Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అనధికార లే ఔట్లపై చర్యలకు రంగం సిద్దం

అక్రమ లే ఔట్లను గుర్తించాలని ఆదేశాలు
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారికి నోటీసులు
అనుమతులు లేని వాటికి రిజిస్టేష్రన్లు చేయరాదని ఆదేశాలు
అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వెలిసిన అక్రమ లేఅవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణలు డిటిసిపి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 80వేల ఎకరాల్లో 14వేల అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడిరచడంతో తక్షణం వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా లేఅవుట్లను సిద్దం చేస్తున్నారని, వాటిపై నియంత్రణలో అధికారులు దృష్టి సారించాలని అన్నారు.

అనుమతి ఉన్న లేవుట్లకు మాత్రమే రిజిస్టేష్రన్లు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఖచ్చితంగా ప్రతి లే అవుట్‌ డిటిసిపి అనుమతి పొందేలా చూడాలని అన్నారు. సచివాలయంలో మంగళవారం జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. పథకం అమలుపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం లు అధికారులతో సవిూక్ష నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, సర్వే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్టేష్రన్‌, గనుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అధికారులు పథకం అమలు, ప్రగతిపై మంత్రుల కమిటీకి వివరించారు. గ్రామాల్లో గతంలో ఉన్న గ్రామకంఠం భూముల్లో క్రమంగా నివాసాలు రావడం, సదరు భూమి నిర్మాణాలతో వినియోగంలోకి రావడం వల్ల కొత్తగా నిర్వహిస్తున్న డ్రోన్‌ సర్వేల్లో దీని విస్తీర్ణం పెరుగుతోందని అధికారులు వివరించారు. రికార్డుల ప్రకారం గ్రామకంఠంలోని భూముల్లో నివాసాలకు ఉన్న చట్టబద్దతను గుర్తించడం, వాటికి హక్కు పత్రాలను అందించే క్రమంలో ఎదురవుతున్న అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు..

ఈ నేపథ్యంలో గ్రామకంఠం కోసం కూడా వెబ్‌ ల్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కింద మొదటి దశలో 5 వేలగ్రామాల్లో సర్వే పూర్తి చేసి, హక్కుపత్రాలను జారీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. 2022 జూన్‌ నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 1096 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయ్యిందని, వీటిల్లో 594 గ్రామాల్లో డ్రోన్‌ మ్యాప్‌లను తీసుకోవడం జరిగిందన్నారు. 433 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తయ్యిందని, మరో 86 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పక్రియ కొనసాగుతోందని వివరించారు. ఇప్పటి వరకు దాదాపు 83.43 శాతం గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడి౦చారు. 138 గ్రామాల్లో గ్రౌండ్‌ వాలిటేషన్‌ కోసం మ్యాప్‌లను స్వీకరణ పూర్తయ్యిందని, వాటిల్లో 115 గ్రామాల్లో గ్రౌండ్‌ వాలిడేషన్‌ పక్రియ పూర్తి చేసినట్లు తెలిపిన అధికారులు. మిగిలిన 23 గ్రామాల్లో ఈ పక్రియ కొనసాగుతోందని తెలిపిన అధికారులు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో భూసర్వే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా ఒక పారదర్శక విధానంను అమలులోకి తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ ఈ పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. నిర్ధిష్ట సమయంలోనే సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా భూములకు శాశ్వతంగా భూహక్కు కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి సిసిఎల్‌ఎ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, పిఆర్‌/ఆర్డీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ కోన శశిధర్‌, సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్దార్థ్‌జైన్‌, డిఎంజి విజి వెంకటరెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు.