ఇంటి వద్దకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు

సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద కుటుంబాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా కొడుకులతో సమానంగా ఆడబిడ్డల గౌరవాన్ని పెంచాయని ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.
పట్టణంలోని 13 వార్డులకు చెందిన 86 మంది లబ్ధిదారులకు రూ.86 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి వారి ఇంటి వద్దకే అందజేశారు. చెక్కులను అందజేస్తూ కుటుంబ సభ్యుల బాగోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వార్డు సమస్యలు మరియు ప్రభుత్వ పథకాల గురించి కూడా ఆయన ఆరా తీశారు. కొంతమంది లబ్ధిదారులు తమ ఇంటి వద్ద మంత్రిని చూసి ఆశ్చర్యపోయారు. మంత్రి జగదీశ్‌కు కొందరు మహిళలు మంగళ హారతితో స్వాగతం పలికారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లే మార్గంలో ఆయా వార్డుల్లోని నివాసితులతో మమేకమై వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని పట్టణాభివృద్ధికి వారి నుంచి సలహాలు తీసుకున్నారు. కొంతమంది వృద్ధ మహిళలతో మాట్లాడిన ఆసరా పింఛన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, ఆయా వార్డుల కౌన్సిలర్లు, స్థానిక నాయకులు ఉన్నారు.