గ్రామస్థాయి ప్రణాళికలే శ్రీరామరక్ష

దేశం బలపడాలంటే గ్రామాలు బలపడాలి. గ్రామాలు ఆర్థికంగా వృద్ది చెందాలి. వ్యవసాయం బలపడాలి. అన్నదాతలు ఆర్థికంగగా బలపడితేనే అనుబంధరంగాలు పెరుగుతాయి. అయితే వ్యవసాయికంగా మనం పంటల ఉత్పత్తిలో చూపిస్తున్న శ్రద్ద వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్దికి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అన్ని విధాలుగా మనమంతా అభివృద్దికి నోచుకోవడం లేదు. ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే పంట ఉత్పత్తులతో పాటు..నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడమే గాకుండా…గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడగలం.
గ్రామస్థాయిలో ప్రణాళికలు రచించి అమలయ్యేలా కార్యాచరణ సాగడం లేదు. గ్రావిూణ అర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా సర్పంచ్‌ను బాధ్యులను చేసేలా కార్యక్రమాల రచన జరగడం లేదు. అన్నీ సచివాలయం నుంచి సిఎం పర్యవేక్షణలో జరగడం గ్రామాలు వట్టిపోవడానికి కారణం అవుతున్నాయి.
ఆర్థికంగా పంచాయితీలు బలోపేతంగా లేకపోవడంతో పాటు, సర్పంచ్‌లు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల గ్రామాల్లో పారిశుద్య కార్యక్రమాలు మొదలు ఇతరత్రా కార్యక్రామలు బలంగా ముందుకు సాగడం లేదు.
ప్రధానంగా పారిశుధ్యం అన్నది పంచాయితీల సామాజిక బాధ్యతగా చేయాలి. స్వచ్ఛత అన్నది వ్యక్తిగతమైన శ్రద్దకు సంబంధించినదే అయినా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇలాంటి శ్రద్ద తక్కువనే చెప్పాలి. ఇప్పటికీ ఆరుబయట మలవిసర్జన అన్నది అలవాటుగా కొనసాగుతోంది. నిత్యం టీవీల్లో పేపర్లలో ప్రకటనల ద్వారా ప్రజల్లో చైతన్యానికి కృషి చేస్తున్నా వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు.
కరోనాలాంటి వైరస్‌లు విజృంభించి అనారోగ్యాల బారిన పడుతున్నా ప్రజలు ఇందుకు కారణాలు అపరిశుభ్రత అని గ్రహించడం లేదు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ముగురునీరు ఎక్కడపడితే అక్కడ వచ్చి చేరుతోంది.నిజానికి కార్యక్రమాల్లో ఏ గ్రామానికి ఆగ్రామ సర్పంచ్‌ను బాధ్యుడిని చేస్తే సరిపోయేది. అయితే స్వచ్ఛ భారత్ ప్రకటించిన తరవాత దేశంలో కొంత మార్పు గోచరిస్తోంది. ప్రధానంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం తొలిసారిగా ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో దీని కార్యక్రమం సాగడం లేదు. ఆరుబయట మలవిసర్జన కారణంగా మనదేశంలో అనారోగ్యకర వాతావారణం ఎక్కువే. అలాగే వ్యాధుల సంక్రమణ, అంటువ్యాధుల వ్యాప్తి కూడా ఎక్కువే.
ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా గ్రామాల్లో జోరుగా దీనిపై శ్రద్ద పెడుతున్నా లక్ష్యాన్ని మాత్రం సాధించడం లేదు. పారిశుద్యం, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలు సామాజిక బాధ్యత కావాలి. ఈ రకమైన చైతన్యం కోసం ఉద్యమించాల్సి ఉంది. పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవ డంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది.
ప్రధానంగా అన్ని పనులను ప్రభుత్వంమే చేస్తుందన్న ధీమాలో ప్రజలు ఉన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాల కారణంగా ప్రజలు అచేతనంగా తయారయ్యారు. వారిని బాధ్యులను చేసేలా చర్యలు ఉండడం లేదు. పరిశుభ్రత లోపించిన కారణంగానే వ్యక్తిగతంగానే గాక పరిసరాల శుభ్రతా లోపించి అతిసారం, కలరా వంటి వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా కరోనా ఇంకా విజృంభించడానికి పరిశుభ్రతా లోపం కూడా కారణంగా చూడాలి. కరోనాలాంటి వైరస్‌లను అరికట్టాలంటే పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మురికివాడల వద్ద ఖాళీ ప్రదేశాలు, పొలం ప్రాంతాలు, గ్రామ శివారు స్థలాలు, రైలు పట్టాల పరిసరాల్లో కాలకృత్యాలు హానికరంగా పరిణమిస్తున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లకు 12వేల ఆర్థిక సాయం అందిస్తున్నా గ్రామాల్లో ప్రజలు వెంటనే మరుగు దొడ్లు నిర్మించు కునేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రజలతో పాటు ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది.
గ్రామాలను యూనిట్‌గా చేసి సర్పంచ్‌లకు బాధ్యత అప్పగించి ఉంటే ఇది వందశాతం సక్సెస్ అయ్యి ఉండేది. కానీ గ్రామస్థాయిలో పనులకు సర్పంచ్‌లను బాధ్యులను చేయడం లేదు. అందుకే వ్యక్తిగత మరుగుదొడ్ల పథకంతో పాటు.. పారిశుద్య పనులు ముందుకు సాగడం లేదు. ఇకపోతే అనేక పథకాలకు ఆర్థిక చేయూత నిచ్చినా గ్రామాల్లో ప్రజల్లో పెద్దగా స్పందన రావడం లేదు. సర్పంచ్‌లకు బాధ్యతలు అప్పగించి గ్రామకమిటీ ద్వారా ఈ వ్యవహారం నడిపించివుంటే బాగుండేది. ఈ విషయంలో ఇరు తెలుగు రాష్టాల్ర ప్రభుత్వాలు విఫలం అయినట్లే.
ఒక్క మురుగుదొడ్డి నిర్మించుకోవడానికి సవాలక్ష కారణాలు ఉంటున్నాయి. అధికారుల నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వ్యక్తిగత మరగుదొడ్లు నిర్మించు కోకుంటే ప్రభుత్వ పథకాల అమలు నిలిపి వేస్తామని హెచ్చరించడం మొదలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతో ప్రచారం సాగుతున్నట్లుగానే కరోనా తదితర వ్యాధులపైనా చైతన్యం తీసుకుని రావాలి. అనారోగ్యకర వాతావరణంలో సగటు మనుషులకు వ్యాధులు ఎలా సంక్రమిస్తాయో తెలియచేయాలి. రహదారుల్లోనే మురుగునీరు ప్రవహిస్తుండటం దోమల బెడద తీవ్రం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. అనేక అంటురోగాలు ప్రబలుతున్నాయి.
మలేరియా, డెంగ్యూ విజృంభిస్తోంది. గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వేలాది రూపాయల వేతనాలుగా అందిస్తున్నా ఫలితం కానరావడం లేదు. గ్రామాల్లో సర్పంచ్‌లు పటిష్టంగా పనిచేయడంతో పాటు ప్రణాళికలు సిద్దం చేసేలా అధికారులు కార్యాచరణ సిద్దం చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. సర్పంచ్‌లను, గ్రామ వార్డు సభ్యులను బాధ్యులను చేయాలి. అప్పుడే ఏ పథకం అయినా ఆశించన ఫలితం అందిస్తుంది.