బ్యాంకుల్లో పారదర్శకత పెరగాలి !

కరోనాతో ఆర్థికంగా చితికిన వారిని ఆదుకోవడంలో బ్యాంకులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం లేదా ఆర్‌బిఐ పేద,మధ్యతరగతి ప్రజలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అండగా నిలవడం లేదు. గృహ,విద్యా,వ్యాపార రుణాలను సరళతరం చేయాలి. అలాగే వడ్డీలను ఇంకా తక్కువగా అందించాలి. అప్పుడే చితికిపోతున్న ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయగలం.
ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు కావాలనుకున్న వారికి సవాలక్ష కొర్రీలు పెట్టి వేధిస్తున్నాయి. నేరుగా బ్యాంక్‌కు వెళితే రుణాలు దొరుకుతాయన్న గ్యారెంటీ లేదు. నిండా ముంచి లక్షలకోట్లు ఎగవేసే వారికి పెద్దపీట వేస్తున్న బ్యాంకులు సామాన్యులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. దీనికితోడు ఎటిఎం ఛార్జీలు..మెయింటెనెన్స్ ఛార్జీలు,చెక్ బుక్ చార్జీలంటూ ఖాతాదారుడికి తెలియకుండానే అంతోఇంతో లాగేస్తున్నారు.
భారతీయ బ్యాంకులు సామాన్యులకు రుణాలు ఇవ్వండంలో ఎంత కఠినంగా ఉంటున్నాయో రుణయాప్‌లను బట్టి తెలుసు కోవచ్చు. సూటుబూటు వేసుకుని వచ్చే వారికి అప్పనంగా వేలకోట్లు కట్టబెట్టి రుణాలు ఇస్తున్న బ్యాంకులు.. సామాన్యులకు మాత్రం లక్ష ఇవ్వాలంటే సవాలక్ష కొర్రీలు పెడుతున్నాయి.
నిజానికి మన బ్యాంకులు సులభంగా రుణాలు ఇచ్చి నట్లయితే ఇంతటి దారుణాలు జరిగేవి కావు. అలాగే గ్రావిూణ ఆర్థిక రంగాన్ని ఊతం దక్కేది. గ్రామాల్లో ఆర్థిక కార్యకలాలపాలు సాగేవి. అలాగే లక్షల కోట్లు ఎగవేసిన మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారిని ఏవిూ చేయలేక చేతులెత్తేస్తారు. రాజకీయవేత్తలు వందల కోట్లు ఎగవేసినా కిమ్మనడం లేదు.
నిజానికి ఏళ్లతరబడి బ్యాంకుల్లో అకౌంట్లు పెట్టి నడుపుతున్న సామాన్యుల అవసరాలను గుర్తించడంలో బ్యాంకులు పూర్తిగా విఫలమయ్యా యని చెప్పాలి. బంగారం పెడితే తప్ప రుణాలు దక్కడం లేదు. విద్యారుణాల కోసం సామాన్యులు బ్యాంకు ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలకు సమాధానం లేదు.
గతంలో లాగా బ్యాంకుల్లో జవాబుదారీ తనం లోపించింది. ఇకపోతే క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రమే సిబిల్ లెక్కలు చూపుతోంది. సిబిల్ అన్నది కూడా బ్రహ్మపదార్థంగా మారంది. క్రెడిట్ కార్డులు ఇతరత్రా రుణాలు తీసుకున్న వారి విషయంలో అవిఎలా సిబిల్ స్కోర్ ఇస్తుందో తెలియడం లేదు. బాకీలు వసూలు చేసుకుంటున్న బ్యాంకులు సిబిల్ స్కోరు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇవన్నీ పరిష్కరించడంలో ఆర్‌బిఐ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో మైక్రో ఫైనాన్స్, ఈజీ లోన్ యాప్‌లు, కాల్‌మనీ దందాలు పెరిగిపోయాయి.
చిట్టీల పేరుతో కూడా కొందరు కుచ్చుటోపీలు పెడుతున్నారు. వీరంతా రుణాలు ఇచ్చి ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నవారే. వీరు ఎలాంటి రుణాలు తీసుకున్నా..అవసరానికి అప్పుతు తసీఉకున్నా పరువుకు భయపడి డబ్బు కడతారన్న ఏకైక లక్ష్యంతో రుణాలు ఇచ్చి వడ్డీలకు వడ్డీలు గుంజి నిలువునా ముంచే స్తున్నారు. అవన్నీ మారుతున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా లోన్ యాప్‌లు బయలుదేరాయి.
బ్లాక్‌మనీ ఉన్నవారు లేదా.. వడ్డీలతో డబ్బులు సంపాదించాలనుకున్న వారు ఇలా యాప్‌లు ఏర్పాటు చేసి ప్రజలను ఆకట్టుకుని రున ఊబిలో దించుతున్నారు. ఇందులో విదేశీ సంస్థలు కూడా ఉన్నట్లు గుర్తించారు. నిజానికి ఈ వ్యవహార మంతా పరిశీలిస్తే మన బ్యాంకుల డొల్లతనం బయపడుతుంది. ప్రధాని ప్రవేశపెట్టిన ముద్రాలాంటి రుణ పథకాలు కూడా సామాన్యులకు అందడం లేదు. అలాగే ప్రజలు కూడా ఇచ్చిన రుణాలు చెల్లించాలన్న శ్రద్ద కనబర్చక పోవడం కూడా ప్రధాన కారణంగా చూడాలి. అందుకే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, చిట్‌ఫండ్ లు ప్రజల అవసరాలను గుర్తించి వారిని లోబర్చుకుంటున్నారు.
రుణాల పేరుతో వారిని జలగల్లా పీలుస్తున్నారు. మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. రూపాయి సంపాదించినా పదిపైసలయినా వెనకేసుకోవడం అలవాటు. బ్యాంకుల్లో లెక్కలు చెప్పాల్సి వస్తుందని చాలామంది తమ పొదుపు కోసం ప్రైవేట్ చిట్టీలను, వ్యక్తులను , సంస్థలను ఆవ్రయిస్తున్నారు. బ్యాంకుల్లో ఇలాంటి వెసలుబాటు ఉంటే ప్రైవేట్ దోపిడికీ అవకాశం ఉండేదికాదు. కరోనా కారణంగా చాలామంది ఉద్యోగాలు పోయి..ఉపాధి కూలిపోయి…చేతుల్లో డబ్బులు లేక స్వయం ఉపాధి కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి వారికి నమ్మకంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. చేస్తున్న ఉద్యోగాలు ఊడిపోవడంతో… అప్పు ఇచ్చే వారికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి వారినే అప్పుల యాప్‌లు వలలో వేసుకుంటున్నాయి.
ష్యూరిటీ లేదంటూనే… నిబంధనల్లో భాగంగా ఫోన్‌లోని కాంటాక్ట్స్ మొత్తం ’యాక్సెస్’ తీసుకుంటాయి. అలా తమ వలలో చిక్కుకున్న వారిని వడ్డీ విూద వడ్డీ లాగుతారు. కట్టలేని పరిస్థితి వస్తే… ఫోన్లు చేసి వేధిస్తారు. బెదిరి స్తారు. అప్పు తీసుకున్న వారి ఫోన్లలోని కాంటాక్ట్స్‌కు మెసేజ్‌లు పంపిస్తారు. ఇలాంటి యాప్‌ల దురాగతా లపై ఇటీవలే పోలీసులు కూపీ లాగారు. ఈ వ్యవహారం తరవాత అయినా ఆర్‌బిఐ ప్రజలకు సులువుగా రుణాలు ఇచ్చే విషయంలో నిబంధనలు విధించి..బ్యాంకుకలు చేరువ చేసే పని చేయలేదు.
బ్యాంకుల రుణ పద్దతిని ప్రజల అవసరా లకు అనుగుణంగా మార్చాలి. బ్యాంకులు ప్రజల డబ్బుతో పెద్దలకు దోచిపెట్టడం గాకుండా ప్రజలు చిన్నాచితకా వ్యాపారలు చేసుకునేందుకు అనుగుణంగా..అందుకు అసవరమైన విధంగా రుణాలు ఇవ్వగలగాలి. రుణం కావాలంటే ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయిందన్న బాధలు పోవాలి.
సంస్కరణల పేరుతో ఊదరగొడుతున్న కేంద్రం ముందుగా సిబిల్ వ్యవస్థను పారదర్శకం చేయాలి. అది ఎక్కడుంటుందో తెలిసేలా చేయాలి. దాని స్కోరు ఎలా నిర్ధారిస్తారో ప్రజలకు తెలియచేయాలి. అలాగే బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇచ్చేలా చూడాలి. అనవసర కటింగ్‌లను ఆపాలి. ఖాతాదారుడే దేవుడన్న మహాత్ముడి మాటలను నిజం చేయాలి.