Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సాయుధ పోరాటం, పులిచింతల పోరాటాలు ఇక్కడినుండే

నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు , మఠంపల్లి మండలంలో గల గలా ప్రవహిస్తున్న కృష్ణా నది తీర ప్రాంతం ఉద్యమాలకు ఊపిరిలూదింది . భూమి కోసం , బుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం మహోజ్వలంగా సాగిన తెలంగాణ సాయుద పోరాటంలో సముచిత పాత్ర పోచించింది .

లేవి , వెట్టి చాకిరిలకు వ్యతిరేకంగ మండలంలోని చింతల పాలెంలో ( మల్లారెడ్డి గూడెం ) నైజాం ముష్కరులు తూటాలకు ఎదురొడ్డి అమరులైన చారిత్రక నేపద్యం …… ఈ రెండు మండలాల్లో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వెలసిన సిమెంటు పరిశ్రమల నుంచి వెలుబడిన దుమ్ము , దూళితో సిరులు పండుతున్న వేలాది ఎకరాల వ్యవసాయ భూముల బుగ్గిపాలవుతున్న నేపధ్యంలో కృష్ణా ప్రాంత పోరాట సమితి పేరుతో తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆందోళనలు , నిరసనలు చేపట్టిన తీరు ఇక్కడి ప్రజల దిక్కార స్వరాన్ని స్పష్టీకరిస్తుంది . దీంతో పాటు సీమాంధ్ర జిల్లాల ప్రయోజనం కోసం అప్పటి ఎంపి , ఇంజనీర్ కెఎల్ రావు కుట్రతో మేళ్లచెర్వు మండలంలోని 14 గ్రామాలను ముంచి వేసే పులిచింతల ప్రాజెక్టుకు నిరసనగ జరిగిన ఉద్యమం మహోన్నతమైనది . దివంగత ముఖ్య మంత్రి ఎన్టీఆర్ తన జీవిత చరిత్రలో మడమ తిప్పి ప్రాజెక్టు శంకుస్థాపన సభను అర్ధాంతరంగ ముగించుకొని పలాయనం చిత్తగించిన సంఘటనకు ఇక్కడి ప్రజల ఉద్యమ స్పూర్తియే కారణ భూతం . ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాల వైనాన్ని ఒక్కొక్కటిగ పరిశీలిద్దాం .

సీమాంధ్ర పాలకుల కుట్రను బగ్నం చేసిన దీరోదాత్త ఉద్యమం…

పులిచింతల వ్యతిరేక ఉద్యమంలో ఎన్టీఆర్ మడమతిప్పి ఉడాయించిన చారిత్రక సంఘటన

మేళ్ల చెర్వు , మఠంపల్లి మండలాల్లోని నెల కొని ఉన్న సిమెంటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న దూళి వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతున్న పరిస్థితి , పత్తి , మిర్చితో సాలుసరి లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్న ఇక్కడి అన్నదాతలు తమ పంటలపై దూళి కమ్మి దిగుబడి రాక పోవడంతో పాటు పొగ గొట్టాలనుండి వెలువడే కాలుష్యం ప్రజల ఊపిరి తిత్తుల్లో జోరబడి కాటికి కాళ్లీడుస్తున్న దుస్థితి అనాటిది . నియంత్రణ యంత్రాలతో కాలుష్యాన్ని నిలువరించాలని ఆర్జీలు పెట్టుకున్నప్పటికీ చెవి సోకని దుస్థితిలో కోదాడ కెఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రగతిశీల బావాలు పుణికి పుచ్చుకున్న మేళ్లచెరువు మండలం తమ్మవరం గ్రామ వాసి గడ్డం విద్యాసాగర్రెడ్డి 1988 లో కృష్ణ తీర ప్రాంత పోరాట సమితి పేరుతో యువకులను సమకూర్చుకొని పరిశ్రమల ఆగడాలపై ఆందోళనలు శురూ చేశారు . నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేసుకొని కాలుష్యాన్ని నివారించాలని , స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తు పరిశ్రమల యాజమాన్యానికి వినతులు సమర్పించడంతో పాటు పలు దఫాలుగ ప్రజలతో కలిసి నిరసనలు చేపట్టాడు . ఈ ఆందోళనలకు తీర ప్రాంత ప్రజలతో పాటు మండల వ్యాప్తంగా ప్రజలనుంచి సంపూర్ణ మద్దతు లభించింది . ఈ కాలంలోనే పౌరహక్కుల సంఘం నాయకులు , పర్యావరణ వేత్తలు బాలగోపాల్ , ప్రొఫెసర్ హరగోపాల్ , శివాజిరావు , పురుషోత్తంరెడ్డితో పాటు మరెందరో మేదావులు ఈ ప్రాంతంలో పర్యటించి కాలుష్యాన్ని నివారించి , స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పరిశ్రమల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు . ఈ పరిణామంలో కాలుష్య నియంత్రణ యంత్రాలను పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో కొంత మేరకు విజయం సాదించినట్టయింది . ఇదిలా ఉండగ కృష్ణా గుంటూరు , ప్రకాశం , పచ్చిమ గోదావరి జిల్లాలోని లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు మేళ్లచెర్వు మండలంలోని పులిచింతల లో ప్రాజెక్టు ను ఏర్పాటు చేసేందుకు అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి ఆంధ్ర ఎంపి, ఇంజనీరు , కేఎల్  రావు పులిచింతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు . ఈ ప్రాజెక్టుల మండలంలోని 14 గ్రామాలు మునకకు గురి కావడమే కాక వృత్తి దారులు కూడ ఇక్కడ నుంచి వలస వెళ్లాల్సిన దుస్థితి . సిరులు పండుతున్న భూములను రైతులు వదిలి వెళ్లాల్సిన నేపధ్యంలో కృష్ణా పోరాట సమితి పులిచింతల వ్యతిరేకంగ ఉద్యమంగ రూపాతరం చెందింది . ఆ కాలంలోనే తెలంగాణ ఇన్ఫర్మేషన్ పేరుతో సీమాంధ్ర పాలకులు తెలంగాణకు చేస్తున్న వివక్షతపై ప్రొఫెసర్లు వినాయకరెడ్డి రామిరెడ్డిలు పులిచింతల ఉద్యమానికి మద్దతు పలికారు . ఉద్యమ నేత విద్యాసాగర్ రెడ్డి నేతృత్వంలో పార్టీలకు అతీతంగ నాయకులతో పాటు ప్రజలు పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకిస్తు ఆందోళనలు చేపట్టారు . ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో పాటు రైతు కూలీ సంఘం నాయకులు వికె తో పాటు ఇప్పటి నియోజకవర్గ చైర్మన్ రాయపూడి చిన్నితో పాటు పలువురు ప్రగతి శీల వాదులు ఉద్యమానికి మద్దతునిచ్చి చేయూతనిచ్చారు .

ప్రాజెక్టు శంకుస్థాపనకు తేది ఖరారు , వ్యతిరేకిస్తు ఊరూర ప్రచారం …

నవంబర్ 19 న ( 1938 ) పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన తేదిని అప్పటి టిడిపి ప్రభుత్వం ఖరారు చేసింది . పులించింతల వ్యతిరేక ఉద్యమ నాయకులు ఊరూర తిరగుతూ ప్రాజెక్టునిర్మాణం వల్ల జరిగే అన్యాయాన్ని కూలంకశంగా వివరించి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో నిర్మాణం చేపట్టనీయ వద్దని శంకుస్థాపనను అడ్డుకునేందుకు సమాయత్తం కావాలని నెల రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించారు . దీంతో ప్రజలు ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు . ఈ పరిస్థితిలో టిడిపి ప్రభుత్వం నుంచి ఎంపిపిగ గెలిచిన పింకళి వెంకటేశ్వరరెడ్డి తన పార్టీ నిర్ణయాన్ని కాదని ప్రజల అభిప్రాయం మేరకు ఉద్యమంలోపాల్గొన్నారు . ఇదిలా ఉండగా అప్పటి కాంగ్రేస్ ఆగ్ర నేతలు చకిలం శ్రీనివాసరావు , పురుషోత్తంరెడ్డి , మోహన్రెడ్డి , వీరేపల్లి లక్ష్మినారాయణ , చింత చంద్రారెడ్డిలు శంకుస్థాపనను వ్యతిరేకిస్తు నిరసన చేపట్టేందుకు ముందుక రాగా మీ పార్టీ జెండాలు పక్కన పెట్టి మద్దతివ్వాలని ఉద్యమనాయకులు డిమాండ్ చేయడంతో వీరేపల్లి లక్ష్మినారాయణ చింతచంద్రయ్యలు మాత్రమే శంకుస్థాపన రోజు జెండాలు పక్కన పెట్టి నిరసనలో పాల్గొన్నారు .

మడమతిప్పి ఉడాయించిన నందమూరి ఎన్టీఆర్ …

ఇక సమయం రానే వచ్చింది మండలంలోని వజినేపల్లి , నెమలిపురి శివారు ప్రాంతంలో ప్రాజెక్టు శంకుస్థాపనకు హెలికాప్టర్పై ముఖ్యమంత్రి దిగారు . ముంపు ప్రజల నిరసన పెల్లుబుకింది . సభలో ఎన్టీఆర్ ప్రసంగానికి ఆందోళన కారు నినాదాలతో అంతరాయం కలిగింది . పోలీసులు లాఠీలు జులుపించారు . నల్లబ్యాడ్జీలు దరించి నల్లజెండాలు చేతపట్టుకొనా వేలాది మంది ప్రజలు వజినేపల్లికి చేరుకోగ అక్కడ వారిని పోలీసులు నిలిపేశారు . రెండు గంటల అనంతరం అడ్డుతొలగడంతో ఉద్యమకారులు శంకుస్థాన స్థలానికి చేరుకొని సభలో ప్రసంగిస్తున్న పార్లమెంటు సభ్యుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి ప్రసంగానికి అడ్డుతగిలారు . విసిగి పోయిన ముఖ్యమంతి ఎన్టీఆర్ ఎంపి ప్రసంగం పూర్తి కాకుండానే తన ప్రసంగాని మొదలు పెట్టారు . ఈ తెలుగు బిడ్డ ఎవరికి బయపడడు మడమ తిప్పి వెనుదిరిగేది లేదంటు ప్రసంగిస్తుండగానే ఆందోళన కారులు మరింత రెచ్చి పోయారు . ఈ పరిస్థితిలో పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా  వారు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు . ఇక చేసేదేమి లేక ఎన్టీఆర్ సమావేశాన్ని మద్యలోనే ముగించి హెలికాప్టర్లో వెళ్లి పోయారు .

ఉద్యమానికి మద్దతిచ్చిన మేదావులు ….

ఉద్యమానికి మద్దతిచ్చిన మేదావులు …. కొనసాగుతున్న పులించితల వ్యతిరేక ఉద్యమంలో బాగంగా  మండల కేంద్రమైన మేళ్లచెర్వులో తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ , ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మేదావులు దర్నా నిర్వహించారు . ఈ దర్నాలో వక్కవంతుల విజయ్ కుమార్ , జలవనరుల నిపుణులు విద్యాసాగర్రావు , తెలంగాణ మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు , రాయపూడిచిన్ని , జ్వాల , జివితో లు పాల్గొన్నారు . కాగ ఇంద్రారెడ్డి ఉద్యమానికి సంఘీబావంగ మండలంలో పర్యటించారు . పులిచింతల ప్రాజెక్టు వ్యతిరేకిస్తు పీపుల్స్ వార్ దశనాయకులు శంకుస్థాపన స్థూపాన్ని పేల్చివేశారు .

నైజాం వ్యతిరేక పోరాటంలో చారిత్రక సంఘటన …. 

చింతల పాలెంలో నేలకొరిగిన యోదులు …

భూమి , బుక్తి కోసం , పేద ప్రజల విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మండలంలోని చింతల పాలెంకు ( మల్లారెడ్డి గూడెం ) సముచిత స్థానముంది . నైజాం నిరకుంశ పాలన కొనసాగుతున్న రోజులలో ప్రజలు తీవ్ర ఇంబ్బందులు ఎదుర్కొన్నారు . పాలకులు ప్రజలను కట్టు బానిసలుగ చూస్తు పన్నుల కోసం పీడిస్తున్న రోజులవి ఆ పరిణామంలో ప్రజలను చైతన్యం చేసేందుకు కమ్యూనిస్టు నాయకులు దొడ్డనర్సయ్య , చింతలపూడి రాములు , ఇరిగెల లింగయ్య , కోట నారాయణలు గ్రామాలలో పర్యటించి నైజాం నవాబుకు పన్నులు కట్టకుండ పండిన పంటలు పేదలకే దక్కేల పోరాటాలు నిర్వహించారు . గ్రామాలలో బుర్ర కథలు , వీధి నాటకాల ధ్వార ప్రజలను చైతన్య కురిచారు . రజాకారులు గ్రామాలపై దాడి చేసినప్పుడు కళ్లల్లో కారం చల్లి , కర్రలతో దాడి చేయాలని సూచనలు ఇవ్వడంతో పాటు దళాలను తయారు చేశారు .

ఆరోజు ఏం జరిగింది ………..

నైజం ముష్కరులు తుపాకులతో చింతల పాలెంలోని గవిడిని చేరుకున్నారు . విషయం తెలుసుకున్న గ్రామస్తులు కారం , వడిసెలు , చాటలు తీసుకొని వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు . ఈ లోగ నైజాం సైన్యం కుట్రతో ఆయుదాలు ఏమి లేకుండ చర్చలకు రావాలని వర్తమానం పంపారు . ఇందుకు ప్రతిగ నైజాం సైన్యం తుపాకులు వదిలితేనే చర్చలకు సిద్ధమని కమ్యూనిష్టు దళాలు స్పష్టం చేశాయి . తండా గవిడికి వర్తమానం అందజేసిన సైన్యం ఒకే సారి రెండు వైపుల నుంచి దళాలలను చుట్టు ముట్టి విచ్చల విడిగ , విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు . ఈ కాల్పుల్లో గ్రామానికి చెందిన తెలుగువీరమ్మ , నర్సిరెడ్డి , అప్పిరెడ్డి , వీరయ్య తోటి కోడళ్లు పేరుపంగు తిరపతమ్మ , బూషమ్మలు ప్రాణాలు కోల్పోగ అనేక మంది గాయాల పాలయ్యారు . 1943 లో మరో సారి గ్రామంపై రజాకారులు దండెత్తారు . ఎదురు కాల్పుల్లో గ్రామానికచెందిన కందుల గోపిరెడ్డి , చింత్రియాల రామస్వామి అసువులు బాశారు . వారి త్యాగాలకు గుర్తుగ గ్రామంలో స్థూపం ఏర్పాటు చేసి ప్రతి ఏట తెలంగాణ విమోచన దినోత్సవం రోజు నివాళులు అర్పిస్తారు .

తెలంగాణనేఇంటి పేరుగా మార్చుకున్న రామిరెడ్డి …

తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదలైనప్పుడే ఉద్యోగానికి రాజినామా …..

తెలంగాణ చరిత్ర మొదలైనప్పుడే తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు , పదవి త్యాగాలు కూడ మొదలయ్యాయు . అలా 1989 లో తెలంగాణ ఉద్యమంలో తన ఉద్యోగానికి రాజినామా చేసి ‘ తెలంగాణానే ‘ ఇంటి పేరుగా  మార్చుకున్న మహోన్నత వ్యక్తి మఠంపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన గుండా రామిరెడ్డి . సీమాంధ్ర పాలకుల వివక్షతను నిరసిస్తు మహబూబ్ నగర్ జిల్లాలో వాణిజ్య పన్నుల అధికారిగా తన ఉద్యోగానికి రాజీనామ చేసి ‘ తెలంగాణ రామిరెడ్డి ‘ గా స్థిరపడ్డారు . 38 ఏళ్ల వయసులో ఉద్యోగంలో 18 ఏళ్లు సర్వీసు మిగిలి ఉండగానే ఆయన 1953 జనవరి 27 న ఉద్యోగానికి రాజినామ చేశాడు . 1958 లో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపేసిన తరువాత అన్ని శాఖలలోను మార్పులు సంబవించాయి . ప్రభత్వం ఏర్పాటు తరువాత ఆంధ్ర పెత్తనం , వాళ్ల వలసలు ఎలా మొదలయ్యాయే కళ్లారాచూశాడు రామిరెడ్డి తెలంగాణలో ఉన్న సీనియర్ అధికారులను ఆంధ్రకు పంపి అక్కడి జూనియర్లకు పదోన్నతి కల్పించి సిటిఓ లుగ తెలంగాణకు రప్పించడమే కాక ఏసీటిఓలుగ ఉన్న ఆంధ్రోళ్లకు ప్రమోషన్లు ఇచ్చి తెలంగాణకు రప్పించారు . దీంతో పాటు ఆంధ్ర వారికి గెజిటెడ్ సిటిఓ అని కొత్త హోదాను తెచ్చి పెట్టారు . తెలంగాణలోని సీనియర్ అధికారులకు సమాన స్థాయిలో ఆంధ్రలోని జూనియర్లకు జీతాలు ఇచ్చేవారు . ఈ పరిణామాలన్ని స్వయంగా గమనించిన ఆయన విదానాలతో పోరాటం చేయాలనుకున్నాడు . కాని పెత్తనమంత వాళ్లది , అధికారాలు , పదవులు వాళ్ల చేతుల్లోనే ఉండడంతో మనస్తాపం చెంది తన ఉద్యోగానికి రాజినామ చేశాడు . నిజానికి రామిరెడ్డి అధికారుల దగ్గర పరపతి కలిగిన వ్యక్తి . ఆయన తలుచుకుంటే తన జీతం , ప్రమోషన్ తెచ్చుకోవడం చిటికెలో పని . అయితే ఆంధ్రోళ్ల దగ్గర చేయి చాచడం ఆయనకు ఇష్టం లేదు . అప్పటి డిప్యూటీ సిఎం కెవి రంగారెడ్డి ఆయనకు అత్యంత ఆప్తుడు . రామిరెడ్డి ఆయన ఇంట్లోనే ఉండే వాడు . ఉద్యోగానికి రాజీనామ చేయవద్దని వారించినా సీమాంధ్ర పాలకు వివక్షను భరించడం కన్నా ఉద్యోగాన్ని వదిలేయడం మంచిదని చెప్పేవాడు . ఆ తరువాత తన రాజీనామాను ప్రభుత్వం అంగీకరించ కుండ ప్రమోషన్ ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పటికి ఉద్యోగంలో చేరక పోవడం గమనార్హం . దీంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు గౌరవ మర్యాదలు పెరిగాయి . 1965 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్లగొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగ ఎమ్మెల్సిగ పోటీ చేసి గెలిచారు . జనసంగ్ , కమ్యూనిస్టు పార్టీలోని వారంత రామిరెడ్డికి మద్దతిచ్చారు . ఆరు సంవత్సరాల పాటు రాజి లేకుండ శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగ వినిపించారు . ఎమ్మెల్సిగా ఉన్న క్రమంలో వివిధ పార్టీల నుంచి ఆహ్వనాలు అందినప్పటికీ ఆయన ఏపార్టీలో చేరక పోవడం విశేషం . కాగ తెలంగాణ రాష్ట్రం వచ్చె అవకాశం లేదని తన మిత్రులు , బందువులు వాదులాడిన క్రమంలో తెలంగాణ ఎప్పటికైన వస్తుంది రాష్ట్రాన్ని చూసిన తరువాతే నేను కన్ను . మూస్తానని స్పష్టం చేయడం ఆయన ఆత్మవిశ్వాసానికి సాక్షిభూతమని చెప్ప వచ్చు .

ఆర్ధిక పురస్కారం తెలంగాణ ప్రజలిచ్చిన గౌరవంగా భావిస్తున్న…

ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడడం నా జీవితాశయం . నా త్యాగం వమ్ము కానందుకు నాదైవం మట్టపల్లి లక్ష్మినర్సింహస్వామిని దర్శించుకొని కృతజ్ఞతలు తెలిపాను . జీవం లేని తెలంగాణ ప్రజల గుండెల్లో జీవం పోసి కల గానే మిగిలి పోతుందా అన్న తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసేందుకు ఒక మహాఉద్యామాన్ని దశాబ్దంపైగ నడిపి రాష్ట్రాన్ని సాధించినందుకు మీకు మనసార అభినందనలు అని ముఖ్యంత్రి కేసీఆర్కు తెలంగాణ రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . ముఖ్యమంత్రి కేసిఆర్ 10 లక్షల రూపాయలతో తెలంగాణ రామిరెడ్డిని సన్మానించారు . ఈ సన్మానం తెలంగాణ ప్రజలు తనకిచ్చిన సన్మానంగా రామిరెడ్డి అభివర్ణిచాడు.

ఆనాడే సీమాంధ్ర కుట్రలపై ఉద్యమించాం ….

గడ్డం విద్యాసాగర్రెడ్డి ( పులిచింతల వ్యతిరేక ఉద్యమ నాయకులు ) సీమాంధ్రాలోని నాలుగు జిల్లాల ప్రయోజనం కోసం మండలంలోని 14 గ్రామాలను ముంచి వేస్తు అప్పటి టిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంత వ్యతిరేకించారు . అందుకే ఆనాడే సీమాంధ్ర కుట్రపై ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని చేపట్టాం . పార్టీలకు అతీతంగా వేలాది మంది ప్రాజెక్టు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎన్టీఆర్ను ప్రసంగం మద్యలోనే నిలిపి వేసి ఉడాయింప చేయడం ఇక్కడి ప్రజల ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం .

లేవి , వెటి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం …

ఉస్తెల వీరారెడ్డి , మాజీ సర్పంచ్ సీపీఐ నేత మాల్లారెడ్డి గూడెం

సాయుద పోరాటం జరిగేటప్పుడు నా వయసు 13 సంవత్సరాలు . నైజాం పాలనకు వ్యతిరేకంగ కమ్యూనిస్టు నాయకులు గ్రామంలో పర్యటించి ప్రజలను చైతన్య పరిచేవారు . లేవి , వెట్టి చాకిరికి వ్యతిరేకంగ 194 జరిగిన సాయుధ పోరాటంలో అరుగురు , 1948 లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయ్యారు . అమరువీరుల స్మారకార్ధం గ్రామంలో స్థూపం నిర్మించి ప్రతి ఏట తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఘనంగ నిశాళులు అర్పిస్తున్నాం ..

 

 అక్రమంగ సాగర్ నుంచి కృష్ణా డెల్లాకు నీటి తరలింపుపై కేసిఆర్ పాదయాత్ర ఇక్కడి నుంచే

సీమాంధ్ర పాలకులు నీళ్లు , నిధులు , నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి దోఖా చేస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమ నేత , తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించారు . 2001 లో తెరాసను స్థాపించి తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా  విస్తృతంగా తిరుగుతూ ఆంధ్ర వలస పాలకులు మాయ మాటాలతో ఎడమ కాల్వకు విడుదల కావలసిని నీటిని కృష్ణా డెల్టాకు ఆక్రమంగ తరలించుక పోతున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లు స్పష్టీకరించారు . ఇందులో భాగంగానే 2003 ఆగష్టు 25 న ఆరు రోజుల పాటు తెలంగాణ , ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కోదాడ నుంచి హాలియ వరకు 100 కిలో మీటర్ల మేర పాద యాత్ర చేసేందుకు సమాయత్తమయ్యారు . 25 న కోదాడ లో ప్రధాన రహదారిపై నెలకొన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు . ఈ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది . అప్పటి తెరాస విభజన విభాగం కార్యదర్శి పగడాల రామచంద్రారెడ్డి , తెరాస నియోజకవర్గ ఇంచార్జి వక్కవంతుల విజయ్ కుమార్ , యల్లావుల వెంకటయ్యతో పాటు 3000 మందికి పైగ తెరాస శ్రేణులు తెలంగాణ వాదులు ఆయనకు ఘనస్వాగతం పలికారు . ఈ సందర్భంగా తన తెలంగాణ రదంపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నీటి వాటాలో ఆంధ్రవలస పాలకుల వివక్షతను తీవ్ర స్థాయిలో విమర్శించారు . అక్రమంగా తెలంగాణ ప్రాంతానికి ఉండాల్సిన నీటిని సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తరలించుక పోతున్నారని ద్వజమెత్తారు . కృష్ణా జలాలలో న్యాయమైన వాటపై చర్చలకు రావాలని ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు . జిల్లా టిడిపి నాయకులు ఆంధ్ర పాలకులకు మోకరిళ్లి ఊడిగం చేస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించి దమ్ముంటే పాదయాత్రలోకి రావాలని ఎవరికి పూలదండలు వేస్తారో , ఎవరికి చెప్పుల దండలు వేస్తారో స్పష్టమవుతుందన్నారు . ఈ పాద యాత్ర చిలుకూరు , హుజూర్ నగర్ , నేరేడు చర్ల , మిర్యాలగూడెం మీదుగ , త్రిపురవరం , హాలియ వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ బారి బహిరంగ సభలో ప్రసంగించారు . ఆయనతోపాటు అప్పటి పొలిట్ బ్యూరో సభ్యుడు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి , కర్నె ప్రభాకర్ ,  కేంద్ర జన వనరుల మాజి సభ్యులు విద్యాసాగర్ రావు కళ్లెం యాదగిరిరెడ్డి తిప్పన విజయసింహారెడ్డితో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు .

తెలంగాణ ఉద్యమంతో కృష్ణా నది పరివాహక ప్రాంతం అనుబందం

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షతో కృష్ణా నది తీర పరివాహక ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది . కోదాడ హుజూర్ నగర్ , మిర్యాలగూడ , నాగార్జున సాగర్ , దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగ 23 మండలాల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది . 1989 లో తొలి తెలంగాణ ఉద్యమం లో కోదాడకు సముచిత పాత్ర ఉంది . తొలి తెలంగాణ ఉద్యమంలో కోదాడ ప్రాంతంలోనే రత్నవరం గ్రామానికి చెందిన కీసర జితేందర్రెడ్డి కీలక భూమిక పోషించారు . తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్న ఈయన ఇక్కడి ఉద్యమంలో పాల్గొంటు యువకులకు స్పూర్తి నిచ్చారు . అయితే కోదాడకు కూత వేటు దూరంలో ఉన్న ఆంధ్ర , తెలంగాణ సరిహద్దు నల్లబండ గూడెం వద్ద ఉన్న వంతెన మీదుగ మారణాయుధాలతో లారీలలో బయలు దేరి కోదాడ నుండి మిర్యాలగూడెం వరకు ప్రజలపై దాడి చేసేందుకు కుట్ర పన్నారు . విషయం తెలుసుకున్న కీస జితేందర్ రెడ్డి తన అనుంగు అనుచరులు తాటికొండ బ్రహ్మానందంతో కలిసి తన వాహనంపై సరిహద్దుకు చేరుకున్నాడు . ఎదురుగా  లారీలలో ఆహాకారాలు చేస్తూ ముష్కరులు వంతెన వద్దకు రాగానే కీసర ఆత్మస్థైర్యంతో తిరిగి వెనకకు వెళ్లాలని హెచ్చరించారు . ఆయిన వినక పోవడంతో తన చేతిలో ఉన్న తుపాకితో మొదటి లారి టైర్లు పేల్చి వేయడంతో బయపడిన ఆంధ్ర ముష్కరులు ఈయన వెనుక ఇంక వేలాది మంది ఆందోళన కారులు ఉన్నారని బయపడి వెనుతిరిగారు . తెలంగాణ సాదన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండ ఉద్యమించిన చరిత్ర కీసర జితేందర్రెడ్డిది . దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేసిఆర్ పిలుపు ఇచ్చిన ప్రతి సంఘటనలోను పరివాహక ప్రాంత శ్రేణులు , ఉద్యమ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందించారు . 42 రోజుల పాటు నిర్వహిచిన సకల జనుల సమ్మె విజయవంతం చేయడంలో సఫలీకృతమయ్యారు . జలసాగర దీక్ష , మిలియన్ మార్చ్ తో పాటు ప్రతి ముఖ్యమైన బహిరంగ సభలకు ఈ ప్రాంతం నుంచి వేలాది మంది తరలి తమ ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారు .