అక్రమ సంబంధమే ప్రాణం తీసిందా…?
సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలోని వ్యవసాయ పొలం మడిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్లిన వారు పొలం మడిలో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బురద మడిలో నుండి బయటికి తీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేష్ (30)గా గుర్తించిన పోలీసులు,మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…
మృతుడు బాతుక మహేష్ నిన్న సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై లింగగిరి వెళ్లివస్తానని ఇంటి నుండి బయలుదేరాడు. ఇంటి నుండి వెళ్లిన మహేష్ రాత్రి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డారు.
తెల్లవారేసరికి పొలం మడిలో శవమై తేలడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మహేష్ కి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య హత్యచేసి పొలం మడిలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో తేలనున్న మహేష్ మరణం మిస్టరీ…!