ఖాళీగా ఉన్న 4,4000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న 4,4000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. టీచర్ల నియామకం జరగకపోవడంతో తెలంగాణలో విద్యావ్యవస్థ కుప్పకూలిందని కరీంనగర్ ఎంపీ పేర్కొన్నారు. దేశంలోనే విద్యా ర్యాంకింగ్‌లో రాష్ట్రం 18వ స్థానంలో నిలిచిందని, ఖాళీ పోస్టుల భర్తీ కోసం 7 లక్షల మంది నిరుద్యోగ యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు నిరాశలో ఉన్నారని, నిరుద్యోగ యువత సంతోషంగా లేరని బండి పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా టెట్ నిర్వహించకపోవడం.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎయిడెడ్ సంస్థల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అన్ని పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.