కోటి ఇస్తే …మీ స్థలాలు మీకే..లేకుంటే.. కష్టం..!

– మణుగూరులో భూదందా
– వివాదాలకు కేంద్రంగా సర్వే నెంబర్ 138
– చిన్న ఎమ్మేల్యే, పత్రికా విలేఖరే సూత్రధారులా ?
– కోటి రూపాయలకు బేరం కుదిరితే ఓకే…?
మణుగూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని మణికంఠనగర్ గ్రామంలో సర్వే నెంబర్ 138 వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.
మణుగూరు సింగరేణి ప్రాంత పరిసర గ్రామాలైన మల్లెపల్లి, యగ్గడి గూడెం, సింగరేణి ప్రభావిత ప్రాంతాల భూనిర్వాసితులలో 40 కుటుంబాలు ఇంటి స్థలాల కోసం గత నాలుగు సంవత్సరాల క్రితం మణుగూరులోని సర్వే నంబరు 138/34/1 లో సుమారు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది.
వారు తాత్కాలికంగా దీనిలో షెడ్లు కూడా నిర్మించుకున్నారు. అయితే అప్పుడు ధరణి వెబ్సైట్ కానీ రైతుబందు కానీ లేకపోవడంతో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తలేదు.
కానీ నాలుగు నెలల క్రితం నుండి పెనుబల్లి రాము అనే వ్యక్తి ఈ స్థలం నాది ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాతుండటం, కాదని ఎదురుతిరిగితే చంపుతానంటూ బెదిరింపులు తీవ్రం చేసినట్లు నిర్వాసితులు తెలుపుతున్నారు.
ఇతనికి స్థానిక ప్రజాప్రతినిధుల అండ ఉండటంతో ఎదురులేకుండా పోయిందని, దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాధిత కుటుంబాలు లబోదిబోమంటున్నాయి.
40 కుటుంబాల వారు కలిసి…
నలభై కుటుంబాల వారు కొన్నది అదే గ్రామానికి చెందిన వాడే అనిత దగ్గర. సర్వే నంబరు 138/34/1 ఖాతా నంబరు 410.
ఇందులో ప్రస్తుత ధరణి రికార్డుల ప్రకారం చూస్తే 3.06 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇందులో నుండి నలభై నిర్వాసిత కుటుంబాలన్నీ కలిసి కుటుంబానికి ఐదు సెంట్ల విస్తీర్ణంతో రెండు ఎకరాల భూమిని కొనడం జరిగింది. .
అయితే ప్రస్తుతం ఆభూమి తనదని అడ్డువస్తున్న పెనుబల్లి రాము అనే వ్యక్తి పేరుతో ధరణి లో ఎలాంటి భూమి రికార్డులు లేవు. సర్వేనంబరు 138/33/1 ఖాతా నంబరు 820 పెనుబల్లి రాము తల్లి అయిన పెనుబల్లి సత్తెమ్మ పేరున 5.38 ఎకరాల విస్తీర్ణం రికార్డులలో నమోదు అయింది. అసలు 138 గట్టు సర్వేనంబరులో మొత్తం విస్తీర్ణం 670 ఎకరాలుగా ప్రస్తుతం రికార్డులలో నమోదైంది.
చిన్న ఎమ్మేల్యే పనేనా ఇదంతా…
స్పష్టంగా సర్వేనంబర్లు వేరుగా కనిపిస్తున్నా పెనుబల్లి రాము ఆ భూమి తనదే అంటూ బెదిరింపులకు దిగటం వెనుక ఆంతర్యం ఏమిటి? నిర్వాసితులు ఇళ్ల నిర్మాణం కోసం కొనుక్కున్న ఇంటి స్థలాలపై దౌర్జన్యానికి దిగడానికి కారణమేంటి అని ఆలోచిస్తే దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.
పెనుబల్లి రాము అనే వ్యక్తి ఓ ప్రముఖ పత్రిక విలేఖరికి నమ్మిన బంటు. దీనికి తోడు స్థానిక అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి వీరిద్దరూ బాగా కావలసినవారు. అందుకే భూసేకరణలో సర్వం కోల్పోయిన కుటుంబాలు నివసించడానికి కొనుక్కున్న ఇంటి స్థలాలపై కూడా నిర్లజ్జగా పేచీలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
చివరకు స్థానిక ఎంఎల్‌ఏ దగ్గరకు కూడా ఈ విషయం వెళ్ళింది. అయినా సదరు కబ్జాకోరు ప్రజాప్రతినిధి అధికార పార్టీవాడు కావడంతో పరిష్కారం కాలేదు. సరికదా రాజీ బేరం మరింత పెరిగింది.
ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన పత్రికా ప్రతినిధి ఇళ్ల స్థలాల జోలికి రాకుండా ఉండడానికి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని రెవెన్యూ అధికారులు…
బాధితులు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై స్పందించేందుకూ వెనుకాడుతున్నారు.
ప్రజాప్రతినిధులు పత్రికా విలేఖరి హస్తం దీనిలో ఉండటంతో వారు తమకెందుకులే అని మిన్నకుంటున్నట్లు నిర్వాసితులు తెలుపుతున్నారు. లేక ఇలాగే ఇబ్బందులు పెడితే రాజీకి వస్తారు. రాజీలో తమ వాటా తమకే వస్తుందన్న ధీమానో అర్ధం కాని అనేది కోటి రూపాయల ప్రశ్నగా మిగిలిపోయింది.
కోటి ఇస్తే మీ భూమి మీకే…
తనది కానీ భూమి తనదే అన్నట్టు ఒకవ్యక్తి బాధితులను బెదిరింపులకు గురిచేయడం అతన్ని ముందుకు నడిపించేందుకు ప్రజాప్రతినిధితో పాటు ఒక పత్రికా విలేఖరి కూడా సహకరించడం స్థానిక ప్రజలందకి తెలిసిన బహిరంగ రహస్యమే. ఇంత అయినా ఇంకా అధికారుల కంటికి కనిపించకపోవడం మాత్రం విడ్డూరం.
మణుగూరు ప్రాంతంలో చిన్న ఎంఎల్‌ఏ గా పేరు సంపాదించిన సదరు కబ్జారాయుడైన ప్రజాప్రతినిధి ఈ సమస్యను తనకు అనుకూలంగా మలచుకునేందుకు సామ దాన భేద దండోపాయాలనూ ప్రయోగిస్తూ తన నీచమైన రాజకీయ దుర్భుద్ధిని చూపిస్తున్నాడు. ఈ బురద అంటిన ఖద్దరు చొక్కా జేబుని ఓ ప్రముఖ పత్రికా కలం అలంకరించింది. సెటిల్మెంటు చేస్తామంటూ బాధితులను కొన్ని నెలలుగా తమ చుట్టూ తిప్పుకున్నారు.
చివరకు కోటి రూపాయాలిస్తే రాజీ చేస్తామంటూ చావుకబురు చల్లగా చెప్పారు. ఇంతటితో ఆగకుండా కోటి రూపాయలు ఇవ్వకుంటే ఆ ఇంటి స్థలాలు ఎప్పటికీ మీకు దక్కనివ్వనని మీ దిక్కున్నచోట చెప్పుకోమని హుకుం జారీ చేసాడు చిన్న సారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు మండిపడుతున్నారు.
వారు బాధితులను కలిసి పరామర్శించారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి బాధితుల పక్షాన పోరాడతామని బాధితులకు న్యాయం జరిగేవరకూ తమ పోరాటం ఆగదని ప్రకటించాయి. అయితే అధికార పక్షం ఆర్డర్ల ముందు అఖిలపక్షం పోరాటం నిలబడుతుందా లేదా అన్నది మళ్ళీ అక్షరాలా ఒక కోటిరూపాయల ప్రశ్న!
విషయం నా దృష్టికి రాలేదు:
నీలవతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్
ఈ భూవివాదం గురించి మణుగూరు తహశీల్దార్ ను ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నీలవతిని వివరణ కోరగా తాను పదిహేను రోజుల క్రితమే మణుగూరు వచ్చానని, ఈ వివాదం గురించి పూర్తివివరాలు తెలియవని అన్నారు. ఇంకా దీనిపై ఫిర్యాదు ఏదీ తమ దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు.
ఇదంతా ఆ పత్రికా విలేఖరే నడిపిస్తున్నాడు…
గుగులోత్ సంధ్య, నిర్వాసితురాలు
రెండు నెలలనుండి రాయబారాలు ఎక్కువయ్యాయి. మేము పేదవాళ్ళము, పెద్దవాళ్ళని ఎదిరించే శక్తి లేక వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాం. మొదట ఎనభై లక్షలు అడిగారు. ఇవ్వలేమని చెప్పడంతో ఇప్పుడు నలభై లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి, ఒక పత్రికా విలేఖరి అతని వెనుకుండి నడిపిస్తున్నారు. అన్నీ తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి మాది. ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా మాకు న్యాయం చేయడంలేదు.
ఇంటి నంబర్లు తీసుకొని పన్నులు కడుతున్నాం…
కమతాల మహేష్, బాధితుడు
నాలుగేళ్ళ కిందట ఇళ్లస్థలాల కోసం అందరం ఒకేచోట ఉండాలని కొనుక్కున్నాం. లోతు పూడ్చడానికి ట్రాక్టర్లతో మట్టి నింపాము. ఇంటి నంబర్లు కూడా తీసుకొని పన్నులు కూడా కడుతున్నాం. కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు, ఒక విలేఖరి ఒక్కటై నోటికొచ్చినంతా అడుగుతున్నారు. ఇది అన్యాయం. ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. రెండునెలల నుండి ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయి.