Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మిర్చి రైతు కంట్లో కారం

అన్నిరకాలుగా నష్టపోయి హైరానా

నకిలీ విత్తన విక్రేతలపై చర్యలు శూన్యం

ఆదుకోవాలంటూ ఎదురుచూస్తున్న రైతాంగం

మిర్చి రైతు కంట కన్నీరు కారుతోంది. కల్తీ, నకిలీలను సహించేదే లేదన్న ప్రభుత్వ పాలనలో వాటిని అమ్ముకొని రైతులను నిలువునా మోసం చేసిన కంపెనీలపై ఒక్క చర్య కూడా లేదు. కల్తీ మిర్చి నారు అమ్మిన నర్సరీలపై, డీలర్లపై కేసుల్లేవు. కంపెనీల నుండి నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు రోడ్డెక్కితే పోలీస్‌ దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. కంపెనీలు, నర్సరీల నుండి పరిహారం ఇప్పించే బాధ్యత నుండి ప్రభుత్వం చేతులెత్తేసింది. మిర్చి రైతులు లబోదిబోమంటుండగా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.

బాధిత రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎప్పటికో వ్యవసాయశాఖ మంత్రి స్పందించారు. తెగుళ్లపై అధ్యయనానికి ఉద్యానవన వర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని వేశామన్నారు. ముఖ్యమంత్రి ఆదుకుంటారంటూ మరి కొంత మంది మంత్రులు రైతులను చల్లబర్చేయత్నం చేశారు.

నకిలీ, కల్తీ విత్తనాలు, నారు అమ్మిన వారిపై చర్యల విషయంలో ఇప్పటికీ ప్రభుత్వానిది మౌనమే. కంపెనీలు, డీలర్ల మెడలు వంచి రైతులకు పరిహారం ఇప్పించాల్సిన సర్కారు విూనమేషాలు లెక్కిస్తోంది. నకిలీ కంపెనీలు స్వైర విహారం చేస్తున్నా ఊరూరా నెలకొల్పిన సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, పోలీసులు, విజిలెన్స్‌, ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నాయో తెలీదు.మొత్తంగా ఈ మారు మిరప పండి౦చిన రైతాంగం కష్టాల సుడిగుండంలో చిక్కుబడి౦ది. కల్తీ విత్తనాలు, నకిలీ నారు, అంతుబట్టని తెగుళ్లు, అధిక వర్షాలు, వరదలు, మధ్య మధ్య వర్షాభావం కట్టకట్టుకొని ముప్పేట దాడి చేశాయి.

రైతులకు భారీ నష్టాలు మిగిల్చాయి. అచేతనావస్థలో పడ్డ లక్షలాది మంది రైతులు తమకు ప్రభుత్వమే దిక్కని వాపోతున్నారు. రాష్ట్రంలో సాగయ్యే వాణిజ్య పంటల్లో పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో వేసేది మిర్చినే. ఒక ఎకరాలో మిర్చి సాగుకు కనీసం రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. అదే కౌలు రైతులకైతే ఇంకా అదనం. రెండు లక్షల ఎకరాల్లో పైరు పూర్తిగా పోయిందంటున్నారు. ఎకరాకు రూ.లక్ష వేసుకున్నా తక్కువలో తక్కువ రూ.2 వేల కోట్ల పెట్టుబడి నష్టం. ఉత్పత్తి నష్టాన్ని అంచనా వేస్తే రైతులకు జరిగిన నష్టం కొన్ని రెట్లు ఎక్కువ.

మిర్చిని అధికంగా సాగు చేసిన గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, అనంతపురం జిల్లాల రైతులు ఈ నష్టాల్లో సింహభాగం భరిస్తున్నారు. నల్ల తామర పురుగు ఆంధ్రాతో పాటు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర లోనూ వ్యాపించిందని చెబుతున్నారు. నాలుగు రాష్టాల్ల్రో వ్యాపించి నందున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది. కేంద్రం స్పందించే వరకు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం, బీమా చెల్లించాలి. నకిలీ, కల్తీ విత్తనాలమ్ముతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలి. మిగిలిన పంటకైనా గిట్టుబాటు ధర కల్పించి మిర్చి రైతులను ఆదుకోవాలి.