Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా మారబోతున్న యాదాద్రి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 03(నిజం న్యూస్)
దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా యాదాద్రి దేవాలయం మారబోతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.గురువారం నాడు మంత్రి టి. హరీశ్ రావు దంపతులు శ్రీ యాదాద్రి లక్ష్మి స్వామి దర్శించుకున్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గీత, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి దంపతులకు స్వాగతం పలికారు.స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయ విమాన గోపురం నిర్మాణానికి మంత్రి దంపతులు కిలో బంగారం స్వామివారికి సమర్పించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అత్యద్భుతంగా, ప్రత్యేక శ్రద్ధతో స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తుండడం సంతోషించదగిన విషయమని, దేవాలయ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు సిద్దిపేట నియోజకవర్గం నుండి ఆలయ గోపురం నిర్మాణం కోసం ఒక కిలో బంగారాన్ని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇవ్వడం జరిగిందని,తప్పకుండా మరో కిలో బంగారం సిద్దిపేట నియోజకవర్గం నుండి అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే విమాన గోపుర నిర్మాణం కోసం 35 కిలోల బంగారం భక్తుల నుండి వచ్చిందని, మరో 45 కిలోల బంగారం దాతలు ముందుకు వచ్చి అందిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా రాబోయే రోజులలో విలసిల్లుతుందని అన్నారు. మార్చి నెలలో దేవాలయాన్ని ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయించడం మనందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి ఎవరు హైదరాబాద్ వచ్చినా ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం విలసిల్లుతుందని అన్నారు. యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి యాదాద్రిలో 100 పడకల ఆసుపత్రి కావాలని కోరారని, భక్తులు, ప్రజల అవసరాల దృష్ట్యా ఆసుపత్రి అవసరమని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా కోశాధికారి సురేష్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.