మొక్కుబడి ప్రసంగాలతో ప్రజలకు ఒరిగేదేమిటి ?

ప్రజల సమస్యలపై సమాధానం చెప్పేదెవరు
ప్రతిసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్రపతి చేసే ప్రసంగం ఒక లాంఛనప్రాయమే అయినా రాష్ట్రపతి ప్రసంగాలకు ఎంతో ప్రామాణికత ఉంటుంది. నిజానికి ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రాష్ట్రపతి చదువుతారు.
అలాగే రాష్టాల్ల్రో గవర్నర్ ప్రసంగాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఆయా రాష్టాల్ర ప్రభుత్వాలు తయారుచేసిన ప్రసంగ పాఠాలను చదువు తారు. అయితే రాష్ట్రపతి లేదా గవర్నర్లు ఈ సందర్భంగా ఏదైనా అభ్యంతరాలు చెప్పినల సందర్భం బహు అరుదు.
మరో నాలుగు నెలల్లో తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్న రాంనాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతిగా వెలువరించిన చివరి ప్రసంగం మొక్కుబడిగా ముగిసింది. అందుకుమనం రాష్ట్రపతిని తప్పు పట్టడానికి లేదు. అలా జరగగడానికి మోడీ సర్కార్ వైఫల్యంగా చూడాలి.
ఆత్మవిమర్శ చేసుకుని ప్రసంగాన్ని రూపొందించి ఉంటే ఇలా జరిగేది కాదు. అనేకానేక సమస్యలను ప్రస్తావిస్తూ..పరిష్కరించిన వాటి గురించి ప్రసంగంలో ప్రస్తావించి ఉంటే హుందాగా ఉండేది.
ప్రతి రాష్ట్రపతి, తన ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం మామూలే. కాని, ఇతర రాజకీయ నాయకులు సభలో చేసే ప్రసంగాలు, ఎన్నికల సభల్లో చేసే ప్రసంగాలకు అది భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ గణాంక వివరాలను ప్రస్తావించడం మాత్రమే కాక, దేశ ప్రజలను చైతన్యపరిచే, వారికి ఆత్మస్ఠయిర్యం కలిగించే, భవిష్యత్ పట్ల ప్రేరణ కలిగించే అనేక అంశాలు ఇందులో చోటుచేసుకుని ఉండాల్సింది.
కాని రాంనాథ్ కోవింద్ తన చివరి ప్రసంగంలో కేవలం గణాంక వివరాలను మాత్రమే చెప్పి మోదీ సర్కార్‌ను ఆకాశానికెత్తడానికే పరిమిత మయ్యారు. ఇది కేవలం ఆయన తన సొంతంగా చేసిన ప్రంగంకాదు కనుక తప్పు పట్టడానికి లేదు. నిజానికి గత ఏడాదిగా కరోనాతో లక్షలాదికుటుంబాలు వేదన పడ్డాయి. వారిని ఆదుకోవడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి.
ప్రతిపక్షాలు ఎంత నిరసన వ్యక్తం చేసినా పార్లమెంట్‌లో సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అటు ప్రభుత్వ పక్షాన, ఇటు ప్రతిపక్షాల తరఫున సమర్థంగా మాట్లాడే నేతలు లేకపోవడం కూడా కారణంగా చూడాలి. ఆర్థిక సర్వేలోనే ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు.
గత డిసెంబర్‌లో రిటైల్ రంగంలో ద్రవ్యోల్బణం 5.6 శాతం పెరిగితే, టోకు ధరల ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో 14.2 శాతం పెరిగిందని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీనిపై చర్చించి ముందుకు సాగే ఆలోచన ఎక్కడా కానరావడం లేదు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం, వారు గందరగోళం సృష్టిస్తే నెపం వారివిూదకు నెట్టివేసి తమ ఇష్టారాజ్యంగా బిల్లులను ఆమోదింపచేసుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా రాజ్యసభలో మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సభ గందరగోళంలో పడితే బిల్లులను ఆమోదింప చేసుకోవడం సులభంగా మారింది.