Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాజ్యాంగంపై విస్తృతంగా చర్చించాలి ! 

భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరినీ సమస్కంధులుగా, సమాన వాటాదారులుగా ప్రకటించింది. అయినప్పటికీ ఇంకా ఇన్ని కోట్లమంది ప్రజలు నిస్సహాయులుగా నిరుపేదలుగా మిగిలి పోవడానికి కారణం ఏమిటి? ఇది రాజ్యాంగం లోపమా.. లేక నాయకుల లోపమా అన్నది చర్చించాలి.

భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ప్రతిపాదనలపై కొన్ని రాజకీయా పార్టీల నేతలు ఎగిరిపడడం చూస్తుంటే వారు ఎంతగా పదవు లను పట్టుకుని పాతుకుని పోవాలన్న ధోరణిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

రాజ్యాంగ ఇంతకాలం కేవలం రాజకీయనాయకుల అవసరాలను మాత్రమే తీర్చింది. పెత్తందారీలకుమాత్రమే మేలు చేసింది. బడాబాబు లను మరింత పెద్దవారుగా ఎదగడానికి దోహదపడి౦ది. సామాన్యులు సామాన్యులగానే ఉండి పోయారు.

విద్య,ఉద్యోగం,వైద్యం వంటి వాటిల్లో ఖచ్చితమైన హావిూని పొందలేకపోయారు. ఇవన్నీ చర్చించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది.రాజ్యంగంలో ఉన్న అంశాలను చర్చించాలి. ఎక్కడ మనం విఫలం అయ్యమో చర్చించాలి.

కారకులు ఎవరో తేల్చాలి. రాజ్యాంగం అంటూ మార్చాల్సి వస్తే రాజకీయ నాయకుల పెత్తనం లేకుండా ఉండేలా చూసుకోవాలి. రాజ్యాంగం అంటే శిలాశాసనంగా ఉండాలి. దానిని కాదని పక్కకు తొలగి తే ఉరివేసే విధంగా శిక్షలు ఉండాలి.

భయం ఉంటే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. నిజానికి రాజ్యాంగా న్ని మార్చాల్సిన అవసరంపై చర్చచేయాలి. రాజకీయ నాయకుల అభీష్టం మేరకు కాకుండా ప్రజల ఆలోచ నలకు అనుగుణంగా, సమాజాంలో అసవరాలకు అనుగుణంగా..మారిన ప్రపంచ గతికి అనుగుణంగా మన రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఒకే వ్యక్తి జీవిత పర్యంతం పదవులను పట్టుకుని వేలాడే పద్దతి పోవాలి. రిజర్వేషన్లు ఒకే కుటుంబంలో జీవితాంతం అనుభవించే దశ పోవాలి. 130 కోట్ల మందికి అనుగుణంగా రాజ్యాంగం మారాలి. అంతరికీ సమాన ఫలాలు దక్కేలా చట్టాలు ఉండాలి. రిజర్వేషన్ల ఫలాలు అన్ని కుటుంబాలకు వరుసగా అందాలంటే ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు పర్యాయాలు మాత్రమే దక్కాలి.

రాజకీయంగా కూడా రిజర్వేషన్లు రావాలి. సర్పంచ్‌ మొదలు ఎంపిలు, ఎమ్మెల్యేల వరకు ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి పదవిలో ఉండకుండా.. అమెరికా అధ్యక్ష పాలన తరహాలో రిజర్వేషన్లు ఉండాలి. అప్పుడు ప్రజలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. కెసిఆర్‌ చెప్పినట్లో లేదా మోడీ చెప్పినట్లో రాజ్యాంగం కాకుండా మేధావుల సమక్షంలో ప్రజల అభీష్టం మేరకు మార్పులు,చేర్పులు జరగాలి.

ప్రస్తు రాజ్యాంగం మూలాలను విడవ కుండా ఇందుకు సిద్దపడాలి. అలా చేయడం ద్వారా ప్రజలకు రాజ్యాంగ రక్షణ దక్కగలదు. నిరంతరాయం గా రాజకీయ నేతలు పదవులు పట్టుకుని వేలాడడం వల్లనే రాజ్యాంగం అపహాస్యం అవుతోంది. పేదలకు రక్షణ కల్పించలేకపోతున్నది. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా పాలన చేస్తున్నారు. తాము చెప్పిందే రాజ్యాంగం అన్నరీతిలో సాగుతున్నారు.

అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్య,వైద్యం, ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అందివ్వలేకపోవడం వల్ల రాజ్యాంగం అపహాస్యం అవుతోంది. ఇది రాజకీయ నాయకుల కురుచ బుద్ది వల్ల, స్వార్థం వల్ల, అధికార యావ వల్ల అని తేలింది.అందుకు కారణం రాజకీయాలే అని విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

పేదరికంపై విజయం సాధించ గలిగే చర్యలు జరగడంలేదు. నిర్ణయాలు ఉండడం లేదు. ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించలేని జాతీయ విద్యావిధానం అవసరమా అన్నది చర్చించాలి. ఉద్యోగాలు కల్పించలేని చదువులు అవసరమా అన్నది చర్చించాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన దగ్గర్నుంచీ లెక్కలేసుకుంటే ప్రజలకన్నా వ్యాపారు లు, కార్పోరేట్లు, రాజకీయ నేతలే బాగుపడ్డారు. వారికోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతూ వస్తున్నారు.
ఓట్లను కొల్లగొట్టి అధికారం చెలాయిస్తున్నారు. నీతి వాక్యాలు ప్రవచిస్తున్న రాజకీయ నాయకులు అంతా ఇందుకు అతీతం కాదు. మొన్నటి కరోనా కారణంగా వేలాదిమంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధిం చిన లెక్కలు కూడా సరిగా చెప్పలేని పాలకులు మనకు అసవరమా…. వారిని ఆదుకోలేని పాలకులు మనకు అసవరమా..అన్నది ఆలోచన చేయాలి.

రాజ్యాంగం పటిష్టంగా ఉండి..రాజకీయ నాయకుల పెత్తనం లేకుంటే ఇలా జరిగేదా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి. పాలకులు అంటే పన్నులు వేయడం..తాము అనుకున్న పనులు చేసుకోవడం…దర్జాగా ఎసి గదుల్లో సుఖాలు అనుభవించడం.. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేయడం వంటివన్నీ ప్రజల జీవితాలను పణంగా పెట్టి చేయాల్సిన ఆగత్యం ఉందా అన్నది ఆలోచనచేయాలి.

గత రెండేళ్లుగా పార్లమెంట్‌ సమావేశాలు సరిగా సాగడం లేదు. కరోనా దెబ్బకు సమావే శాలు కుంచించుకుపోగా, దాదాపు ప్రతి సమావేశంలో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తున్నాం. పార్లమెంట్‌ సాగకపోవడం అన్నది ఎందుకన్న ఆలోచన చేసేదెవరు. నిజానికి ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం జవాబు చెబుతూనే పార్లమెంట్‌ను సజావుగా నడిపిం చే అవకాశాలున్నాయి.

ధరల పెరుగుదల, నిరుద్యోగం,మద్దతు ధరలు,రైతుల సమస్యలు, కరోనా సమస్యల గురించి చర్చ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. మన రాజ్యాంగం పటిష్టంగా ఉన్నా వీటిపై చర్చ జరగక పోవడానికి గల కారాణాలు ఏమిటన్నది ముందు చర్చించాలి. అంటే రాజకీయపెత్తనమే దీనికి కారణమని అర్థం అవుతోంది. ఇలా జరగడం అసవరమా అన్నది ముందుగా ఆలోచనచేయాలి.

ఈ క్రమంలో రాజ్యాంగాన్ని మార్చాలన్న విషయంలో చర్చ చేయాలి. అది ప్రజలకు ఎలా ఉపయోగ పడగలదో ప్రజాభిప్రాయం తీసుకోవాలి. బీజేపీ ఆలోచననే సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారని కాంగ్రెస్‌ నేతలు భుజాలు తుడుముకోవాల్సిన అసవరం లేదు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తోందని, ఆ కుట్రకు కేసీఆర్‌ వంత పాడారన్న ఆరోపణలు సరికాదు. రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే వారి ప్రమేయమే కాదు..కాంగ్రెస్‌ ప్రమేయం కూడా లేకుండా సాగాలి.

భూస్వాములు, అగ్రవర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారన్న వారు..ప్రజలకు లేదా సామాన్యులకు తమపాలనా కాలంలో ఎలా న్యాయం చేశారో చెప్పాలి. దేశ ప్రజలకు ఏమాత్రం మేలు జరగక పోవడానికి ఎవరు కారణమో చర్చించాలి. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్‌ అనడం సరైందా కాదా అన్నది ముఖ్యం కాదు.

అసలు ప్రజలకు ఎందుకు న్యాయం జరగడం లేదో.. ఎస్సీ, ఎస్టీల జీవితాలుఎందుకు బాగుపడడం లేదో చర్చించాలి. విద్యా,వైద్యంలో ఎందుకు ముందుకు వెళ్లలేదో చర్చించాలి. నేటికి మంచినీటి కటకటలు ఇంకా ఎందుకో చర్చించాలి. ఉన్న వనరులను వాడుకుని వాటిని ప్రజలకు ఎందుకు చేరవేయడం లేదో చర్చించాలి. అప్పుడు రాజ్యాంగం మార్చాలా వద్దా.. అన్నది తేలగలదు.