు వారసులు రెండునెలల కిందట మణుగూరు తహశీల్దార్‌ కార్యాలయానికి ఎఫ్‌-లైన్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. కానీ తహశీల్దార్‌ కార్యాలయం వారు దీనిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నిష్పక్షపాతంగా సర్వే నిర్వహిస్తే ఎవరి ఆక్రమణలు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తుంది. ఈ సర్వే నంబరులోని 2.26 గుంటల విస్తీర్ణంలో ప్రధాన రహదారి నిమిత్తం 0.23 గుంటలు సురక్ష బస్‌ స్టాండ్‌ నిమిత్తం 0.16 కలిపి 0.39 గుంటల విస్తీర్ణం పోను మిగిలిన 1.27గుంటల విస్తీర్ణం పట్టాదారునికి చెందాల్సి ఉండగా మొత్తం స్థలం ఆక్రమణకు గురికావడంతోనే వివాదం మొదలైంది. తమకు న్యాయంగా సంక్రమించాల్సిన పట్టా భూమిని ఇతరులు ఆక్రమించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని చెబుతున్నారు.

కొసమెరుపు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడంకోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంకోసం ప్రధాన రహదారి పక్కనే ఉన్న సురక్ష బస్‌ స్టాండ్‌ గోడలకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటామని చెప్పిన ప్రభుత్వ పాఠశాల వారికి మణుగూరు ఆర్టీసి డిపో మేనేజర్‌ ఒప్పుకోలేదు. ఇలా ఫ్లెక్సీలు పెడితే ఎండి సజ్జనార్‌ ఒప్పుకోరని ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నిజం న్యూస్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ అక్కడే ఉండడం యాదృచ్చికం.కానీ ఇప్పుడు చూస్తే సురక్ష బస్‌ స్టాండ్‌ గోడలపై అధికార పార్టీ ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. అంతేకాదు బస్‌ స్టాండ్‌ ఆవరణలో కూడా రెండు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు. మరి ఈవిషయమై సజ్జనార్‌ గారు స్పందిస్తే ఎలా ఉంటుందో చూడాలి.