యాచక మహిళను.. సంప్రదాయ బద్ధంగా సాగనంపారు
మానవత్వం ప్రదర్శించిన మహిళలు
వృద్ధురాలి అంత్యక్రియలకు ఏర్పాట్లుచేసిన మున్సిపల్ వైస్ ఛైర్మన్
హుజూర్‌నగర్ పట్టణంలోని టౌన్ హాల్ వెనక ఉన్న గుడిసెలో కొన్ని సంవత్సరాలుగా తులశమ్మ అనే ఓ వృద్ధ మహిళ ఎవరూలేని అనాధ మహిళగా యాచిస్తు జీవనం సాగిస్తోంది.కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రోడ్డుపక్కన నిన్న రాత్రి చనిపోయింది. పొరుగువారి ద్వారా సమాచారం తెలుసుకున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు ఉదయాన్నే అక్కడకు చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయించారు. చనిపోయిన మహిళపై వీధిలో ఉన్న మహిళలు మానవత్వ దృక్పథాన్నిచాటారు. కొన్నేళ్ళుగా తమ వీధిలో నివసిస్తున్న తులశమ్మ అనాధ శవంలా వెళ్ళకూడాదని స్వయంగా ఆమెకు సంప్రదాయ బద్ధంగ స్నానం చేయించి, కొత్త చీర కట్టి పూలమాలలు వేసి సాగనంపారు. కరోనా మహమ్మారి ఉంటున్న కాలంలో ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మహిళల స్పందన పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు.