నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.
ఉ.11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యుల నుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించ నున్నారు.
ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగియ నున్నందున పార్లమెంట్ లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం కానుంది.
ఇది ముగిసిన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం ప్రారంభం కానుంది. అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశ పెట్టనున్నారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్యసభ సమావేశం అవుతుంది.
మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
సమావేశాల నిర్వహణ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సాయంత్రం 3 గంటలకు, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ సభల అఖిల పక్ష నేతలతో సమావేశం కానున్నారు.
ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకులు శుక్రవారమే వర్చువల్‌గా సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. భావసారూప్య పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సభలో పోరాడాలని నిర్ణయించారు.
ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.
రైల్వే ఉద్యోగాల నియామకాలపై యూపీ, బిహార్ రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనను సభ లోకి తీసుకెళ్లాలన్న యోచనతో కాంగ్రెస్ ఉంది.
*తొలి 2 రోజులు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉండవు..*
బడ్జెట్ సమావేశాలు తొలి రెండు రోజులు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లు ఉండవు.
ఈ సారి బడ్జెట్ లోనూ పెట్టుబడుల ఉపసంహరణ, మౌలిక వసతుల కల్పన, మూలధన వ్యయం పెంపు లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఆదాయ పన్ను రాయితీ పరిమితిని పెంచుతారని అందరూ ఊహిస్తున్నా.. అది సాకారం కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండటం, మరోవైపు ఆహారం, ఎరువుల సబ్సిడీ కేటాయింపులు భారీగా పెరిగిపోవడం, ఇంకోవైపు ఆర్థిక లోటు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించి ఆదాయాన్ని కోల్పోయే సాహసం చేయకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నందున దానికి గుర్తుగా కేంద్రం ఏదైనా ప్రముఖమైన నిర్ణయం వెలువరించ వచ్చని అంచనా వేస్తున్నారు.
కరోనా కారణంగా పట్టణాల్లో ఆర్థిక వ్యవస్థ కుంటుపడి చాలా మందికి ఉపాధి పోయిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని అసంఘటిత రంగ కార్మికులకు ఆదాయ మద్దతు ఇచ్చే విషయం గురించి కేంద్రం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జీఎస్‌టీ వివాదాల పరిష్కారం కోసం జీఎస్‌టీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆర్థిక మంత్రి ప్రకటించ వచ్చని అంచనావేస్తున్నారు.