బిజెపిది కార్పోరేట్‌ విస్తరణ కాంక్ష ! 

బిజెపిది కార్పోరేట్‌ విస్తరణ కాంక్ష !

రాజ్యవిస్తరణ కాంక్షలో పడ్డ బిజెపి..దాని నేతలు ప్రజలను విస్మరించారు. ప్రజా సమస్యలను విస్మరించారు. ప్రజలకు బతికే హక్కు వంటి సమస్యలను పక్కన పెట్టి.. విస్తరణ వాదాన్ని ముందుకు తీసుకుని వస్తున్నారు. దేశంలో అనేకానేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. నినాదాలతో ప్రధాని మోడీ ఊదర గొట్టడం అలవాటు చేసుకున్నారు. గతంలో ఉన్న బిజెపికి నేటి బిజెపికి అసలు పొంతన లేకుండా పోయింది.

ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేవలం కార్పోరేటీకరణ లక్ష్యంగా పాలన సాగుతోంది. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకాలను నిర్లజ్జగా కొనసాగిస్తున్నారు. ధరల తగ్గింపు, విద్య,ఉద్యోగం, వైద్యం వంటి విషయా ల్లో శ్రద్ద కానరావడం లేదు. కరోనాతో జనం చచ్చిపోయినా వారి కుటుంబాలకు చావు ఖర్చులు కూడా దక్క లేదు. ఈ  క్రమంలో ఆదానీ అంబానీల వ్యాపారాలకు ప్రభుత్వం వత్తాసు పలుకు తోంది. భారీ లక్ష్యాలను ప్రకటించి వాటి వెనక గోతులు తీస్తున్నారు. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్టాల్ల్రో దూకుడు రాజకీయాలు చేపట్టారు. ఇక్కడి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెట్టారు. దీనిపై ప్రజల ఆందోళనలను పట్టించుకోవడం లేదు.

గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను ఆదానికి కట్టబెట్టారు. రాజధాని అమరావతి పై నోరు మెదపడం లేదు. తాను పునాదిరాయి వేసిన అమరావతికే దిక్కులేకుండా చేస్తున్నా పట్టించు కోవడం లేదు. తెలంగాణలో కూడా దూకుడు ప్రదర్శిస్తూ పోతున్నారు. విభజన తరవాత తెలంగాణకు ఒరగబెట్టింది శూన్యం. అధికారం దక్కించుకోవడం వేరు..ప్రజలకు మేలు చేయడం వేరు. ఇక్కడి ప్రాంతీయ పార్టీలో ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుంటే పాగా వేయవచ్చు. కానీ కేంద్రంలో ఏడున్నరేళ్లు గా అధికారం వెలగబెడుతున్న ప్రభుత్వం చేసిందేమిటి..? జిఎస్టీ, నోట్లరద్దు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలతో ప్రజలను బిచ్చగాళ్లుగా తయారు చేశారు.

ఒక్కమాట లో చెప్పాలంటే బిజెపి పాలనలో సామాన్యులు అడుక్కునే స్థితికి తీసుకుని వచ్చారు. పేదలు మరింత పేదవారు అయ్యారు. ధరలు పెరిగిపోతున్నాయి. డాలర్‌ విలువ అమాంతంగా పెరిగిపోతోంది. దిగుమతు లు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం ఉండడం లేదు. అన్నదాతలు రోడ్డెక్కుతున్నా పట్టింపు లేదు. కనీస మద్దతు ధరలు గంగలో కలిపారు. మేకిన్‌ ఇండియా అంటూ ఊదర గొట్టి ఇప్పుడా ఊసే లేకుండా చేశారు.

పెట్టుబడులు, తయారీ, రూపకల్పన, నవకల్పన వంటి అనేక మాటలు చెప్పారు. ప్రపంచ ఎగుమతి కేంద్రం గా మారి చైనాను పక్కకు నెట్టాలన్నది ప్రకటిత లక్ష్యంగా చెప్పారు. ఎగుమతుల్లో పోటీ ఎక్కడా కానరావడం లేదు. ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతున్నా ప్రజలకు ధరలు అందుబాటులో లేవు. గుజరాత్‌ ఆదర్శ నమూ నాను దేశమంతటా అమలు జరుపుతానంటూ గద్దె నెక్కిన మోడీ ఏడున్నరేళ్లలో చేసిందేమిటో ప్రజలు ఆలోచన చేస్తున్నారు.

నాడు 500 రూపాయలకు ఉన్న విలువ నేడు మోడీ సృష్టించిన 2వేల నోటుకు లేకుండా చేశారు. స్వయం సమృద్ధి గురించి అందమైన మాటలు చెప్పటంతోనే సరిపుచ్చారు. కరోనా వచ్చిన తరువాత ఆత్మనిర్భరత గురించి గాంభీర్య ప్రకటనలు చేశారు. సంస్కరణల పేరుతో మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న చర్యల్లో భాగంగా లైసన్సులు ఎత్తివేశారు, కార్పొరేట్‌ పన్ను భారీగా తగ్గించారు. అనేక దిగుమతి పన్నులు తగ్గించారు. కార్పొరేట్లకు అనేక సబ్సిడీలు, రాయితీలు ఇచ్చారు. ప్రణాళికా సంఘం అవసరం లేదంటూ దాన్ని ఎత్తివేసి నీతి ఆయోగ్‌ అంటూ కొత్త దానిని తెరపైకి తెచ్చారు.

ఉత్పత్తి, ఎగుమతులకు లంకెపెట్టి మరికొన్ని సబ్సిడీలను ప్రకటించారు. వాటికీ సడలింపులు ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఎవరూ వ్యతిరేకించలేదు. సంస్కరణల పేరుతో మొదటికే మోసం తెస్తున్నారని జనానికి అర్థం అయ్యింది. కరోనా కాలంలో ప్రజలకోసం…వారి సంక్షేమానికి ఖర్చు పెట్టేందుకు చేతులు రాని మోడీకి.. కార్పొరేట్లకు దాదాపు రెండు లక్షల కోట్ల మేర కట్టపెట్టారు.

బ్యాంకులు దివాళా తీసినా..బడా నేతలు లక్షల కోట్లు ఎగవేసి పారిపోయినా చడీచప్పుడు లేదు. చైనా వంటి వర్ధమాన దేశాల్లో వస్తూత్పత్తి రంగం ప్రధాన ఉపాధికల్పన కేంద్రంగా నిలిచింది. తయారీ రంగంలో చైనా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. చైనా జనాభాను మానవ వనరులుగా ఉపయోగించి ప్రపంచానికి అసవరమైన వస్తువులను ఉత్పత్తి చేయడం ఆరంభించి ముందుకు సాగారు. మనదేశంలోనూ మానవవనరులు.. సహజ వనరులు ఉన్నా మనం మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయలేదు. మోడీ అధికార పగ్గాలు చేపట్టాక ఉపాధి రంగం దూసుకుని పోతుందన్న భరోసా ఇచ్చినా ఎక్కడా అందుకు తగ్గట్లుగా ప్రయత్నాలు సాగలేదు. అందుకే మన పాలకులు చైనా స్ధానాన్ని ఆక్రమించలేక పోయారు.

స్వయంసమృద్దిని సాధించే ప్రయత్నాలు చేయడం లేదు.  వస్తూత్పత్తి రంగంలో ఆటోమేషన్‌, రోబోలు ఎలా వచ్చాయో, సేవారంగాన్ని కూడా ఆటోమేషన్‌ ఆవరిస్తున్నది. బ్యాంకులకు వెళ్లి డబ్బు తీసుకోనవసరం లేకుండా ఎటిఎం మెషీన్లే మనకు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల ద్వారా నిధుల బదిలీ, ఇతర లావాదేవీలు సులభంగా జరుపుకుంటున్నాం. దీనివెనకా మార్కెట్‌ మంత్రమే తప్ప ప్రజల మేలు లేదు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా వృద్ధి జరగడం లేదు. జనానికి ఆదాయం లేనపుడు వస్తు, సేవల వినియోగం తగ్గుతుంది. పంటలకు తగిన గిట్టుబాటు ధరలను సమకూర్చలేకపోగా…వ్వయసాయానుబంధ పరిశ్రమలపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో ఉపాధి తగ్గుతోంది. చేతి వృత్తుల్లో కూడా యాంత్రీకరణ పెరిగి పోతోంది.  మోడీ సర్కార్‌ డిజిటలైజేషన్‌ కారణంగా ప్రజల జీవన వ్యాయం పెరిగింది. అది పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ఇంతగా దేశాన్ని దివాళా దిశగా తీసుకుని వెళుతున్న వారికి మనదేశ జనాభా..ఉపాధి అవకాశాలు, ఉత్పత్తి రంగాలపై ఏమాత్రం అవగాహన లేదనే అనుకోవాలి.

కార్పపోరేట్లకు సేవ చేయాలంటే అన్ని రాష్టాల్ల్రో అధికారం కావాలి. అన్ని రాష్టాల్ల్రో వనరులు దోచి పెట్టాలి. అందుకే రాజ్యవిస్తరణ కాంక్షలో మోడీ,షా ద్వయం పడిరది. గుజరాత్‌ మోడల్‌ అంటూ దోచి పెడుతూ..రాష్టాల్ల్రో అలజడి సృష్టిస్తున్నారు. దీంతో ప్రజల్లో వీసెట్టు అభిమానం కూడా రాదని బిజెపి శ్రుణులు గుర్తించాలి. ఇచ్చిన హావిూలను నెరవేర్చడం, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెద్దపీట వేయకుండా ముందుకు సాగడం కుదరదని గుర్తించాలి. బిజెపి విస్తరణ నైజాన్ని ప్రజలు కూడా గుర్తించి నిలదీస్తే తప్ప పాలకులు మేల్కోరు.