Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చనిపోయారు.. అయినా పింఛన్లు తీసుకుంటున్నారు..!

*చనిపోయిన వారి పింఛన్లు గోల్ మాల్*
*మంత్రికి ఫిర్యాదు చేసిన మహిళ*

*పింఛన్ల మాయం లో ఎవరి ప్రమేయం ఎంత?*

కల్లూరు,
మనుషులు ఉండగానే పైసలు ఇవ్వనంటే ఇవ్వననే బ్యాంకులలో డబ్బులు ఎలా మాయమైపోతాయి. అందులోనూ చనిపోయిన వారి పింఛన్లు మాయమవటం ఆశ్చర్యం కలిగించేదే. ఈ సంఘటన చెన్నూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు లో చోటు చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగుచూసింది.  ఎప్పుడో చనిపోయిన కుటుంబ సభ్యుల పింఛన్లు ఇప్పటికీ రావడం, వచ్చిన పెన్షన్లు ఎవరో తీసుకోవడం  కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు లో చనిపోయిన వ్యక్తుల ఖాతాలో ఉన్న డబ్బులు మాయమైన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాంకు పరిధిలో ఆయా గ్రామాల కు సంబంధించిన ఖాతాదారులు వారి పెన్షన్లు విధిగా జమైతున్నాయి. విచిత్రం ఏమిటంటే గత సంవత్సరo నుండి  చనిపోయినా వారి కూడా ఖాతాలో కూడ డబ్బులు జమ అవుతున్నాయి. చనిపోయినవారికి ఖాతాలో డబ్బులు జమ కావడం వ్యవస్థలో లోపమా? అధికారుల లోపమా? విషయం పక్కన పెడితే ఈ డబ్బులన గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది అక్రమార్కులు, బ్యాంక్ అధికారులు తో కుమ్మక్కై పింఛన్ డబ్బులను మాయ చేసినట్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ఖాతాలో ఉన్న డబ్బులు తియ్యాలంటే బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎదురుగా వ్యక్తి ,వారి సంతకం తనిఖీ చేసి నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత బ్యాంక్ అధికారులు సదరు వ్యక్తికి నగదును అందజేస్తారు. చనిపోయిన వ్యక్తి లేకుండా అయినా ఖాతాలో డబ్బులు తీయటం అసాధ్యమైన పని. కానీ కాసులకు కక్కుర్తిపడి కొందరు చనిపోయిన వారి పెన్షన్ ల మీద అక్రమాలకు తెర లేపారు. ఈ అక్రమాల వెనుక  బ్యాంక్ అధికారులను మంచి చేసుకుని చేశారా.. లేక ఫోర్జరీ సంతకాలతోనా, మధ్యవర్తుల ద్వారా నో కాని  డబ్బులు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకు లో చనిపోయిన వ్యక్తుల పెన్షన్లు మాయం కావడం పై అధికారుల పాత్ర ఎంతైనా ఉండొచ్చని పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.

మండల పరిధిలో పెద్ద కోరుకొండి గ్రామానికి చెందిన బీరవెల్లి నారాయణ, తాళ్లూరి ఆదిలక్ష్మి సుమారు 9 నెలల క్రితం చనిపోయింది. అయినా ఆమె ఖాతాలో పింఛన్లు డబ్బులు జమ అవుతున్నాయి. ఇది పసిగట్టిన కొందరు ఈ డబ్బులను ఎలా కాజేయాలని వ్యూహం పన్ని వారి ఖాతాలో నుండి సుమారు 20 వేల రూపాయలను డ్రా చేశారు. ఈ బ్యాంక్ లో చనిపోయిన వారు 20 మందికి పైబడి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. దళారుల ద్వారా చనిపోయినవారి పాస్ బుక్ లను తెప్పించుకొని వారి ఖాతాలో డబ్బులు మాయం  చేస్తున్నారని వారి వాదన. పథకం ప్రకారమే డబ్బులు కాజేస్తున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి.   పెద్ద కోరుకొండ గ్రామానికి చెందిన వేము స్వప్న జరుగుతున్న విషయాలను పసిగట్టి వెలుగులోకి తీసుకొచ్చింది . జిల్లా కలెక్టర్ దృష్టి సారించి బ్యాంకులపై తక్షణమే విచారణ జరిపి మాయమైన పెన్షన్ డబ్బులు రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు .

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ రమావత్ స్వామిని వివరణ కోరగా ఎవరి ఖాతాలో డబ్బులు మాయమయ్యయో సీసీ కెమెరాలో పర్యవేక్షణ చేసి అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ జరిగితే నగదును రికవరీ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు. మరల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.