ప్రసూతి ఆసుపత్రికి అనారోగ్యం !

ఆసుపత్రికి అనారోగ్యం!
పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ప్రభుత్వాసుపత్రి కనీస వసతులు లేక అనారోగ్య వాతావరణంలో కొట్టుమిట్టాడుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ప్రసూతి కేంద్రం రోగులకు కనీస సౌకర్యాలు అందించలేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. తుప్పు పట్టిన మంచాలు, తిరగని ఫ్యాన్లు, ఆసుపత్రి ఆవరణలో వెలగని లైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఆసుపత్రిలో సమస్యలు చాలానే ఉన్నాయి. ఆసుపత్రి ఆవరణ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది.
ఇలాంటి వాతావరణంలో ఉన్న ఆసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం లేదు. లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులకు గురై పట్టించుకునే నాధుడే లేక మూలన పడి ఉంది.