కారుచౌకగా ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం

కారుచౌకగా ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం
ఎల్‌ఐసి లాంటి సంస్థలను తెగనమ్మే యత్నాలు
సమిష్టిగా అడ్డుకోకపోతే ఇబ్బందులు తప్పవు
విజయవాడ: ప్రభుత్వరంగ సంస్థలను, ఖనిజాలను, దేశ సంపదను కారుచౌకగా తన తాబేదారులైన కార్పొరేట్లకు అప్పగించటానికి మోడీ ప్రభుత్వం చట్టాలు చేయటంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న పెద్దగా స్పందన రావడం లేదు. ఒక్క సాగుచట్టాల విషయంలోనే రైతు ఉద్యమాలకు మోడీ తలవంచారు. అయితే చట్టాలను మళ్లీ తెస్తామంటూ కేంద్రమంత్రి తోమర్‌ చేసిన ప్రకటన మోడీ కుట్రలను బహిర్గతం చేస్తోంది.

ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం రావడంతో ఇందుకు వ్యతిరేకంగా అన్ని రంగాల ఉద్యోగులు అనేక పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలన్నింటినీ బలమైన ఐక్య ఉద్యమంగా మార్చే ప్రయత్నాలు సాగితేనే ప్రభుత్వ అక్రమలను అడ్డుకోగలమని లెఫ్ట్‌ నేతలు అన్నారు. ఎదిరించి పోరాడటమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని లెఫ్ట్‌ నేతలు అభిప్రాయ పడ్డారు.

బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 16, 17 తేదీలలో జరిగిన జాతీయ సమ్మె దిగ్విజయమైంది. సామాన్య ప్రజానీకం, ఖాతాదారుల నుండి విశేష స్పందన లభించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ చట్టాలను శీతాకాల సమావేశాలలో ఆమోదం పొందే విషయంలో వెనకడుగు వేసినట్టు సమాచారం.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చరిత్రాత్మకమైన సుదీర్ఘ పోరాటం నడిపిన రైతు సంఘాల ఐక్యవేదిక పోరాటలు ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిని ఇచ్చింది . అదే స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమాలను ఐక్యం చేయాల్సి ఉంది. ఇది భవిష్యత్‌ పోరాటాలకు మార్గదర్శిగా రూపొందాలి.

రైల్వే, ట్రాన్స్‌పోర్ట్‌, విమానయాన రంగం, కోల్‌ లాంటి అనేక రంగాలలో ఉద్యమిస్తున్న 65 సంఘాల ఐక్యతతో ఏర్పడిన అఖిల భారత ప్రయివేటీకరణ వ్యతిరేక వేదిక కూడా తమవంటు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ ఏరూపంలో ఉన్నా దానిని వ్యతిరేకించాల్సిందే. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న అన్ని రంగాలను కలిపి ఐక్య ఉద్యమాన్ని నిర్మించటం ద్వారా అడ్డుకోవాలి.

ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలపై ప్రజలను కూడగట్టి ప్రయివేటీకరణ ప్రమాదాల గురించి వివరించాల్సిన అసవరం ఉంది. వారిని చైతన్య పరచటం అవసరం. ఆర్థిక రంగంలో ప్రత్యేకించి బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న పరిస్థితులను, ప్రయివేటీకరణ ప్రమాదాన్ని వివరిం చాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులలో వాటాల అమ్మకం, ప్రయివేటు కంపెనీలకు లైసెన్సులు ఇవ్వటం, యాజమాన్య స్వరూపంలో మార్పులు చేయడం వంటివి మనదేశానికి ప్రమాకరంగా పరిణమించనున్నాయి.

అత్యంత వేగంగా బ్యాంకులను, ఇన్సూరెన్స్‌ రంగాన్ని ప్రయివేటీకరించే చట్టాలు చేయటానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది. జనరల్‌ ఇన్సూరెన్స్‌ రంగ ప్రయివేటీకరణకు చట్టం చేసింది. ఎల్‌ఐసిలో వాటాల విక్రయానికి సిద్ధమైంది. భారీ లాభాల్లో ఉన్న ఎల్‌ఐసిని ప్రయివేటీకరించే అధికారం ప్రభుత్వానికి ఎక్క డుంది. అలాగే బ్యాంకుల ప్రయివేటీకరణ జరిగితే ప్రజల సొమ్ముకి రక్షణ ఎక్కడ ఉంటుందన్న భయాలు ఉన్నాయి.

విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించి, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వరంగ సంస్థలను, ఖనిజాలను, దేశ సంపదను కారుచౌకగా తన తాబేదారులైన కార్పొరేట్లకు అప్పగించటానికి చేస్తున్న ప్రయత్నాలు గట్టిగా అడ్డుకోవాలి. అప్పుడే దేశం ముందుకు సాగగలదు.