హుజూర్ నగర్ టిఆర్ఎస్ లో గుత్తా చిచ్చు ..?
– ఎక్కడా నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్థావించని టిఆర్ఎస్ నాయకులు
– సీఎం, మంత్రి, ఎమ్మేల్సీ అభివృద్ధి గురించే ప్రస్థావన
– ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నాయకులు
– ఇప్పుడు ఈ హుషారేమిటని నియోజకవర్గంలో చర్చ
– ఇందిరాసెంటర్‌లో రేపు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలకు సిద్దం
హుజూర్‌నగర్, ఫిబ్రవరి2(నిజంన్యూస్): టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ పార్టీలో చిచ్చు పెట్టనుందా అంటే అవుననే చెబుతున్నారు పలువురు విమర్శకులు.
ఇన్నాళ్లు టీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొంతమంది ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, ఉద్యమ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు గతంలో తమకు గుత్తాతో ఉన్న అనుబంధం కారణంగా పుట్టిన రోజు వేడుకలను హుజూర్ నగర్‌లోని ఇందిరాసెంటర్‌లో జరుపుకుంటున్నామని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులంతా హాజర్ కావాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను వేస్తున్నారు.
కానీ టీఆర్‌ఎస్‌లో కొందరు నాయకులకు ఇది రుచించడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రానున్నాయా అన్న చర్చ నడుస్తుండటం, టీఆర్‌ఎస్ పార్టీలో ఇన్నాళ్లు స్థబ్ధుగా ఉన్న నాయకులకు హుషారు రావడం ఇదంతా దేనికన్న చర్చ లేచింది. ఎన్నికలకు ముందుగానే అసమ్మతికి తెరలేపుతున్నారా అన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతుంది. .మంగళవారం జరిగిన టీఆర్‌ఎస్ నాయకుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ రవి నాయక్ మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లోని ఇందిరాసెంటరులో గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీపీ గూడెపు శ్రీనివాసు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గుత్తా సుఖేందర్‌రెడ్డి అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతూ ప్రజల మన్ననలు పొందుతున్నట్లు తెలుపుతూ, ఉదయం పది గంటలకు పార్టీ శ్రేణులు గుత్తా అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. వీరి సమావేశంలో సీఎం, మంత్రి, ఎమ్మెల్సీ చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడారు కాని ఎక్కడా నియోజకవర్గంలో జరుగుతున్న, చేస్తున్న అభివృద్ధిని చెప్పలేనదన్న పలువురు ఎత్తి చూపుతున్నారు.