బాల్య వివాహాలను అడ్డుకున్న కల్యాణలక్ష్మి

పథకం వచ్చాక ఆగిన బాల్య వివాహాలు

ఆడపిల్లల తల్లిదండ్రుల్లో గుణాత్మక మార్పు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు బాల్యవివాహాలను నియంత్రించడంలో విజయవంతమైనట్లు తేలింది. గతంలో సిఎం కెసిఆర్‌, హోంమంత్రి మమ్మూద్‌ అలీలు పలు సందర్భాల్లో దీనిగురించి చెబుతూ వచ్చారు.

బాల్య వివాహాలకు ఈ పథకం అడ్డుకట్ట వేసిందన్నారు. ముస్లిం మైనార్టీల్లోనూ బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడిరది. షాదీముబారక్‌తో అనేక కుటుంబాలు లాభపడ్డాయి. ఇప్పుడు ఓ సర్వే కూడా ఇదేనిజమని తేల్చింది. ఈ పథకం అమలు, బాల్యవివాహాలపై అధ్యయనం చేశారు.

క్షేత్రస్థాయిలోకి వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై అధ్యయనం చేసింది. అయితే ఈ పథకాల అమలుకు ముందు, పథకాల అమలు తర్వాత అధ్యయనం చేయగా స్పష్టమైన మార్పులు కనిపించాయి. దీనికితోడు ఆడపిల్లలు ఉన్న తల్తిదండ్రల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల వల్ల బాల్యవివాహాలు క్షేత్రస్థాయిలో గణనీయంగా తగ్గాయని గుర్తించారు.

2011`14 సంవత్సరాల కాలంలో మొత్తం వివాహాల్లో 50 శాతం బాల్య వివాహాలు ఉండగా, 2014`17 సంవత్సరాల మధ్య కాలంలో మొత్తం వివాహాల్లో కేవలం 23.61 శాతం మాత్రమే బాల్య వివాహాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 2011`14 మధ్యకాలంలో 38.09 శాతం వివాహాలు జరుగగా, 2014`17 మధ్యలో 19.44 శాతం మాత్రమే బాల్య వివాహాలు జరిగాయి.  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు మాత్రమే వర్తింపజేస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించారు.  చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు 18 ఏండ్లు నిండిన తరువాత పెండ్లి జేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధ్యయనంలో తేలింది. గతంలో 18 ఏళ్ల లోపు వివాహాలపై పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా బాల్య వివాహాలపై ఎన్జీవోలు,పోలీసులు కూడా బాగా హెచ్చరికలు చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వ సాయం పొందాలనుకుంటున్న వారు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తరవాతనే పెళ్లిళ్లు చేస్తున్నారు. అప్పటి వరకు చదివించేందుకు కూడా ముందుకు వస్తున్నారు.