మేళ్ళచెర్వు శివయ్య సొమ్ములు సొంత ఖాతాల్లోకి…?

– 70 నుండి 80 లక్షలు స్వాహా
– లెక్కలు చూపకపోవడంలో ఆంతర్యమేమి..?
– చోద్యం చూస్తున్న దేవాదాయశాఖ ఉన్నతాధికారులు
– చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్
మేళ్ళచెర్వు ఫిబ్రవరి 2 ( నిజం న్యూస్ ):
తెలంగాణలో పేరు ఎన్నికగన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.. అక్కడ శివరాత్రి ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలనుండి లక్షాలాది జనం తరలివస్తారు. ఈ ఆలయానికి ప్రతీ సంవత్సరం భక్తుల నుండి భారీగా విరాళాలతో పాటు, ప్రభుత్వ నిధుల కేటాయింపు జరుగుతోంది.
వచ్చిన నిధులను తమ ఖాతాలో వేసుకున్న కొంత మంది లెక్కలను చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. దేవాలయంలో పనిచేసిన ఓ దేవాదాయ శాఖ అధికారి తన లెక్కలు సరిచూసుకుని, ఆలయ లెక్కలు చూపకుండా ఈ నిధుల్లోని డబ్బులను వాడుకుని ముఖం చాటేస్తున్నాడని స్థానికంగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
సూర్యాపేట జిల్లా మేళ్ళచెర్వు స్వయంభు లింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన అభివృద్ధి నిధులు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. దేవాలయానికి వచ్చిన నిధులను దేవాలయ ఖాతాలో వేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా ఆ నిధులను తమ జేబుల్లో వేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ.
ఇక్కడ గతంలో పని చేసిన అధికారి దేవాలయానికి చెందిన సొమ్మును లక్షల్లో చేతి వాటం ప్రదర్శించారని స్థానికులలో చర్చ జరుగుతోంది. గత పాలక వర్గం పదవీకాలం ముగిసే సమయానికి స్వామి వారి ఖాతాలో ఉండాల్సిన రూ.5లక్షలు, అభివృద్ధి పనులకు ఓ భక్తుడు దేవాలయ ఖాతాలో వేసిన రూ.44 లక్షలు, గత మూడేళ్లుగా శివరాత్రికి వచ్చే నిధులు రూ.9 లక్షల తాలుకా డబ్బులు, సుమారుగా రూ.70 నుండి 80 లక్షల వరకు లెక్కలు తేలాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇవేకాక ఆలయ అభివృద్ధికి భక్తులు ఇచ్చిన లక్షలాది రూపాయలు దేవాలయ బ్యాంకు ఖాతాలో జమచేయకుండా తమ సొంతానికి ఇష్టానుసారంగా వాడుకున్నారని కొందరు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని చెబుతున్నారు. దేవాదాయ అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన జరుగుతుండటంతో వారి కూడా ఇందులో భాగం ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయ నిధులు లెక్కలు తేల్చిని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.