Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సాయిబాబా టాకీస్‌ ప్రక్కన లేఅవుట్‌ మార్కెట్‌కు పనికిరాదా…?

– ఈ స్థలం మున్సిపాలిటీకి రాదని డిసైడయ్యారా…?
– 30 కోట్ల విలువైన స్థలం కథ కంచికేనా…?
– పలు అనుమానాలకు తావిస్తున్న మార్కెట్‌ ఎంపిక

హుజూర్‌నగర్‌ లో సాయిబాబా టాకీస్‌ ప్రక్కన ఉన్న మున్సిపాలిటీకి కేటాయించిన 5510 చదరపు గజాల లేఅవుట్‌ స్థలం ఉంది. ఈ స్థలంలో 8/3/2017న 70లక్షల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేసారు. ఈ స్థలంలో ఓపెన్‌జిమ్‌కు కూడా రన్‌ అవుతుంది. ఈ స్థలం గ్రామపంచాయతీకి ఇప్పటికి కూడా అగ్రిమెంట్‌ల రూపంలో ఉంది.

గత పాలకులు లేఅవుట్‌ స్థలాలను గ్రామపంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడంను ఆసరాగా తీసుకుని ఈ స్థలం మున్సిపాలిటీది కాదు మాదేనని, రికార్డులన్నీ మా పేరు మీదే ఉన్నాయని గతంలో వెంచర్‌ పెట్టి గ్రామపంచాయతీకి కేటాయించిన కోట్ల విలువైన స్థలాన్ని ఎలాగైనా కాజేయాలన్న ఆలోచనతో కోర్టుకు వెళ్లారు.

ఈ స్థలం వివాదం కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ విషయం కోర్టులో ఉంది త్వరగా తేలేది కాదనుకున్నారో, తాము ఏం పని చేయడం లేదన్న పేరు పొగొట్టుకోవడానికో, ఎలక్షన్‌లో పెట్టిన పెట్టుబడికి రికవరీ కోసమో ఏమో అనుకుంటున్నారు. 30 కోట్ల విలువ చేసే స్థలాన్ని వదలి మార్కెట్‌ నిర్మాణానికి ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో పట్టణ ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుందంటున్నారు.

ఇది ఓకే మరి సాయిబాబా టాకీస్‌ పక్కన ఉన్న స్థలాన్ని లేఅవుట్‌ పెట్టిన అకమ్రార్కులకే వదిలేయనున్నారా..? అందుకే మార్కెట్‌ స్థలాన్ని మరో ప్రదేశానికి మార్చుతున్నారా..? లేక 30 కోట్ల విలువ చేసే ఈ స్థలంను ఖతం చేయడానికి ఎవరైనా పన్నాగం పన్నుతున్నారా…? దీనికి ఎవరెవరి సపోర్టు ఉంది…? దాని కోసమే కోర్టులో కేసుకు అటెండ్‌ కాకుండా తప్పించుకున్నారా..? లేక మరేదైనా ఉందా అని పట్టణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కోర్టుకు ఎందుకు హాజర్‌ కాలేదో…
సర్వే నెంబర్‌ 207, 208, 211, 212 లోని 224, 225, 226, 227, 250, 251, 252, 253, 256, 257, 258, 259, 278, 279, 223, 228, 254, 249, 260, 255, 237, 279, 280 ప్లాట్ల నెంబర్లలో 5510 చదరపు గజాల మున్సిపాలిటీ స్థలం సాయిబాబా టాకీస్‌ ప్రక్కనే ఉంది. ఈ స్థలంను 8/06/2014 నుండి పలువురు వ్యక్తులు అక్రమంగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇదే విషయం రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో వస్తుంది.

5510 గజాల స్థలం మాదేనని లేవుట్‌ పెట్టిన వారు మూడు సంవత్సరాల క్రితం కోర్టుకు పోయి మున్సిపాలిటీకి కోర్టు నుండి నోటీసులను పంపారు. ఈ నోటీసులకు జవాబు ఇవ్వాల్సిన మున్సిపాలిటీ అధికారులు కోర్టుకు వరకు పోయి ఉద్ధేశ్య పూర్వకంగానే హాజర్‌ కాలేదని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

అంతేకాక మున్సిపల్‌ స్టాండిరగ్‌ కౌన్సిల్‌ లాయర్‌ను కాదని మరో ప్రయివేట్‌ లాయర్‌తో వకాలత్‌ వేయించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసును మున్సిపల్‌ స్టాండిరగ్‌ కౌన్సిల్‌ లాయర్‌ను కాదని మరో ప్రయివేట్‌ లాయర్‌ కు మున్సిపాలిటీ వారు ఎందుకు అప్ప జెప్పారో తెలియడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా మున్సిపల్‌ ఆస్తులను కాపాడాల్సిన భాధ్యత అందరిపై ఉందని, భవిష్యత్‌ అవసరాలకు వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.