ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన సిఎం కేసిఆర్

73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించే ముందు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి జాతికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రగతి భవన్‌కు వెళ్లారు. భారత రాజ్యాంగం ప్రకారం వివిధ సభలకు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం వల్ల ప్రజలే దేశానికి పాలకులని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోందని, సమాఖ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తామన్నారు.