గిరిజన రైతుల గోస…పట్టించుకోని అధికారులు

నష్ట పరిహారం అందించాలని, గిరిజన రైతుల డిమాండ్
ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, తక్షణమే సహకారం అందించాలని గిరిజన రైతుల వేడుకోలు.
తుంగతుర్తి ,జనవరి 31 నిజం న్యూస్.
ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలు రావడంతో ఒక ప్రక్క రైతుల సంతోష పడుతుండగా, ఒక ప్రక్క చిన్న కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో, కాలువకు గండి పడి రెండు రోజులు కావస్తున్నా, నేటి వరకు ఎస్సారెస్పీ సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని, నీటి ప్రభావముతో వరి పైరు నష్టపోయిన బాధిత గిరిజన రైతులు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని మానాపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు వరి నారు పెట్టుకొని, నాలుగైదు రోజులు కావస్తున్న తరుణంలో ఒకేసారిగా శుక్రవారం రాత్రి ఎస్ ఆర్ ఎస్ పి 69 కాలువ ద్వారా ఉదృతంగా నీరు ప్రవాహం రావడంతో, చిన్న కాలువ ద్వారా వస్తున్న నీటి ప్రవాహం ఒకేసారి ఉధృతంగా మరి మట్టి ప్రభావం కొట్టుకుపోవడంతో, పెద్ద గండి పడి, క్రింది ప్రాంతానికి నీరు ఒకేసారి ఉదృతంగా రావడంతో నాటు పెట్టిన పలువురు వరి పైర్లు పూర్తిగా ప్రవాహంలో కొట్టుకుపోవడంతో సుమారు ఎకరానికి 20 వేలకు పైగా నష్టం వాటిల్లిందని, పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సంబంధిత శాఖ అధికారులు మూడు రోజులు గడుస్తున్నా నేటి వరకు ఈ ప్రాంతానికి రాకపోవడం దారుణమని అన్నారు. గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కనీసం గ్రామపంచాయతీ నిధులతో నైనా, గండి పూడ్చడానికి సహాయ సహకారం అందించాలని, తెలుపుతూ, ఏది ఏమైనా తక్షణమే జరిగిన సంఘటనపై , తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, గిరిజన రైతుల ప్రయోజనాల దృష్ట్యా, పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, యుద్ధప్రాతిపదికపై, మరమ్మతులు నిర్వహించుటకు కృషి చేయాలని గిరిజన పేద రైతులు కోరుతున్నారు.