Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

“మహా” ఆక్రమణలు

-భూదాన్‌ భూములను ఖాళీ చేయాలని మైహోంకు 2012 లోనే నోటీసులు
– అయినా నిషేధిత భూముల్లో అక్రమ మైనింగ్‌, నిర్మాణాలు
-చెల్లుబాటు కాని కోర్టు ఉత్తర్వులు
– పది సంవత్సరాలవుతున్నా ఈ కేసును పట్టించుకోని ప్రభుత్వం.
– పెద్దల ఆక్రమణలపై చూసీచూడనట్లుగా అధికార యంత్రాంగం
– రైతులపై మాత్రం ఎడాపెడా కేసులు

పేదలకు ఇచ్చిన భూధాన, అసైన్డ్‌ అన్యాయంగా ఆక్రమించుకున్నారని వాటిని వెంటనే ఖాళీ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుండి 2012లో ఆదేశాలు. ఇవి మావేనని, సరైన రికార్డులను చూపుతామని చెప్పి కోర్టు నుండి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కాలం మారింది. తెలంగాణ వచ్చింది. తమ వారే అధికారంలోకి వచ్చారు. ఇంకేముంది. తమను ఆపేవారెవ్వరు. ఎవ్వరూ ఆపలేదు. ఆపితే కేసులను బనాయించారు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. కోర్టులో ఉన్న కేసును తిరగదోడే వారేలేరు. ఇంక అడ్డేముంది. మరి ఆక్రమించిన భూమిని అలాగే వదిలేస్తే ఎలా అని నిర్మాణాలను చేపడుతున్నారు. ధరణి నిషేధిత జాబితాలో ఉన్న సీలింగ్‌, అసైన్డ్‌, భూదాన్‌ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం నేరం. కాని వీరికి నేరం కాదు. ఇదే సర్వేనెంబర్లల్లో కొంత మంది రైతులకు భూములు ఉన్నాయి. ఈ రైతుల భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. వీరికి పాస్‌ పుస్తకాలు, హక్కు పత్రాలు ఉన్నాయి. అయినా ఈ భూముల్లో నిర్మాణాలు చేపడితే ఆ రైతులను దొంగలుగా మార్చి కేసులు పెడుతున్నారు. రెవిన్యూ యంత్రాంగం రైతులను నానా ఇబ్బందులు గురిచేస్తున్నారు. మేళ్లచెరువులో వందల ఎకరాల్లో సిమెంట్‌ పరిశ్రమలు సృష్టించిన వివాదాల కారణంగా తన సొంత భూముల్లో ఎటువంటి హక్కులు, లావాదేవీలు నిర్వహించుకోవడానికి వీలులేక పరాయి వాళ్లలాగా మారిన రైతులు ఇదేమి అన్యాయమని గగ్గోలు పెడుతున్నారు.
వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు…
వివాదాస్పద భూదాన్‌, సీలింగ్‌ భూములను పలువురుకు విక్రయించి చేతులు కాల్చుకున్న పరిశ్రమ యాజమాన్యం ఇక లాభం లేదనుకుని ఇటీవల ఈ భూముల్లో చేపట్టింది. భూదాన్‌ భూములను గడచిన పదేళ్లుగా కబ్జా చేసి అక్రమంగా అనుభవిస్తున్న మైహోం సంస్థ ఎటువంటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతుంది. గత పదేళ్లుగా ఈ భూముల్లో అడవిగా పెరిగిన చెట్లను ఒక్కసారిగా నరికివేసి పూర్తిగా తగలబెట్టి భూమిని చదును చేస్తున్నారు. భూదాన్‌ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దఎత్తున తవ్వకాలు చేసి బోర్లను నిర్మించి నీటిని తోడేస్తున్నారు. విద్యుత్‌ శాఖ అనుమతి లేకుండా విద్యుత్‌ స్తంభాలు, లైన్లను నిర్మించి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఎన్‌ఎస్పీ కాల్వను ధ్వంసం చేసి కాల్వపై అనుమతి లేకుండా బ్రిడ్జిని నిర్మించారు. అడ్డొచ్చిన రైతుల పంట పొలాన్నీ కబ్జా చేశారు. అడ్డుకున్న రైతుపై పోలీస్‌ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించారు. ఈ భూముల్లో రాకపోకలు సాగించేందుకు వంద అడుగుల మేర భారి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక తవ్వకాలు జరిపి మైనింగ్‌ ప్రాంతంలోని సున్నపురాయిని తీసుకొచ్చి రోడ్లను నిర్మిస్తున్నారు. సర్వేనెంబర్‌ 1080లో గల సీలింగ్‌ భూముల్లో పరిశ్రమ యూనిట్‌-4 నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టి అక్కడనుండి పెద్ద ఎత్తున మట్టిని భారీ లారీలతో 1057 సీలింగ్‌, భూదాన్‌ భూముల్లో డంప్‌ చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో ఎన్‌ఎస్పీ కాల్వకు ఆనుకొని నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో ఎన్‌ఎస్పీ కాల్వపై పొలాలకు వెళ్లే దారి ధ్వంసం అయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. భూదాన్‌ సీలింగ్‌ భూముల్లో ఎటువంటి అనుమతి లేకుండా పదుల సంఖ్యలో షెడ్లను నిర్మించారు. ఈ షెడ్లలో పెద్దఎత్తున బీహార్‌ వాసులను ఇక్కడికి తీసుకొచ్చి కనీస కోవిడ్‌-19 ప్రమాణాలు పాటించకుండా ఒక్కో షెడ్‌ లో వందల మందిని మగ్గపెడుతున్నారు. షెడ్లలో నివాసం ఉండే బీహారీలు మద్యం సేవించి మద్యం సీసాలను పొలాల్లో పడటమే కాకుండా నానా హంగామా చేస్తున్నారు. చుట్టుపక్కల పంటపొలాల్లో మలమూత్ర విసర్జన చేస్తున్నారు. వంట కోసం చెట్లను నరికి పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు.ఈ భూముల్లో పెద్ద ఎత్తున మిషనరీ తీసుకొచ్చి నిర్మాణం చేపడుతున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా ప్రభుత్వ, భూదాన్‌,సీలింగ్‌ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మిన్నుకుంటున్నారు.

భూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మేళ్లచెరువు రెవిన్యూ

మేళ్లచెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 1057, 874, 876, 895, 1080, 1086, 1140 లో గల సుమారు 3వేల ఎకరాల భూములు వివాదాస్పదంగా మారాయి. దీంతో పాటు పలు సర్వేనెంబర్లల్లో ఉన్న ఎన్‌ఎస్పి, దేవాదాయ, భూదాన్‌, సీలింగ్‌, అసైన్డ్‌, ప్రభుత్వ భూములను గుర్తించలేక ఇదే సర్వేనెంబర్‌ లో ఉన్న పట్టా భూములను వివాదాస్పదంగా మార్చారు. ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో చేర్చడంతో అన్ని హక్కు పత్రాలు కలిగి ఉండి కూడా పట్టా రైతులు నిషేధ జాబితాలో నెట్టి వేయబడ్డారు. వివాదాలను సృష్టించి పరిశ్రమలు రైతుల నుండి భూములు లాక్కున్నాయి. మిగిలిన భూములు సైతం లావాదేవీలు నిర్వహించకుండా పలురకాల వివాదాలను సృష్టించారు. దీంతో ఏళ్ల తరబడి వివాదాలతో మేళ్లచెరువు పట్టాదారులు తమ భూములను అమ్ముకోలేక, పట్టామార్పిడి చేయలేక..మరి కొందరు రైతులు భూమి ఉండి కనీస హక్కు పత్రాలు లేక నానారకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా 1057 లో గల 160ఎకరాల భూదాన్‌ భూములు, 18 ఎకరాల సీలింగ్‌ భూముల కారణంగా ఇదే సర్వేనెంబర్లో గల 625 ఎకరాల మొత్తం భూమి వివాదాస్పదంగా మారింది. గతంలో ఈ సర్వేనెంబర్‌ లో గల భూదాన్‌ భూములను మైహోమ్‌, కీర్తి సిమెంట్‌ పరిశ్రమలు అక్రమంగా కబ్జా చేశారని.. సర్వేలు విచారణ చేపట్టిన అనంతరం భూదాన్‌ భూములను భేషరతుగా ఖాళీ చేయాల్సిందిగా కోర్టు, అధికార యంత్రాంగం 2012నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం నోటీసులు, స్వాధీనం నుండి తప్పించుకునేందుకు సిమెంట్‌ పరిశ్రమలు ఈ సర్వేనెంబర్‌ లో గల 625 ఎకరాల భూములను వివాదాస్పదంగా మార్చి 250మంది రైతులను ఏళ్లతరబడి వేధింపులకు గురి చేస్తున్నారు.

అచేతన స్థితిలో అధికార యంత్రాంగం…
భూదాన్‌ భూములు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని చెబుతున్నా అధికార యంత్రాంగం భూకబ్జా విషయంలో కళ్లుండి కూడా కబోదుల్లా వ్యవహరిస్తున్న ఆరోపణలు మొదటి నుండి వినిపిస్తున్నాయి. అధికారం అంత కొంత మందికే సొంతం అన్నట్లుగా పేదల భూములను కాపాడటంతో వెనుకంజ వేస్తున్నారు. భూ కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదల భూములను కళ్ళముందే దోచుకుంటున్నా తన సొమ్ము కాదన్నట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉంది. ఏళ్ల తరబడి వందల ఎకరాల భూములు ఆక్రమణకు గురవుతున్నా ప్రజా సొమ్ము కాపాడటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది. భూ కబ్జాదారులకు టైటిల్‌ లేదు, ధరణి పాస్‌ బుక్‌ లేదు, రికార్డుల్లో పేరు నమోదు లేదు అయినా భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు ముహూర్తం కుదరడంలేదు. అదేవిధంగా టైటిల్‌, పాస్‌ బుక్‌ అన్నీ ఉండి కూడా ఈ సర్వే నెంబరు గల భూముల్లో లావాదేవీలు నిర్వహించడానికి రైతులు, పట్టాదారులు ప్రభుత్వ భూముల వివాదం పేరిట ఏళ్ళతరబడి ఇబ్బందులు పడుతున్నా కనీసం దిగదుడుపు చర్యలు అధికార యంత్రాంగం చేపట్టడం లేదు. ధరణి వంటి అధునాతన వ్యవస్థ రూపొందించినప్పటికీ సామాన్య పట్టాదారులకు,రైతులకు న్యాయం జరగడం లేదు. ఎప్పటికప్పుడు మైహోమ్‌, కీర్తి సిమెంట్స్‌ పరిశ్రమ యాజమాన్యాలకు కావాల్సిన సహకారాన్ని అందిస్తూ దర్జాగా భూములను దోచుకుంటున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై కళ్ళముందే ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతుందా అడ్డుకోవడానికి అధికార యంత్రాంగం ముందుకు రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వనరులు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన ఈ ప్రాంత వాసులు ఇప్పుడు హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిరదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం మాత్రం కార్పొరేట్‌ కంపెనీలకు దాసోహంగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి ప్రభుత్వ భూములపై చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, లావాదేవీలపై వెంటనే నిలిపి వేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోని ప్రజా ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా ప్రభుత్వ భూములను దర్జాగా అనుభవిస్తున్న మైహోమ్‌, కీర్తి సిమెంట్‌ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోని కఠినంగా శిక్షించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

పెండ్లి శ్రీను, రైతు
మైహోం సిమెంట్‌ వారు ఆక్రమించి భూధాన భూమికి ముందు 3 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. మైహోం సిమెంట్స్‌ వారు భూధాన భూమిలోకి వెళ్లాలంటే నా భూమి నుండే పోవాలి. నాకు తెలపకుండా నాకు సంబంధించిన 3 గుంటల భూమిలో రాత్రికి రాత్రే దారిని వేసి వెహికల్స్‌ పోనిస్తున్నారు. ఇదేమని అడిగితే నాపై కేసు పెట్టారు. నేను పరిశ్రమ మీద పెట్టిన కేసును మాత్రం తీసుకోలేదు.