పండగల వేళ మరింత అప్రమత్తం అవసరం

అందరికీ వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు
విమానాశ్రయంలో ప్రత్యేకంగా పరీక్షలు
ఒమిక్రాన్ తీవ్రమైన వైరస్ కాదని, అప్రమత్తంగా ఉంటే మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించి మన ప్రయాణం కొనసాగితేనే రానున్న విపత్తును ఎదుర్కోగలమని అన్నారు. సంక్రాంతి పర్వదినాలు ముందున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఇప్పటి వరకు 60 శాతం మందే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రస్తుతానికి బూస్టర్ డోస్ అవసరంలేదని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకుంటునే మంచిదంటున్నారు. డెల్టాతో పోల్చితే నాలుగు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ప్రమాదకరం కాదని తెలిపారు. ఒమిక్రాన్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై దృష్టి సారించడంతోపాటు మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులను వేయించుకోవాలని సూచించారు.
కోవిడ్ సమయంలో డాక్టర్లు ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించారని అన్నారు. వారిపట్ల మనమంతా కృతజ్ఞతగా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు. ఈ కొత్త వేరియంట్ అతివేగంగా వ్యాప్తిచెందుతూ జిల్లాలకూ వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇప్పటికే ఒమైక్రాన్ కేసులను అధికారులు గుర్తించారు. అన్నిజిల్లాకూ విస్తరించే అవకాశాలున్నాయని భావిస్తున్న అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. దీంతో కరోనా మూడో ముప్పు సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి జరిగే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడటానికి వీల్లేదంటూ నిషేధం విధించారు. ఒమైక్రాన్ వేరియంట్ విదేశాల నుంచి వస్తున్నవారి ద్వారా వ్యాప్తి చెందుతుండటంతో గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజూ వచ్చే అంతర్జాతీయ విమానాల్లో నుంచి దిగే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌కు తరలించేలా.. లక్షణాలు లేకపోతే హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించాలని వైద్యాధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇప్పటి వరకు ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోని వారిని గుర్తించి వెంటనే వారికి టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి జనవరి మూడు నుంచి వ్యాక్సిన్లు అందించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి విద్యార్థు లకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒమైక్రాన్ కేసులు వెలుగుచూస్తే బాధితులకు వెంటనే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు ఇప్పటికే సర్వసన్నద్ధమై ఉన్నారు. వైద్య సేవల్లో ఎక్కడా లోపాలు జరగకుండా పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలకు ప్రత్యేక వైద్య బృందాలను ఇప్పటికే నియమించారు. అయితే వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్తలు పాటిస్తే ఒమైక్రాన్ వేరియంట్ ఎంత ఉధృతంగా వచ్చినా.. దాని బారినపడకుండా బయటపడవచ్చని చెప్పారు.