నిరుపయోగంగా మారిన డంపింగ్ యార్డ్
లక్షలు వెచ్చించినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం.
…… నిరుపయోగంగా మారిన డంపింగ్ యార్డ్
చర్ల ఫిబ్రవరి 7 (నిజం న్యూస్.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని ధ్యేయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డంపింగ్ షెడ్లు కొన్ని పంచాయతీలలో నిరుపయోగంగా మారుతున్నాయి. పంచాయతీ పరిధిలోని గ్రామాలలో చెత్తను సేకరిస్తున్నారు తప్ప ఆ చెత్తను డంపింగ్ యార్డ్ కు చేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. చెత్తను డంపింగ్ యార్డ్ లో వేయకుండా ఖాళీ ప్రదేశాలలో వేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతూ దాంతోపాటు పందులు స్వైర విహారం చేస్తున్నాయి. చర్ల మేజర్ పంచాయతీలో లక్షల వ్యయంతో నిర్మించిన డంపింగ్ యార్డు, స్మశాన వాటిక రెండూ నిరుపయోగంగా మారాయి. మేజర్ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి తడి పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయవలసి ఉండగా సేకరించిన చెత్తను వైకుంఠ ధామం పక్కన పడ వేయడంతో సమీప ఇళ్ళలోని ప్రజలు దుర్వాసనతో ముక్కు మూసుకొని గడపవలసి వస్తుంది. పంచాయతీ వారు సేకరించే చెత్త కాకుండా చికెన్ షాపుల వ్యర్ధాలను కూడా తెచ్చి ఇక్కడే పడవేయడంతో పందులు స్వైర విహారం చేస్తూ అటుగా వచ్చే ప్రజలపై దాడి చేసే పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే వైకుంఠధామానికి తీసుకు వస్తే చెత్త లోనే అంత్యక్రియలు జరపాల్సిన దుస్థితి దాపురించింది.
కుంటుపడిన వర్మి కంపోస్ట్ తయారీ:
తడి చెత్త తో వర్మి కంపోస్టు తయారు చేసి సన్న చిన్నకారు రైతులకు తక్కువ ధరకు ఇవ్వవలసి ఉండగా వర్మీ కంపోస్ట్ ఊసే లేకుండా తడి పొడి చెత్తను ఎక్కడబడితే అక్కడ పంచాయతీ సిబ్బంది పార వేస్తున్నారు.
కరోనా సమయంలో పరిశుభ్రత లేకపోతే ఎలా?
కరోనా వైరస్ విస్తరిస్తున్న ఈ సమయంలో తమ ప్రాంతంలో గ్రామంలోని చెత్తనంతా తెచ్చి వేస్తే పరిశుభ్రత ఎక్కడి నుండి వస్తుంది అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సారించాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు.