ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

2019 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా మారబోతున్న సంగతి తెలిసిందే. అయితే భౌగోళిక స్థానం దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గం రెండు జిల్లాలుగా విడిపోయే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానుండగా బుధవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
ఇందుకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని, అన్ని హద్దులపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని స్వల్ప మార్పులు, చేర్పులు ఉంటాయని సమాచారం.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రస్తుత జిల్లాలతో పాటు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రక్రియకు అన్ని విధాల సిద్ధమవుతున్నారు.