*మన్ననూర్ ఐటిడిఏలో భారమంతా ఒక్కడిపైనే*

*భారమంతా ఒక్కడిపైనే*

*పీ.ఓ సహా అన్నీ పోస్టులూ ఖాళీ*

 

*ఐదేళ్లుగా విధుల్లో ఒక్కడే సీనియర్ అసిస్టెంట్*

 

*స”హ” చట్టంతో వెలుగులోకి మన్ననూర్ ఐటిడిఏ దుస్థితి*

 

నాగర్ కర్నూల్, డిసెంబర్26 (నిజం న్యూస్):

 

బంగారు తెలంగాణలో ఐటిడిఏల పరిస్థితి ఇలా ఉంది. 2014 లో కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటిడిఏ నుండి తెలంగాణ రాష్టానికి ప్రత్యేకంగా ఏర్పరచిన మన్ననూర్ ఐటిడిఏ అధికారుల రాక కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఐటిడిఏ ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఓకే ఒక సీనియర్ అసిస్టెంట్ మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. 57:43 రేషియోలో ఉద్యోగులను కేటాయించాల్సి న స్థితిలో మన్ననూర్ ఐ.టి.డి.ఏ లో మాత్రం పీ.ఓ సహా ఏ పోస్టు కూడా ఇంకా మంజూరు చేయకపోవడం ఐటిడిఏ లపై ప్రభుత్వ వైఖరికి నిదర్శనం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గంగాధర కిశోర్ కుమార్ అనే వ్యక్తి మన్ననూర్ ఐటిడిఏ లో శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు, ఎల్ టిఆర్ కేసుల వివరాలకోసం సమాచార హక్కు చట్టం కింద ధరఖాస్తు చేసాడు. ఈ ధరఖాస్తుకు ఐటిడిఏ లోని పీఐఓ ఇచ్చిన సమాధానం చూస్తే ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. శ్రీశైలం ఐటిడిఏ కర్నూలు జిల్లా నుండి సీనియర్ అసిస్టెంట్ అయిన మహమ్మద్ జాఫర్ హుస్సేన్ బదిలీ ద్వారా వచ్చారని మిగతా పోస్టులు ఏవీ మంజూరు కాలేదని తెలిపారు. అలాగే ఏడిఓ స్థాయిలో వెయ్యి ఎకరాలకు పైచిలుకు 137 ఎల్టీఆర్ కేసులు పెండింగులో ఉన్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

మన్ననూర్ ఐటిడిఏ 2014 సంవత్సరంలో ప్రపోస్ చేయబడి 2015 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. పీటీజి చెంచు-(ప్రీమిటివ్ ట్రైబల్ గ్రూప్) ఆదిమ గిరిజన సమూహాలు గా గుర్తించబడిన ఐదు జిల్లాలలోని 26 మండలాల ప్రజలు మన్ననూర్ ఐటిడిఏ పరిధిలోకి వస్తారు.

1.మహబూబ్ నగర్ 04 మండలాలు 20 గ్రామాలు

2.నాగర్ కర్నూలు 08 మండలాలు 80 గ్రామాలు

3.నల్గొండ 04 మండలాలు 09 గ్రామాలు

4.రంగారెడ్డి 02 మండలాలు 11 గ్రామాలు

5.వికారాబాద్ 08 మండలాలు 22 గ్రామాలు కలిపి ఐదు జిల్లాలలోని 26 మండలాల్లో 150 గ్రామాల నుండి సుమారు 14 వేల పైచిలుకు చెంచు తెగకు చెందిన ప్రజలు మన్ననూర్ ఐటిడిఏ ను నమ్ముకుని ఉన్నారు. *(ఆర్ డిటి- రూరల్ డౌలప్ మెంట్ ట్రస్ట్ వారి సర్వే ప్రకారం)* అయితే వారి బాగోగులు చూసుకోవడానికి అధికారులెవ్వరిని ప్రభుత్వం ఇప్పటికీ నియమించలేదు. ఉన్న ఒక్క సీనియర్ అసిస్టెంటే ఐటిడిఏ మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.