విద్యాశాఖలో మరిన్ని సంస్కరణలు

మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
విద్యారంగ పటిష్టతకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి సమగ్రంగా పటిష్టం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులతో పలు సమావేశాలు నిర్వహించి నిధుల డిమాండ్లు, అవసరాలపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రెగ్యులర్‌గా ఇచ్చే నిధులకంటే అదనంగా నిధులు కేటాయించాలని కోరనున్నారు. విద్యాశాఖలో గత ఏడాది అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.
వీటితోపాటు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలున్నాయని, అవి అమలు కావడానికి బడ్జెట్‌లో విద్యాశాఖకు అదనంగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్ విద్యను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో టాయిలెట్లు, మంచినీటి సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
విద్యా సంస్థల్లో టాయిలెట్లు, నీటి వసతి, కనీస వసతులు పూర్తి స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ చెబుతున్నారు. సిఎం సూచనల మేరకు పాఠశాలలను పటిష్టం చేసేందుకు అదనంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో కొన్నింటిని కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నాణ్యమైన కాలేజీ విద్య కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం భవనాలు, వసతులున్న స్కూళ్లనే రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు అధికారులు వివరించారు.
డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాల కోసం అదనపునిధులు అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరిగేలా చూడాలని కోరనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్నభోజన పథకం ప్రవేశ పెట్టడానికి అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
తెలంగాణలో 404 జూనియర్ కాలేజీలు ఉన్నాయని, వీటిల్లో ప్రస్తుతం లక్షా 73వేల మంది విద్యార్థులున్నారని, వచ్చే విద్యా సంవత్సరం ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతుల కోసం మరిన్ని అవసరమవుతా యని గుర్తించారు.
పేద వర్గాల ఆడపిల్లలు చదివే కస్సూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని అక్కడ అన్ని వసతులు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం కేజీబీవీలకు ఉన్న భవనాలను హాస్టల్స్‌గా వినియోగించి, కొత్తగా ఆరు తరగతి గదులతో అకాడమిక్ బ్లాకులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. యూనివర్శిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈమేరకు అక్కడ మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీ, కొత్త పోస్టుల మంజూరు చేస్తున్నామని అంటున్నారు.