ఖమ్మం రాజకీయాల్లో పాతుకుపోతున్న పువ్వాడ

మాజీమంత్రి తుమ్మల సైలెంట్ కావడంతో ఆయనదే పైచేయి
బలమైన క్యాడర్‌తో అధికార పార్టీకి అండగా ఎదిగిన అజయ్
డీలా పడ్డ కాంగ్రెస్…బలం చాటేందుకు బిజెపి యత్నాలు
ప్రజా పోరాటాల్లో వెనక్కి తగ్గేది లేదంటున్న సిపిఐ
ఖమ్మం రాజకీయాల్లో ఇప్పుడు అంతా మంత్రి పువ్వాడ హవానే నడుస్తోంది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైలెంట్ అయ్యారు. పార్లమెంటరీ పార్టీనేత నామా నాగేశ్వర రావు కూడా ఢిల్లీ కే పరిమితం అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో అన్నింటా టిఆర్‌ఎస్ విజయంతో పువ్వాడ బలం పెంచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్‌కుమార్ ఒక్కరే గెలుపొందినప్పటికీ.. ఆ తర్వాత నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వైరా స్వతంత్ర ఎమ్మెల్యే, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ లో చేరడంతో జిల్లాలో టీఆర్‌ఎస్ బలం ఏడుకు చేరింది. దీంతో ఇక అన్ని ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులు లేరన్న ధోరణిలో పట్టు సాధించారు.
ఉమ్మడి జిల్లాలో బీజేపీ ప్రభావం చూపక పోయినప్పటికీ.. బలపడేందుకు ప్రయత్నాలు వేగిరం చేసింది. ఇటీవలి హుజైఊరాబాద్ ఫలితాలతో జిల్లాలో చేరికలు కూడా ఊందుకున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియామకం తరవాత జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి. గతంలో అనేక పర్యాయాలు ప్రయత్నించినా ఆశించిన రీతిలో ఆ పార్టీ బలం పుంజుకోలేకపోయింది. దీంతో వచ్చే ఉన్నికల్లో అయినా సత్తా చాటాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అపజయాలు ఆ పార్టీని కొంత కుంగదీశాయి. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు మరోసారి కొనసాగడంతో పార్టీ మరింత దెబ్బతిన్నది. కమ్యూనిస్టులు పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేపట్టినా.. అనుకున్న విధంగా రాణించలేకపోయాయి. బీజేపీ భవిష్యత్‌పై ఆశలు పెంచుకుంటూ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి మండల, జిల్లాపరిషత్, లోక్‌సభ ఎన్నికల వరకు టీఆర్‌ఎస్ వరుస విజయాలు సాధించింది. దీంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనని ధీమాలో ఉన్నారు. రెండుజిల్లాల్లోనూ మెజారిటీ ఎంపీపీలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఆరు సీట్లను దక్కించుకున్నప్పటికీ.. అందులో నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ, పంచాయతీ, మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ డీలా పడిరది. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు శాసనసభా ప్రతిపక్ష హోదా దక్కినప్పటికీ.. కొన్నిరోజులకే చేజారిపోయింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పాలేరు శాసనసభ్యుడు కందాల ఉపేందర్‌రెడ్డి ఒకరి తర్వాత ఒకరుగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. మొత్తంగా కాంగ్రెస్ డీలాపడ్డా తమ సత్తా కూడా చాటుతామని అంటున్నారు.
వామపక్షాల విషయానికి వస్తే.. సీపీఎం, సీపీఐ, ఎన్డీ ప్రజాపోరాటాల్లో ముందున్నా.. ఎన్నికల్లో వెనుకబడ్డాయి. అయితే మారిన రాజకీయ సవిూకరణాల్లో బిజెపి ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే ప్రజాపోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు మొదలు అనేక సమస్యలపై కమ్యూనిస్టు పార్టీ పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని అన్నారు. తమకు అసెంబ్లీలో బలం లేకున్నా ప్రజల్లో మాత్రం విశ్వాసం చెక్కు చెదరలేదన్నారు.
ప్రజాసమస్యలపై నిరంతరం ఆందోళనలు, ఉద్యమ కార్యచరణ ఒక్క కమ్యూనిస్టు పార్టీకే సొంతమన్నారు. పోరాట పంథాతోనే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎలుగెత్తి చాటడంతో పాటు పేదల పక్షాన నిలుస్తూ ప్రజాసమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టు పార్టీ ముందు నిలుస్తుందన్నారు. అధికారం, పదవుల ఆకాంక్షతో తెలంగాణ ఆకాంక్షలు మరుగున పడ్డాయన్నారు. ఎర్రజెండా నీడలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.
దేశంలో సెక్యులరిజం కాపాడడంతోపాటు మతోన్మాదులను నివారించడంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజల హక్కులు హరిస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలతో మార్కెటింగ్ వ్యవస్థను పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకెళ్లిందన్నారు. రైతుల పక్షాన సీపీఐ పోరాటంలో ముందుందన్నారు. పాలక ప్రభుత్వాల దోపిడీ విధానాల వల్ల దోపిడిదారులు కోట్లకు
పడగలెత్తుతు న్నారన్నారు. ప్రజాసంపద దోచుకుంటున్నారని విమర్శించారు.