అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి ..కలెక్టర్

అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్
పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లోని 20 హెక్టార్లలో నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ఆయన ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులోని పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సంబంధిత అటవీ శాఖ అధికారులతో కలిసి సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులోని 50 హెక్టార్లలో 20 హెక్టార్లను ఫారెస్ట్ పార్కు నిర్మాణానికి కేటాయించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
పార్కు కోసం కేటాయించగా మిగిలిన 30 హెక్టార్ల స్థలంలో వన్యప్రాణుల కోసం వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచేలా చూడాలని ఆదేశించారు.
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి అడవుల పునరుద్ధరణలో భాగంగా సుమారు 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అటవీ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దశల వారీగా టార్గెట్ పెట్టుకుని ఫిబ్రవరి నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. నర్సరీ, టాయిలెట్లు, ఆర్చ్, అంతర్గత రోడ్డు, తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. హరితవనం ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారిణి బాలామణి, అటవీ రేంజ్ అధికారి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.