భూధాన్ భూముల్లో ‘మహా’ మాయ…’కీర్తి’ కిరీటం
– వీటి విలువ రూ.100 కోట్లు పేనే
– సర్వేనెంబర్ 874, 876లలో మొత్తం 1200 ఎకరాల ప్రభుత్వ భూమి
– 708 ఎకరాల బంచారాయి పరిశ్రమలకు లీజు
– సర్వే నెంబర్ 1057లో 113ఎకరాలు మై హోమ్ సిమెంటు పరిశ్రమ ఆక్రమణలో,
– 18.20 ఎకరాలు కీర్తి సిమెంట్ , 21.20 ఎకరాల భూమి కీర్తి సిమెంట్ ఎండీ ఆక్రమనలో
ఉన్నట్లు 2011లో తేల్చిన త్రిసభ్య కమిటీ
– సర్వే నెంబర్ 874, 876 లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి సిమెంట్ పరిశ్రమల అధీనంలో..!
– పరిశ్రమల నుండి భూదాన భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా 2011లో కోర్టు ఉత్తర్వులు
– అయినా భూధాన భూములకు ఫెన్సింగ్ వేసి, నిర్మాణాలు చేస్తున్న పరిశ్రమలు..!
– కోర్టు కేసు పెండిరగ్ పేరిట భూములను అనుభవిస్తున్న పరిశ్రమ యజమానులు
– మా ఆధీనంలోనే ఉన్నాయంటున్న రెవిన్యూ యంత్రాంగం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన ప్రభుత్వ భూములకు శాపంగా అక్రమార్కులకు వరంగా మారింది. భూప్రక్షాళన పేరిట వందల ఎకరాల ప్రభుత్వ, అసైన్మెంట్ భూముల, రికార్డులను తారుమారు చేస్తున్నారు. అక్కడ భూరికార్డుల ప్రక్షాళన ప్రభుత్వ భూముల రికార్డులతో పాటు భూములను సైతం మాయం చేస్తుంది.
ప్రైవేటు వ్యక్తుల భూములే కాకుండా గ్రామాల మధ్య లింకు రోడ్లు, భూదాన భూములు, అసైన్మెంట్ , ప్రభుత్వ భూములను రెవిన్యూ, అధికార యంత్రాంగం అండదండలతో బడా బాబులు దర్జాగా కబ్జా చేసి అనుభవిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములను ఆక్రమించి అనుభవిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకునే పరిస్థితి లేదు.
దీంతో రూ. వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములు బడాబాబుల చేతికి వెళ్ళిపోతున్నాయి. మండల కేంద్రంలో పాఠశాలలు, స్మశాన వాటికలు సైతం నిర్మించుకోవడానికి జాగా లేక స్థానికులు అవస్థలు పడుతున్నా రూ. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
రూ.100 కోట్లు విలువ చేసే భూములు మాయం..
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో భూదాన్, అసైన్మెంట్, ప్రభుత్వ భూములు కనుమరుగైపోతున్నాయి. రెవిన్యూ రికార్డుల్లో తప్ప భౌతికంగా కనిపించడం లేదు. మేళ్లచెరువు రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1057 లో 160 ఎకరాల భూదాన్ భూమి ఉంది. 1974 లో జరిగిన భూదానోద్యమం లో భాగంగా ఈ ప్రాంతానికి చెందిన అక్కిరాజు వాసుదేవరావు కుటుంబీకులు 173 ఎకరాల భూమిని పేదలకు దానంగా ఇచ్చారు.
ఈ భూములు 2010 సంవత్సరానికి వచ్చేసరికి మై హోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ పరిశ్రమల స్వాధీనంలోకి వచ్చాయి. భూదాన భూములు కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. అటువంటి భూములు పరిశ్రమల కబ్జాలోకి ఏ విధంగా వచ్చాయనేది రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేయాల్సి ఉంది. వందల ఎకరాల భూదాన భూములు కబ్జాకు గురైనట్లు 2011 సంవత్సరంలో ప్రచురితమైన భూదానం అన్యాక్రాంతం కథనం ఆధారంగా సుమోటోగా కేసు విచారించిన లోకాయుక్త కోర్టు సదరు భూదాన భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
భూదాన భూముల కబ్జా పై విచారించిన త్రిసభ్య అధికారుల కమిటీ సర్వే నెంబర్ 1057లోని 113ఎకరాల భూమి మై హోమ్ సిమెంటు పరిశ్రమ ఆక్రమణలో, 18.20 ఎకరాల భూమి కీర్తి సిమెంట్ పరిశ్రమ, 21.20 ఎకరాల భూమి కీర్తి సిమెంట్ పరిశ్రమ ఎండీ ఆక్రమనలో ఉన్నట్లు నిగ్గుతేల్చింది. మొత్తం 153 ఎకరాల భూదాన్ భూమి సిమెంట్ పరిశ్రమలు అధీనంలో ఉండగా, మరో పది ఎకరాల అన్యాక్రాతమైనట్లూ త్రిసభ్య కమిటీ తేల్చింది. త్రిసభ్య కమిటీ రిపోర్ట్ మేరకు లోకాయుక్త కోర్టు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది.
నోటీసులు జారీ చేసిన రెవెన్యూ యంత్రాంగం పలువురు రైతుల నుండి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోగా సిమెంట్ పరిశ్రమలు మాత్రం ఈ భూమి తమ పట్టా భూమి అని పత్రాలు దాఖలు చేస్తూ హైకోర్టులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చారు. కోర్టుకెక్కిన భూదాన భూములు వివాదం ఇప్పటి వరకు ముందుకు సాగలేదు. ఈ భూదాన భూములు మాత్రం సిమెంట్ పరిశ్రమల ఆక్రమణ లోనే ఉన్నాయి.
భూదాన భూములు దానం పొందిన వ్యక్తుల వద్ద లేదా భూదాన్ బోర్డు స్వాధీనంలో, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చట్టం చెబుతోంది. అధికార యంత్రాంగం మాత్రం భూదాన భూములు తమ పరిధిలోని ఉన్నాయంటూ రికార్డులు చూపిస్తున్న ప్పటికి భౌతికంగా మాత్రం గత పదేళ్లుగా సిమెంట్ పరిశ్రమలు ఈ భూములకు చుట్టూ ఫెన్సింగ్ నిర్మించి అనుభవిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతూ భూములను తమ అవసరాలకు వాడుకుంటున్నారు.
లీజు పేరిట 340 ఎకరాల అసైన్డ్, 50ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
మేళ్లచెరువు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 874, 876,175 లలో 1178 ఎకరాల బంచరాయి ప్రభుత్వ భూమి కలదు. ఈ భూమిలో 1984లో పేదలకు ప్రభుత్వం 340 ఎకరాల భూమిని అసైన్మెంట్ చేసి 220 మంది నిరుపేదలకు పట్టాలు మంజూరు చేసింది. తరువాత 1998 నుండి 2006వరకు ఇదే సర్వే నెంబర్లల్లో మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు 141హెక్టార్ల (354 ఎకరాలు), సువర్ణ సిమెంట్ పరిశ్రమ కు 141హెక్టార్ల(354 ఎకరాల) భూమిని సున్నపురాయి మైనింగ్ కోసం జీవో నెంబర్ 137, 298 ప్రకారం లీజుకు ఇచ్చింది.
అంతేకాకుండా సర్వేనంబర్ 874లో 49 ఎకరాల భూమిని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించగా, 876 సర్వేనెంబర్ లో 61 ఎకరాల భూమిని మై హోమ్ సిమెంట్ పరిశ్రమ నిర్మాణం కోసం 2002లో జీవో నెంబర్ 330 ప్రకారం ఆల్లైనేషణ్ చేసింది( భూమిని అమ్మేసింది). సున్నపురాయి మైనింగ్ కోసం సిమెంట్ పరిశ్రమలకు 708ఎకరాల భూమిని కేటాయించగా, 340 ఎకరాల అసైన్డ్ భూమి, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం 49 ఎకరాలు, ప్రభుత్వ అవసరాల కోసం ఆర్డిఓ పేరిట 18 ఎకరాల కేటాయించగా మిగులు భూమితో కలిపి మొత్తం 407 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉంది. అయితే ఈ భూమంతా బంచరాయి నేల కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించిన ప్రదేశం మినహా 400 ఎకరాల భూమి 2009 వరకు చాలా కాలం పాటు పడవుగా ఉంది.
ఇదే సర్వే నెంబర్లలో లీజు పొందిన మై హోమ్, కీర్తి సిమెంట్ పరిశ్రమ వారు సదరు భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈలీజు పొందిన భూములకు రక్షణ పేరిట కొద్దికొద్దిగా ఫెన్సింగ్ గోడను నిర్మిస్తూ ఈ సర్వే నెంబర్ లో గల మొత్తం భూమిని చుట్టుముట్టుతూ పూర్తిగా ఆక్రమించారు. 2010 నాటికి సర్వేనెంబర్ 874, 876 లో గల వందల ఎకరాల ప్రభుత్వ భూమి పూర్తిగా సిమెంట్ పరిశ్రమల అధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ సర్వే నెంబర్లో 95 శాతం భూమి మై హోమ్ సిమెంట్ పరిశ్రమ వారు 5 శాతం భూమిని కీర్తి సిమెంట్ పరిశ్రమ వారు ఆక్రమించినట్లు తెలుస్తున్నది. ఈ సర్వే నెంబర్లల్లో గల ప్రభుత్వ భూమి పూర్తిగా గ్రామానికి-మైహోం సిమెంట్ పరిశ్రమకు మధ్యలో రెండి౦టిని కలుపుతూ ఉంది. మైహోమ్ సిమెంట్ పరిశ్రమ వారు మాత్రం ఏదైతే ప్రభుత్వం లీజు ఇచ్చిందో ఆ భూమిలోనే తాము ఫెన్సింగ్ చేశామని చెబుతున్నారు.
2010 నాటి నుండి ఇప్పటి వరకు ఈ భూముల్లో ఎంత భూమి లీజుకు ఇవ్వడం జరిగింది, ఎంత మిగులు భూమి ఉన్నది, సదరు సిమెంట్ పరిశ్రమలు ఎన్ని ఎకరాల్లో ఫెన్సింగ్ నిర్మించారు, ఎన్ని ఎకరాల్లో మైనింగ్ కొనసాగిస్తున్నారు అనే అంశంపై ఇప్పటివరకు అధికారుల వద్ద స్పష్టత లేదు. అసలు ఈ భూములపై ఇప్పటివరకు ఎటువంటి సర్వేలు చేపట్టలేదు. గ్రామానికి చెందిన అసైన్మెంట్ పట్టాలు పొందిన రైతులు ఎన్నిసార్లు తాసిల్దార్ కార్యాలయం ముందు ఫిర్యాదు చేసిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటానికైనా సాహసం చేయడం లేదు.
మేళ్లచెరువు గ్రామంలో ఇతర ప్రభుత్వ అవసరాల కోసం, జూనియర్ పాలిటెక్నిక్ కాలేజ్, స్మశాన వాటిక, డంపింగ్ యాడ్ , డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణాలు చేపట్టాలని భూమికోసం తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే సదరు భూమి మైహోమ్ సిమెంట్ పరిశ్రమ లీజు లో ఉందని నిర్మాణాలకు అవకాశం లేదని అధికార యంత్రాంగం 2010నాటి నుండి సమాధానమిస్తూ వస్తుంది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం అసైన్మెంట్ చేయబడిన 340 ఎకరాల భూమి భౌతికంగా కనపడకుండా మాయమైపోయింది.
మాయమైపోతున్న భూమి ప్రభుత్వ, గ్రామ అవసరాల కోసం వాడుకలోకి తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మై హోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ భూములను కబ్జా చేసిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారికి సహకరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
మై హోమ్ గ్రూప్స్ ఖాతాలో మరో భారీ భూ కబ్జా….
మై హోమ్ గ్రూప్స్ మెల్లచెరువులో ఆక్రమించిన 113 ఎకరాల భూదాన భూముల్లో 2011 సంవత్సరంలో 60 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసిన మై హోం సంస్థ భూదాన భూముల కబ్జా వివాదంతో చిక్కుకొని పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని సర్వే నెంబర్ 1069, 1070, 1072 లలో గల భూమిలోకి మార్చింది. అప్పటినుండి 113 ఎకరాల భూదాన భూములు చుట్టూ ఫెన్సింగ్ వేసి ఖాళీగానే ఉంచారు.
మైహామ్ గ్రూప్ ఈ భూదాన్ భూములను పలు జీవోల ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఈ భూముల్లోకి ఎవరు ప్రవేశించకుండా చుట్టూ పెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. నిత్యం పదుల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది ఆధ్వర్యంలో పహారా నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఈ భూములను చదునుచేసి ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేయడం లేదు.
కబ్జాదారులకు సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం…
ఎటువంటి అనుమతులు లేకుండా భూదాన భూములులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికార యంత్రాంగం అటువైపు కనీసం చూడటం లేదు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి మొర్రో అని పలువురు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వందల రూ. కోట్లు విలువ చేసే భూదాన్, అసైన్మెంట్, ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసుకొని అనుభవిస్తున్నా కబ్జాదారులకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి మరీ అందలం ఎక్కిస్తుంది. ఏళ్ల తరబడి భూములను కబ్జా చేసే అనుభవిస్తున్నారని తెలిసి కూడా చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం ముందుకు రావడం లేదు. 2
011లో భూదాన భూములను స్వాధీనం చేసుకోమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన ఇప్పటి వరకు అమలు చేయలేదు.150 ఎకరాల భూమి మై హోమ్, కీర్తి సిమెంట్ పరిశ్రమలు కబ్జా చేశాయని అన్ని ఆధారాలు ఉన్నా కూడా సదరు కబ్జా చేసిన భూమి, భూదాన్ భూమి కాదని పరిశ్రమలు హైకోర్టులో స్టే తెచ్చుకున్నాయి. సదర్ పరిశ్రమలు ఆక్రమించిన భూమి భూదాన భూమి కానప్పుడు ఇంతకు భూదాన్ భూములు ఎక్కడకు వెళ్లినట్లు..? ఇప్పటి వరకు అధికారులు స్పష్టం చేయడం లేదు. భూదాన్ భూమి ఎక్కడ ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా రెవిన్యూ యంత్రాంగం మా ఆధీనంలోనే ఉన్నాయని లిఖితపూర్వకంగా రాసి ఇస్తున్నాయి.
కానీ ఆ భూమి ఎక్కడుందో చూపించమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. సర్వేనెంబర్ 874 ,876 లల్లో 350 ఎకరాల అసైన్మెంట్, ప్రభుత్వ అవసరాలకు వినియోగించే ప్రభుత్వ భూమి ఉండగా ప్రభుత్వ నిర్మాణాల కోసం రెవెన్యూ అధికారులను భూమి కోరితే భూమి మాత్రం మై హోం సిమెంట్ పరిశ్రమ లీజు లో ఉందని సమాధానం ఇస్తున్నారు.
874, 876 లో మొత్తం 1200 ఎకరాల భూమి ఉండగా సదరు మై హోమ్, కీర్తి సిమెంట్ పరిశ్రమలకు 708 ఎకరాల బంచారాయి భూమిని మాత్రమే లీజుగా ఇవ్వడం జరిగింది. కానీ సదరు పరిశ్రమలకు రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సర్వే చేసి హద్దులు నిర్ణయించలేదు. ఇదే అదునుగా లీజు పొంది మైనింగ్ ప్రారంభించిన మై హోమ్, కీర్తి సిమెంట్ పరిశ్రమలు గత కొన్ని సంవత్సరాలుగా 874, 876 సర్వేనెంబర్‌లో ఉన్న మొత్తం భూమిని ఆక్రమించింది. దీంతో ప్రభుత్వ నిర్మాణాలు ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్న అధికార యంత్రాంగం కనీసం సర్వే కూడా చేయకుండా గుడ్డిగా ఈ సర్వే నెంబర్లలో భూమి లేదని సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించి భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.