అసమర్థుడి అధికార యాత్ర !!

చేతకాని వాళ్లకు ఆక్రోశం ఎక్కువ..ఏవిూ చేయలేని వారు ఎదుటివారిని నిందిస్తూ ఉంటారు.. వారివల్లనే ఇదంతా జరిగిందని అంటుంటారు.
ప్రధాని మోడీ కూడా అదేకోవలోకి వస్తారు…కాంగ్రెస్ లేకుంటే..అంటూ మంగళవారం రాజ్యసభ వేదికగా చేసిన వ్యాఖ్యల ద్వారా ఆయన తనలోని అక్కసును..చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నారు. ఆయన అసమర్థ ప్రధాని అని నిరూపించుకున్నారు.
ఏడున్నరేళ్లుగా దేశానికి ఏం చేశారో ధైర్యంగా చెప్పే దమ్ము మోడీకి లేదు. ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న వ్యక్తి ఎంతో హుందాగా మాట్లాడాలి. దేశంకోసం ఏం చేస్తున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలు అన్నమో రామచంద్రా అని చస్తుంటే కనీసం వారిని ఎలా ఆదుకోవాలన్న ఆలోచన లేదు..నిరుద్యోగాన్ని ఎలా తుదముట్టించాలో తెలియదు.
దేశంలో నిరుద్యోగం అనకొండలాగా పెరుగుతున్నా ప్రణాళికలు లేవు. ఆదానీ అంబానీలను పెంచి పోషించి..వారిని ప్రపంచంలో నంబర్‌వన్ పారిశ్రామికవేత్తలుగా ఎలా చేయాలో అన్న ఆలోచన తప్ప సామాన్యుల గురించి ఆలోచన చేశారా అన్నది.. బిజెపి నేతలు..ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
దేశంలో సర్వ అరిష్టాలకు కాంగ్రెస్ కారణమంటూ ప్రధాని మోడీ చేసిన విమర్శలకు ఇది సమయమా అన్న ఆలోచన చేయాలి. ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయకుండా ఎందుకు అమ్ము తున్నారో జాతికి జవాబు చెప్పాలి. విశాఖ ఉక్కు, ఎల్‌ఐసి తదితర సంస్థలను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలి.
వాటిని బలోపేతం చేసి మరికొంతమందికి ఎందుకు ఉద్యోగావకాశాలు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలి. సాగుచట్టాలతో రైతులను ఏడాదిగా ఎందుకు క్షోభ పెట్టారో చెప్పాలి. నోట్ల రద్దు పర్యవసానాలు, జిఎస్టీ వాయింపులు, పెట్రో ధరల పెంపు, గ్యాస్ ధరల పెంపుపై సమాధానం ఇవ్వాలి. వీటివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎందుకు గుర్తించడం లేదో… వాటిని సమస్యలుగా ఎందకు పరిగణించడం లేదో చెప్పాలి.
కరోనాతో లక్షల్లో ప్రజలు చనిపోయినా ఎందుకు లెక్కలు సరిగా చెప్పలేదో సంజాయిషీ ఇచ్చుకోవాలి. వారి కుటుంబాలను కనీసం ఆదుకోవాలన్న స్పృహ ఎందుకు లేదో చెప్పాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి.. కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ వచ్చి ఉండేది కాదని,సిక్కుల ఊచకోత జరిగేది కాదంటూ విరుచుకుపడ్డ తీరు తీవ్ర ఆక్షేపణీయం.
మోడీ తీరు చూస్తుంటే కాంగ్రెస్ గురించి ఎందుకనో భయపడు తున్నట్లుగా ఉంది. తప్పులు చేస్తున్నారు కనుకనే ఈ భయమని భావించాలి. నిజంగానే ఆయన సమర్థుడు అయితే పెట్రోధరలను ఎన్నికల ముందు తగ్గించడం..తరవాత పెంచడం చేస్తూ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారో చెప్నాలి.
కాంగ్రెస్ హయాంలో ఉన్న 400 రూపాయల వద్ద మాత్రమే ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు వేయి రూపాయల దగ్గరకు ఎందుకు చేరిందో చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ధరలు వంద ఎందుకు దాటిందో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ఆ పార్టీలోని పెద్దలే గుర్తించడం లేదు.
అలాం టప్పుడు ప్రజలకు లేని దురద మోడీకెందుకు అన్నదే ప్రశ్న. ప్రజలకు కావాల్సింది పార్లమెంటులో ఈ సమాధానమా అన్నది మోడీ వివరించాలి. ఇలాంటి చిల్లర రాజకీయాలుచేయాల్సిన అసవరం ప్రధాని హోదాలో మోడీకి అవసర మా అన్నది కావాలి. ఇక ఎపి విభజనపైనా ఆయన ఇప్పటికీ పలుమార్లు ప్రస్తావించారు.
నిజానికి సమర్థ ప్రధాని అయితే విభజన సమస్యలను ఎందుకు పట్టించు కోవడం లేదు. ఎందుకు పరిష్కరించడం లేదు. ఇవన్నీ పట్టించుకోక పోవడం చేతగానితనంకాక మరోటి కాదు. బిజెపి నేతలు కూడా తానా అంటే తందానా అన్నట్లుగా వంతపాడడం తప్ప మరేవిూ పట్టనట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఆత్మవిమర్శ చేసుకోవాలి.
పార్టీలో అద్వానీ, ముళీమనోహర్ జోషి లాంటి వారిని పక్కన పెట్టి తమకు తిరుగులేకుండా ఏలుతున్న తీరు ప్రజలకు తెలియదని అనుకుంటే పొరపాటు.
మొత్తంగా బిజెపి తీరు..నానాటికీ తీసికట్టు నాగంభొట్లు ..అన్నట్లుగా తయారయ్యింది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న బిజెపి అసలు ఎజెండా ఏమిటో చెప్పడం లేదు. ప్రజల సమస్యలను పరిష్కరించే తీరులో నిజాయితీ కనిపించడం లేదు. ఆహా ఓహో అంటూ.. భజనలను చేయించుకోవడం తప్ప అధినాయకత్వం సమస్యలను సత్వర పరిష్కారం చూపడంలేదు.
ఎపిలో అమరావతి రాజధాని ఉద్యమంపై స్పష్టత లేదు. అలాగా తాజాగా విశాఖ స్టీల్ ప్టాంట్‌ను మాత్రం తెగన మ్మడానికి ఉత్సాహం చూపుతోంది. విశాఖ స్టీల్ కోసం ఆందోళన చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో సైతం ప్రజా సమస్యలపై స్పష్టత కానరావడం లేదు.
ఎపి విషయానికి వస్తే ప్రధానంగా రాజధాని, పోలవరం, విశాఖ ఉక్కుపై ప్రజలకు ఎలాంటి హావిూ ఇస్తారో కూడా చెప్పడం లేదు. అయితే కేందప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రం లో ఆ పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటున్నా లెక్కలే కుండా సాగుతున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించా లన్న నిర్ణయం విషయంలో కేంద ప్రభుత్వం అడుగులు ముందుకేస్తే బిజెపికి పుట్టగతులండవని గుర్తించు కోవాలి.
విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం తీరును అడ్డుకోవాల్సిన బాధ్యత స్థానిక బీజేపీ నేతలపైనే ఎక్కువగా ఉంది. ఇకపోతే కాంగ్రెస్ నేతల మైండ్‌సెట్ అర్బన్ నక్సలైట్లను తలపిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. వారివల్లే దేశంలో అవినీతి చీడ వ్యాపిస్తోందన్నారు. నిజానికి గత ఏడున్నరేళ్లుగా వాళ్లకే దిక్కు లేకుండా పోయింది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి చర్చ ఎవరూ కోరుకోవడం లేదు. మోడీ వచ్చాక ఏ మాత్రం దేశం బాగు పడిరదో అన్నది చర్చించాలి. రూపాయి మారకం విలువ ఎందుకు పెరిగిందో చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో అన్నది ఇప్పుడు సమస్య కాదు..విభజన తరవాత అధికారం లోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఎంత హుందాగా సమస్యలను పరిష్కరించిందో అన్నది కావాలి.
ఎన్ని సమస్యలను పరిష్కరించారో కావాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కావన్న మోడీ నిజంగానే సమర్థుడు అయితే సమస్యలను పరిష్కరించి..ప్రజలతో శహభాష్ అనిపించుకోవాలి. ఎన్నో దఫాలుగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ.. కేంద్రం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం చేయడం లేదు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుంటిసాకులు చెప్పిందో తెలియంది కాదు.సరైన పద్ధతిలో తెలంగాణ, ఏపీ విభజన జరగలేదంటున్న మోడీ సరైన విధంగా ఎందకు పరిష్కరించడం లేదో చెప్పాలి. వీటన్నింటికి సమాధానం చెప్పకపోవడం.. పరిష్కారానికి ప్రయత్నించక పోవడం అసమర్థుడి లక్షణం తప్ప మరోటి కాదు.
మోడీ తన ప్రసంగంతో రాజకీయంగా లబ్ది పొందవచ్చు. కానీ అసమర్థతను మాత్రం కప్పి పుచ్చుకోలేక పోయారు. తాను బాగా మాట్లాడానని అనుకుంటే ప్రజలు అర్థం చేసుకోలేని వెర్రిబాగుల వారు కాదని గుర్తించాలి. ప్రజలకు కావాల్సింది ఊరట..స్వాంతన మాత్రమే..మోడీ ప్రసంగాలు కాదని గుర్తించాలి. ఇప్పటికైనా సమర్థంగా సమస్యలను పరిస్కరించే సత్తా చాటితే తప్ప బిజెపిక పుట్టగతులుడవు.