దొంగ దీక్షలు మాని ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పండి…ఎర్రబెల్లి
దొంగదీక్షలు మాని ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పండి
దేశంలో పరిశ్రమలను అమ్ముతూ ప్రజలను ముంచారు
విశాక ఉక్కు అమ్మకం, సింగరేణి ప్రైవేటీకరణను ఆపండి
బండి సంజయ్ దీక్షపై మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్,: బండిసంజయ్ దీక్షతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దేశంలో ఎన్ని ఉద్యోగాలు లెక్క చెప్పే దమ్ముందా అని నిలదీశారు. తప్పించుకుని తిరిగే బిజెపి సర్కార్ అని మండిపడ్దారు. ధాన్యం కొనరు…రైతులను ఆదుకోరు.. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వరు.. మరి విూరెందుకు ఇక అని మండిపడ్డారు. జవాబుదారీ తనం లేని దిక్కుమాలిన పాలన సాగుతోందన్నారు.
విశాఖలాంటి ఉక్కు పరిశ్రమను అమ్మాలనడం, సింగరేణి బొగ్గుబావులను ప్రేవేటీకరించడం నిజం కాదా అన్నారు. అంలాంటి విూరు టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించ డమా అని అన్నారు. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో డిపార్టుమెంట్ల వారీగా వివరాలన్నీ ప్రజల ముందు ఉంచిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. కేంద్రంలో ఏడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వల్ల యువతకు ఉపాధి,ఉద్యోగావకశాలు దక్కకుండా పోయాయని అన్నారు. ఉన్న పరిశ్రమలను అప్పనంగా అమ్మడం మినహా చేసిందేవిూ లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా? అని అడిగారు. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడుల స్వర్గంగా, ఉద్యోగ ఉపాధి దుర్గంగా నిలబెట్టింది కెసిఆర్ అన్నారు. ఇక్కడి యువతకు ఉపాధి కోసం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్కులకు, ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలకు ఒక్కపైసా అదనపు సాయం చేయని దుర్మార్గపు సర్కారు విూదన్నారు.
హైదరాబాదుకున్న అద్భుత అవకాశమైన ఐటిఐఅర్ ప్రాజెక్టును రద్దు చేసింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. లక్షలాది యువత ఐటి జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి?మళ్లీ విూరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? అని మండిపడ్డారు. కేంద్ర
రంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన మోడీ ప్రభుత్వం తెగ నమ్ముతున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగులకు దిక్కులేకుండా పోతోందని అన్నారు. ఆర్‌టిసి, విద్యుత్, సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకుంటున్న తెలంగాణ ప్రభుత్వంపై కోకట్టి వీటిని కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నది నిజం కాదా అన్నారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్టాల్లో విూరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లపైన చెప్పే దైర్యం ఉందా అని మంత్రి ప్రశ్నించారు.
ఏ రాష్ట్రంలో నైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా చెప్పాలన్నారు. బిజెపి పాలిత ఉత్తరాది రాష్టాల్ల్రో ఉపాధిలేక లక్షల మంది యువత బతుకుతెరువు కోసం తెలంగాణకు వలస వస్తున్నది నిజం కాదా? అని ప్రశళ్నించారు. ఇక్కడ పెరిగిన ఉపాది అవకాశాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ ఖాళీలు ప్రకటించి ముందు వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి ఉద్యోగ ప్రయత్నాల నుంచి పక్కదారి పట్టించడానికి యత్నిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. హావిూ ఇచ్చిన ఐటిఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హావిూలపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.