నామినేటెడ్ పదవుల కోసం టిఆర్‌ఎస్ నేతల ఎదురుచూపులు
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా..ఖాళీ అయిన రాజ్యసభ సీటులో ఎవరికి అవకావం ఇస్తారు…మండలి ఛైర్మన్‌గా ఎవరిని నియమిస్తారు..వంటి అంశాలు ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు టిఆర్‌ఎస్ నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇకపోతే మండలి ఛైర్మన్ ఎంపిక కూడా కీలక కానుంది. తెలంగాణ శాసనమండలిలో ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు పూర్తి బలం ఉంది. ఇటీవలే 19 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. అయితే మండలి ఛైర్మన్, డిప్యూటి ఛైర్మన్ పదవులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రొటెం ఛైర్మన్‌తో సభ నడుస్తోంది. జనవరి 4తో ఆయన పదవి కాలం కూడా ముగియనుంది. దీంతో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లను నియమించడం పక్కాగా కనిపిస్తోంది. ఆ పదవుల కోసం సీనియర్లంతా ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టారని సమాచారం. మాజీ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నిక అయినా ఆయన మంత్రిపదవిపై ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఛైర్మన్‌గా ఉండటంతో మళ్లీ ఆయనకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. కానీ గుత్తా మాత్రం కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొత్త ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి, మధుసూదనాచారిలలో ఏవరో ఒకరు ఛైర్మన్ వైఎస్ ఛైర్మన్‌లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎల్. రమణ, బండ ప్రకాష్‌లు మంత్రిపదవి రేసులో ఉన్నారు. ఈక్రమంలో గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న శాసన మండలి ఛైర్మన్ ఎంపికపై కసరత్తు మొదలైంది. త్వరలోనే ప్రొటెం ఛైర్మన్ స్థానం ఖాళీ అవుతుండటంతో తదుపరిఎవరన్నదానిపై అధికార పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఎవరి ఛాన్స్ ఇస్తారన్నదీ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు, డిప్యూటీ ఛైర్మన్ కోసం సీనియర్ ఎమ్మెల్సీలు ప్రభాకర్, పట్నం మహేందర్ రెడ్డి, కాచుకుంట్ల దామోదర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, శాసనమండలి చీఫ్‌విప్‌తో పాటు కొన్ని విప్ పదవులు కూడా ఖాళీ అయ్యాయి. వీటికోసం కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఇందుకోసం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, నవీన్ కుమార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.అయితే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. ఓవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు రాజ్యసభకు ఎవరన్నది కూడా నిర్ణయించాల్సింది ఉంది. వీటికంటే ముందు మండలి ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్, చీఫ్‌విప్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది.