Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉత్తమ్‌కు దారెటు… ఎంపీకా…ఎమ్మెల్యేకా..!

– ఈ ఏడాది చివరిలోనే ముందస్తు ఖాయం అంటున్న ఉత్తమ్‌…
అయితే ముందస్తు(2023)కు ఎంపీకి రాజీనామా చేస్తారా..
ఎమ్మేల్యేకు పోటీ చేయడానికి అధిష్టానం ఒప్పుకుంటుందా…
ఎమ్మేల్యేగా ఓడిపోతే బై ఎలక్షన్‌లో తిరిగి ఎంపీకి పోటీ చేస్తారా..
– గత 3 ఎన్నికల్లో 6 సార్లు టికెట్లు పొందిన ఉత్తమ్‌ కుటుంబం…
– ఈ సారి అలా వీలవుతుందా..
– రాష్ట్రంలో  7 గురు ఎంపీలకు ముందస్తు గుబులు.
– వచ్చే బై ఎలక్షన్‌ లో తిరిగి ఎంపీ సీట్లను నిలబెడతారా…
– హుజూర్‌నగర్‌ బై ఎలక్షన్‌ ఓటమితో ఉత్తమ్‌ కుటుంబం చరిష్మా దిగజారిందా..
– ఉత్తమ్‌ అనుచరులకు రాష్ట్ర పదవుల్లో గుర్తింపు కరువు నిజమేనా…

 

హుజూర్‌నగర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సుదీర్ఘ కాలం రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి సీఎం రేస్‌ లో ఉన్న నాయకుడు.

గతంలో రాష్ట్రపతి భవన్లో పనిచేసిన పరిచయాలు, రాష్ట్రమంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు,పార్టీ నేతలతో సంబందాలు మెండుగా ఉన్న నేత. గత 2014, 2018, 2019 ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో భార్యభర్తలు ఇద్దరు 3 స్థానాలకు, ఆరుసార్లు టికెట్‌ పొందిన ఘనత.

అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న మాజీ పీసీసీ చీఫ్‌, ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌ 2019 బై ఎలెక్షన్‌ ఓటమి అనంతరం తన చరిష్మా ఒక్కసారిగా కుదేలయిందా…దానితో పాటు ఉన్న పిసిసి అధ్యక్ష పదవిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారా.. అంటే అవుననే విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

అగ్ని పరీక్షగా మారనున్న రాబోయే ఎన్నికలు…
రానున్న 2023 అసెంబ్లీ, 2024 ఎంపీ ఎలక్షన్లు ఉత్తమ్‌ కు అగ్నిపరీక్షగా మారనున్నాయి. గత రెండు ఎన్నికల్లో కీలక పదవుల్లో ఉండి తాను, తన భార్యకు ఎమ్మెల్యే టికెట్‌, మరల ఎంపీ టికెట్‌, ఉప ఎన్నికల్లో సైతం భార్యకు ఎమ్మెల్యే టికెట్‌ తీసుకొని పోటీ చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని ఘంటాపథంగా చెప్తున్న నల్లగొండ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్‌ రెడ్డి, తాను హుజూర్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించుకుంటూ హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల, బిజెపి నేతల తీరును ఎండ గట్టేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో గెలుపు బవుటా ఎగురవేసి మళ్లీ తన సత్తా చాటుకోవాలని తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. అయితే రానున్న ముందస్తు ఎన్నికల గండంను ఉత్తమ్‌ ఏ విధంగా ఎదుర్కొంటారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌ కు కాంగ్రెస్‌ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌కు పోటీ చేయమంటుందా……ౖ కోదాడ లో మళ్లీ తన భార్యకు ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకునే సత్తా ఉత్తమ్‌ కు ఉన్నదా అనే అంశంపై సర్వత్రా చర్చ నెలకొంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థానంపై, గెలుపు ఓటముల అంశంపై హుజూర్‌నగర్‌ కోదాడ నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి

రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఇటీవలనే ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఓటమి అనంతరం టిఆర్‌ఎస్‌ పార్టీ సైతం వీలైనంత తొందరగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోమారు అధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తుందని పలుపార్టీల నేతలు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ చీఫ్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు వస్తాయని ముక్త కంఠంతో చెబుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ముందస్తు లేదు ..వెనకస్తూ లేదు అని చెబుతూనే ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రకటించి పార్టీని సంస్థాగతంగా బలపరచుకుంటుంది. మరోమారు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని రకాల పథకాలను సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తుంది. కాంగ్రెస్‌, బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రస్తుతం ఆ పార్టీలకు చెందిన ఎంపీలు వ్యవహరిస్తున్నారు. ఆ ఎంపీలు సైతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఎంపీలకు ముందస్తు ఎన్నికల గండం
తెలంగాణ బిజెపి, కాంగ్రెస్‌ ఎంపీలకు రాష్ట్రంలో అసెంబ్లీ ముందస్తు ఎన్నికల గండం పట్టుకుంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుండి ఎంపీలు గా ఉన్న బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌.. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిజాంబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఆర్మూర్‌ నియోజకవర్గంపై అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ప్రకటించాడు. రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఉత్తమ్‌, కోమటిరెడ్లు సైతం తన నియోజక వర్గాల్లో విస్తృత పర్యటనలు చేసుకుంటున్నారు.

అయితే దేశంలో పార్లమెంట్‌ ఎన్నికలు 2024 మే లో రానున్నాయి. రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లోనే వస్తే ఇబ్బందులు తప్పవన్న గుబులు ఎంపీల్లో మొదలైంది. ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎంపీలుగా ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటది.

అనంతరం ఆరు నెలల్లో వచ్చే ఎంపీ బై ఎలక్షన్లు మరల కొద్దికాలానికి రానున్న 2024 పార్లమెంట్‌ ఎంపీ ఎన్నికలను ఎదుర్కోవాలన్న అంశం ఎంపీలకు తీవ్ర కలవరం సృష్టిస్తుందట. ముందస్తు ఎన్నికలు, అనంతరం ఎంపీ బై ఎలక్షన్‌, అనంతరం ఎంపీ రెగ్యులర్‌ 2024 ఎన్నికలు ఎదుర్కోవడం మరియు టికెట్లు పొందటం పోటిచెయ్యడం ఎన్నికల ఖర్చు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

అదే కాకుండా ముందస్తు ఎన్నికల్లో గెలుపు ఓటములు వల్ల వచ్చే ప్రభావం, తదనంతరం రాజకీయ భవిష్యత్తు పై ఎంపీలకు గుబులు పట్టుకుంది. బిజెపి, టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలకు ముందస్తు ఎన్నికల సీట్ల లొల్లి అంతగా ప్రభావం లేనప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలపై ముఖ్యంగా పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న చర్చ వినిపిస్తుంది.

రేవంత్‌రెడ్ది గత 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి, మరల ఎంపీగా టికెట్‌ పొంది, ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరిగి అసెంబ్లీ వైపు అడుగులు వేస్తే ఎదురయ్యే సమస్యలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక గతంలో పీసీసీ చీఫ్‌ గా ఉండి ఎమ్మెల్యేగా, ఎంపీగా భార్యాభర్తలిద్దరూ టికెట్లు పొందిన ఉత్తమ్‌ కుటుంబం రానున్న ఎన్నికల్లో ఎంపీగా, ఎమ్మెల్యేలుగా టికెట్‌ పొందే అవకాశం ఉందా… పోటీ చేసి గెలుస్తారా లేక ఓడుతారా అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎంపీ ఉత్తమ్‌ దారెటు…
ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పై తీవ్ర చర్చ నడుస్తుంది. ప్రస్తుతం నల్గొండ ఎంపీ గా ఉన్న ఉత్తమ్‌ రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక ఎంపీ గానే కొనసాగుతారా అన్న చర్చ కొనసాగుతుంది.

2018 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఉత్తమ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో అనంతరం 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ స్థానం నుండి పోటీ చేస్తానంటున్న ఉత్తమ్‌ కోదాడ లో ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై స్పష్టతను ఇవ్వాల్సి ఉంది.

ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ నుండి పోటీచేస్తే నల్లగొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే సిట్టింగ్‌ స్థానాన్ని చేజారకుండా చూసుకునే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి ఉందా అన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తమ్‌ అడుగులు అసెంబ్లీ వైపు పడితే నల్లగొండ ఎంపీ స్థానానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ మరల హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్‌ పోటీచేసి ఓడిపోతే ఆయన మళ్ళీ పార్లమెంట్‌ వైపు వెళ్లే అవకాశం కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందా లేదా అనే అంశంపై పలు భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి తన సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మరల తన సతీమణి పద్మావతిని నిలబెట్టిన విషయం తెలిసిందే. అయితే బై ఎలక్షన్‌ లో ఉత్తమ్‌ సతీమణి ఘోరపరాజయం చవిచూశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పట్టున్న నియోజకవర్గంగా పేరు గాంచి, పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్‌ సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌ ఓటమి ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

హుజూర్నగర్‌ ఉప ఎన్నిక ఓటమి కాంగ్రెస్‌ పార్టీ తో పాటు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తును సైతం ఓ కుదుపు కుదిపేసింది. బై ఎలక్షన్‌ సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ సీటును తన భార్యకే తీసుకోవడం, ఇతరులకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా సీటు కేటాయింపునకు సంబంధించిన అన్ని నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకోవడం అప్పట్లో పలు విమర్శలకు తావిచ్చింది. పిసిసి అధ్యక్షుని హోదాలో తీసుకున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో ఉత్తమ్‌ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న రేవంత్‌ రెడ్డి ఉత్తమ్‌ తన సతీమణి మూడు సార్లు వరుసగా టికెట్‌ కట్టబెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో, దేశంలో కీలక పదవులను పొందిన ఉత్తమ్‌ తన సొంత హుజూర్నగర్‌, కోదాడ నియోజకవర్గంలో అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదని, నమ్ముకున్న వారికి సైతం పదవులు ఇప్పించుకోవడంలో అశ్రద్ధ ప్రదర్శించాడన్న విమర్శలు ఉన్నాయి. ఉత్తమ్‌ రాజకీయ వారసుడిగా పేరుపొందిన తమ్ముడు కౌశిక్‌ రెడ్డి హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ లోకి వెళ్లడం వెనుక ఉత్తమ్‌ పాత్ర ఉందన్న ఆరోపణలు సొంత కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నుండి వినిపించాయి.

గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్న ఉత్తమ్‌ కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలను తన చేతిలో ఉంచుకున్నాడు. కోదాడ హుజూర్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓటమి అనంతరం నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తుందా లేదా అన్న అంశంపై తీవ్ర చర్చ నడుస్తుంది. గతంలో మాదిరి కోదాడ హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానాలతో పాటు నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో సైతం తాను టికెట్‌ పొందగలడా లేదా తన అనుచర వర్గానికి టికెట్‌ ఇప్పింపుకుంటాడా అనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. పలువురు నేతలు మాత్రం ఇప్పటికే హుజూర్‌నగర్‌, కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ల టికెట్‌ కోసం పావులు కదుపుతున్నారు.

అటు అధ్యక్ష రేవంత్‌ రెడ్డిని ఇటు ఉత్తంకుమార్‌ రెడ్డి ని పావనం చేసుకునే పనిలో పడ్డారు. ఉత్తమ్‌ కుటుంబానికి హుజూర్‌నగర్‌ , కోదాడ అసెంబ్లీ స్థానాల నుండి రానున్న ఎన్నికల్లో నిరాశ తప్పదని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టికెట్‌ కోసం పలువురు కాంగ్రెస్‌ ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఉత్తమ్‌ కోదాడ స్థానంలో పోటీకి మరోనేతకు టికెట్‌ ఇవ్వడానికి మాట ఇచ్చారని కోదాడ స్థానాన్ని వదిలేసి హుజూర్‌నగర్‌ లో మాత్రం మరల ఉత్తమే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

అందుకు అనుగుణంగా కింది స్థాయిలో కేడర్ను ఉత్తం సమాయత్తం చేస్తున్నారు. నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారా.. కాంగ్రెస్‌ పార్టీ మరలా టికెట్‌ కేటాయిస్తుందా….నల్లగొండ ఎంపీ సిట్టింగ్‌ స్థానాన్నీ కాంగ్రెస్‌ పార్టీ చేజారకుండా చూసుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. కాంగ్రెస్‌ పార్టీ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భవిష్యత్‌ ఎటు వైపు అడుగులు పడుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు వేచిచూడక తప్పదుమరి.