Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అసలు బస్ స్టాండ్ వదిలి పట్టా భూమిలో మరో బస్ స్టాండ్..?..!

పట్టా భూమిని కబ్జా చేసిన ఆర్టీసి..?

అసలు బస్ స్టాండ్ వదిలి పట్టా భూమిలో తిష్ట..!

*పదహారు గుంటలతో మొదలుపెట్టి-రెండున్నర ఎకరాలు కబ్జా..!

*కబ్జా చేసిన స్థలానికి డెబ్భై లక్షల నిధులు

– అసలు బస్ స్టాండ్ కు నిధులు లేవన్న డిపో మేనేజర్

*స్వచ్చంద సంస్థ పేరుతో పట్టాదారుని ముంచే యత్నం*

నిజం న్యూస్ (ఫిబ్రవరి06), భద్రాద్రి కొత్తగూడెం:

మణుగూరు లో భూదందా రోజుకో రూపంలో సామాన్యుల నడ్డి విరుస్తోంది. నిన్నటికి నిన్న ఇంటి స్థలాల కోసం ఒక ప్రజాప్రతినిధి కోటి రూపాయలు డిమాండ్ చేసిన వార్త మరువకముందే స్థానికంగా మరో ఉదంతం వెలుగుచూసింది. అయితే ఈసారి ఈ నిర్వాకానికి ఒడిగట్టింది తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ…!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక స్వచ్ఛంద సంస్థ ప్రజల సౌకర్యార్థం రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ఇప్పుడు ఏకంగా బస్ స్టాండ్ గా అవతరించబోతోంది. దీనికోసం రెవెన్యూశాఖ తమవంతు సహాయంగా పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా చిత్రీకరించే పనిలో ఉన్నారు…? పంచనామాలతో తికమక పెడుతూ ఒక అభాగ్యున్ని వేధిస్తున్న వ్యవహారం వెనుక ఎప్పటిలాగే భూకబ్జాలకు రుచిమరిగిన ఓ ప్రజాప్రతినిధి ఉన్నాడని స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మణుగూరు రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 203 లోని రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటల పట్టాభూమి ప్రస్తుత భూదందాకు కేంద్రబిందువైంది. సవలం ఆదేయ్య పేరుతో 1953 సేత్వార్ మొదలుకొని నేటివరకు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయబడిన పట్టా భూమిపై ఆర్టీసీ కన్ను పడింది…!

2000 సంవత్సరంలో వాసవి క్లబ్ నిర్మించిన సురక్ష బస్ షెల్టర్ ఇప్పుడు పట్టాదారు కుటుంబానికి షెల్టర్ లేకుండా చేస్తుంది. 2.26 గుంటల పట్టా భూమిలో 0.16 గుంటల విస్తీర్ణంలో బస్ షెల్టర్ నిర్మాణానికి పట్టాదారు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని అప్పటి జిల్లా కలెక్టర్ గిరిధర్ కు తప్పుడు నివేదికను పంపి ఈ భూదందాకు శ్రీకారం చుట్టారు…!

నిజానికి ఈ బస్ షెల్టర్ నిర్మాణానికి పట్టాదారు ఎప్పుడూ అనుమతించలేదు. ఆర్టీసీ వారికి ప్రస్తుత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆనుకొని సుమారు 5 ఎకరాల స్థలంలో డిపో మరియు బస్ స్టాండ్ ఉండగా దాన్ని వదిలి నడిరోడ్డు మీద ఉన్న బస్ షెల్టర్ ను బస్ స్టాండ్ గా మార్చడంలో ఆంతర్యం ఏమిటో స్థానికులకు అంతుబట్టడంలేదు.

రెండు దశాబ్దాలుగా పట్టాదారు అతని కుటుంబం నా స్థలాన్ని నాకు ఇవ్వండని మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా ఇది ప్రభుత్వ భూమి అని అందరిని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ భూమికి సంబంధించిన 1953 సంవత్సరం నాటి సేత్వార్ కాపీ సహా అన్ని సంవత్సరాల పహాని కాపీలను *నిజం న్యూస్* సంపాదించింది. మినీ బస్ స్టాండ్ నిర్మాణానికి సంబంధించిన వివరాలు రెవిన్యూ రికార్డులలో ఎక్కడా నమోదు కాకపోవడం గమనార్హం.

*బలవంతపు దానం*

మణుగూరులో వాసవి క్లబ్ వారు తమ నిధులతో బస్ స్టేషన్ నిర్మించడానికి నిర్ణయించిన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వారి కోరిక మేరకు పట్టాదారు అందుకు అంగీకరించి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిధర్ నుండి 2000 సంవత్సరంలో ఆదేశాలు వచ్చాయి. అయితే పట్టా భూమిని తాము కానీ తమ తండ్రి కానీ ఎవ్వరికి ఇవ్వలేదని బాధితుతుడు చెబుతున్నాడు. సురక్ష బస్ స్టాండ్ పేరుతో ఆర్టీసీ అధికారులే నాభూమిని ఆక్రమించారని తెలిపాడు. ఈ భూమి గురించి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి మనస్తాపంతో మంచంపట్టి తన తండ్రి మరణించాడని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నాలుగేళ్ల క్రితం సురక్ష బస్ స్టాండ్ ఆర్టీసీ ఆధీనంలోకి వెళ్లిందని చెబుతున్నా అసలు వాసవి క్లబ్ వారికి ఈ స్థలం ఎలా సంక్రమించింది ఎవరికి తెలియదు..! 2000 సంవత్సరంలో కలెక్టర్ గిరిధర్ ఇచ్చిన అదేశాల్లో సైతం ఆస్థలాన్ని పట్టాభూమి గా పేర్కొన్నారు.

*సొంత స్థలం వదిలి పక్కోడి భూమిపై పడ్డారు*

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 1987 లోనే మణుగూరులో సుమారు ఐదు ఎకరాల స్థలంలో బస్ స్టేషన్ నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు గ్రామీణ క్రాంతి పథం క్రింద గ్రామ ప్రజలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉమ్మడి సహకారంతో 12 డిసెంబర్ 1987 న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామాత్యులు  కరణం రామచంద్రరావు దీనికి శంఖుస్థాపన చేశారు. ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో అప్పటి ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె.విజయరామరావు ఉన్నారు. ఈ బస్ స్టేషన్ ను 19 అక్టోబరు 1989 న రాష్ట్ర చిన్నతరహా నీటిపారుదల శాఖామాత్యులు కోనేరు నాగేశ్వరరావు ప్రారంభోత్సవం జరిపారు. ఈ ప్రారంభోత్సవానికి అప్పటి శాసనసభ సభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. అంతేకాదు అప్పటి జెడ్పీ చైర్మన్ చేకూరి కాశయ్య, శాసన సభ్యులు చందా లింగయ్య, అప్పటి ఏపీఎస్ ఆర్టిసి వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎచ్.జె.దొర ఉన్నారు. అక్కడ బస్ డిపో నిర్మాణం కూడా జరిగింది. బస్ స్టాండ్ ఆవరణలోనే నిర్మించిన టాయిలెట్లు ఇప్పుడు కూలిపోయాయి. అయితే విశాలమైన బస్ స్టాండ్ స్థలాన్ని వదిలి ఆర్టీసీ అధికారులు ఒక అభాగ్యుని పట్టభూమిపై కన్నేశారు.

మెయిన్ రోడ్డు పక్కన ఉన్న పట్ఠాభూమిలో కేవలం పదహారు గుంటల విస్తీర్ణంలో బస్ స్టాండ్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. పట్టుమని నాలుగు బస్సులు కూడా నిలుపడానికి అవకాశం ఉండదు ఇక్కడ. బస్సుల రాకపోకల సమయంలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడే ఆటో స్టాండ్ కూడా ఉండడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు అధికంగానే ఉన్నాయి. పట్టాదారు అనుమతి లేకుండా స్వచ్ఛంద సంస్థ సహాయంతో బస్ షెల్టర్ నిర్మించడానికి ఆర్టీసీ వారికి అధికారం ఎలా వచ్చిందో మరి. మండల రెవెన్యూ అధికారులు తమకు నచ్చినట్టు పంచనామాలు రాసుకొని పట్టాదారున్నీ మోసం చేయడం వెనుక అసలు కుట్రదారులు ఎవరు అన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేని తార ప్రసాద్ అనే వ్యక్తి స్థలదాత గా శిలాఫలకం వెలసింది. పురపాలక సంఘం ఇందులో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించింది. స్థానిక ఎంఎల్ఏ గారే దీన్ని ప్రారంభించడం విశేషం.

*గతంలో మినీ బస్ స్టాండ్*

1989 సంవత్సరం లో బస్ స్టాండ్ నిర్మాణం పూర్తయిన తరువాత సరిగ్గా దశాబ్ద కాలం తరువాత అంటే 1999లో అప్పటి మణుగూరులోని బండారుగూడెం బయ్యారం సెంటర్ల మధ్య ప్రయాణికుల సౌకర్యార్థం స్వచ్చంద సంస్థల సహకారంతో భగత్ సింగ్ నగర్ ఎదురుగా సురక్ష మినీ బస్ స్టాండ్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అప్పటి మణుగూరు సిఐ ప్రకాశ్ యాదవ్, ఎస్ఐ శుభాషచంద్రబోస్ లు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. పోలీసు అధికారులకు తోడు సింగరేణి, వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ వారితోపాటు కొందరు దాతలు కూడా ఈ మినీ బస్ స్టాండ్ నిర్మాణానికి సహకరించారు. కానీ ఇప్పుడు ఆస్థలం మరియు మినీ బస్ స్టాండ్ ను ఆర్టీసీ కి అప్పగించామని వాసవి క్లబ్ వారు చెప్పడం విడ్డూరం. ఎందుకంటే అది పట్టాభూమి. దాన్ని పట్టాదారు కానీ వారసులు కానీ వాసవి క్లబ్ కు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా 1999 లో మినీ బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతున్నపుడే పట్టాదారు సవలం బక్కులు కుమారుడు సవలం ఆదేయ్య తన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించులేదని వారసులు చెబుతున్నారు.

 

*అసలు బస్ స్టాండ్ కు నిధుల్లేవు- సురక్ష బస్టాండ్ కు డెబ్భై లక్షలు ఎక్కడివి?*

ఇదిలా ఉండగా బస్ స్టాండ్ అభివృద్ధికి నిధులు లేవు అని ఒకపక్క చెబుతూనే మరోపక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుండి డెబ్భై లక్షల రూపాయల నిధులు సురక్ష మినీ బస్ స్టాండ్ కు కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానిక ఏంఎల్ఎల్ రేగా కాంతారావు ఈ పనులను ప్రారంభించడం విశేషం. నాలుగు బస్సులు నిలుపడానికి కూడా సరిపోని ఈ స్థలంలో డెబ్భై లక్షల రూపాయలతో ఎలాంటి పనులు చేస్తారన్నది అర్ధంకాని ప్రశ్న. ఈ డెబ్భై లక్షల పనులకు స్థానిక ప్రజాప్రతినిధి బంధువు ఒకరు గుత్తేదారుగా ఉన్నారు. అంతేకాకుండా సురక్ష మినీ బస్ స్టాండ్ కు కూతవేటు దూరంలో సింగరేణి బ్లాస్టింగ్ జరుగుతుండటంతో ప్రతిరోజూ మూడు గంటల ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిపివేయడం రివాజు. ఇదిమాత్రమే కాదు సురక్ష మినీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న భగత్ సింగ్ నగర్ రైల్వే లైన్ నిమిత్తం భూసేకరణ కూడా పూర్తి అయింది. ఇన్ని సమస్యల నడుమ కేవలం పదహారు గుంటల స్థలంలో బస్ స్టాండ్ నిర్మాణం పోను బస్సులు ఆగడానికి కూడా స్థలం సరిపోదని తెలిసినా ఎవరి లాభంకోసం డెబ్భై లక్షల డిఎంఎఫ్ నిధులు విడుదల చేయించారు?. ఇవే నిధులు అసలు బస్ స్టాండ్ కోసం కేటాయిస్తే డిపో సహా బస్ స్టాండ్ మొత్తం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. విశాలమైన ప్రయాణ ప్రాంగణం కళ్ళముందు సాక్షాత్త్కరిస్తుంది.